పూసపాటిరేగ మండలం కోనాడ కూడలి సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువ వైద్యురాలు శ్రుతి కాత్యాయిని (26) చికిత్స పొందుతూ మృతి చెందారు. విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శనివారం కన్నుమూశారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. అసలేం జరిగిందంటే..
విజయనగరం, అక్టోబర్ 4: విజయనగరం జిల్లా కవిటి మండలం బొరివంక గ్రామానికి చెందిన గున్న రామనాథం కుటుంబ సభ్యులతో కలిసి కారులో రాజమహేంద్రవరం నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. కోనాడ సమీపానికి చేరుకున్న సమయంలో కారులోని టైరు పంక్చర్ కావడంతో వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో రామనాథం భార్య లక్ష్మీబాయి, కుమార్తె శ్రుతి కాత్యాయినికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో కాత్యాయిని శనివారం చికిత్స పొందుతూ మృతి చెందారు.
కాత్యాయిని ఈ ఏడాదే బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (BHMS) పూర్తి చేశారు. వైద్య విద్యను పూర్తిచేసిన అనంతరం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. పురిటిగెడ్డ ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో.. గత కొంతకాలంగా ఆ ప్రాంత ప్రజలకు తనవంతు వైద్య, ఆరోగ్య అవగాహన సేవలు అందిస్తున్నారు. వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేవారు. గ్రూప్ కాల్స్ ద్వారా నేరుగా మాట్లాడి.. కిడ్నీ సంబంధిత సమస్యల బారిన పడకుండా ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, ఎలాంటి అలవాట్లు పాటించాలి అనే విషయాలపై సూచనలు ఇచ్చేవారు. ‘శ్రుతి వెల్నెస్ గ్రూప్’ పేరుతో జూమ్, వాట్సప్ కాల్స్ ద్వారా రోగులకు వైద్య సహాయం, ఆరోగ్య సలహాలు అందించేవారు.
కాత్యాయిని తాతయ్య రాజేంద్రం మరణించి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శనివారం కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామానికి బయలుదేరారు. కార్యక్రమాలు పూర్తయిన తర్వాత కొన్ని రోజులు సొంతూరిలో ఉండి ఉద్దానం ప్రాంతంలోని గ్రామాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగించాలని ఆమె ప్రణాళిక వేసుకున్నారు. అయితే ఈలోగానే జరిగిన రోడ్డు ప్రమాదం ఆమె జీవితాన్ని విషాదాంతం చేసింది. యువ వైద్యురాలిగా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న కాత్యాయిని అకాల మరణం కుటుంబ సభ్యులు, బంధువులు, ఆమెతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వారిని తీవ్ర విషాదంలో ముంచింది.
Also read
- నూకరాజు కుటుంబానికి నరకం చూపిన సాధిక్
- సోమవారం శివుడితో పాటు చంద్రుడిని ఎందుకు పూజిస్తారు? గంగాజలంతో అభిషేకం వెనుక ఉన్న రహస్యం ఇదే!
- Indira Ekadashi: ఇందిరా ఏకాదశి రోజునే 4 శుభ యోగాలు.. ఈ పూజలు చేస్తే విశేష పుణ్యఫలాలు!
- నేటి జాతకములు 5 అక్టోబర్, 2026
- 24 ఏళ్లుగా కొడుకు జాడ కోసం ఎదురుచూపులు.. సాధువు వేషం వేసి నకిలీ కొడుకు నాటకం! చివర్లో సినీ ఫక్కీ ట్విస్ట్





