ప్రకాశం జిల్లా కంభం మండలంలో రెండున్నరేళ్ళ బాలుడు లక్షిత్ అదృశ్యమై రెండు రోజుల తర్వాత శవంగా దొరికాడు. అంగన్వాడీ కేంద్రానికి వెళ్లిన బాలుడు తిరిగి రాలేదు. పోలీసులు గాలించినా ఫలితం లేకపోగా, చివరకు గ్రామ శివారులో మృతదేహం లభించింది. హత్యాయత్నమా, ప్రమాదమా అనేది దర్యాప్తులో తేలాలి.

ముక్కుపచ్చలారనేలేదు.. ఆ తల్లి అచ్చట, ముచ్చట తీరనేలేదు.. పొత్తిళ్ళల్లో ఒదిగిపోయిన ఆ ముద్దు నవ్వుల మోము వెచ్చని శ్వాస ఇంకా వీడనే లేదు.. ఇంతలో కాళ్ళ కింద భూమి కదిలిపోయి అమాంతం భూమిలో కూరుకుపోయినట్టు అయింది ఆ కన్నతల్లికి.. రెండు రోజులుగా కనిపించకుండా పోయిన రెండున్నరేళ్ళ బాలుడ్ని వెతుకుతూ తల్లడిల్లుతున్న ఆ మాతృమూర్తికి గర్భశోకం అశనిపాతంలా తాకింది.. అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళి అక్షరాలు నేర్చుకుంటానని బుడిబుడి అడుగులతో వెళ్ళిన బాలుడు ఊరి శివారులో శవమై కనిపించడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.. చిన్నారి కోసం గుండెలవిశేలా రోదిస్తున్నారు.. ప్రకాశంజిల్లాలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన రెండున్నరేళ్ళ బాలుడి ఉదంతం విషాదంగా ముగిసింది.
ప్రకాశంజిల్లా కంభం మండలం లింగోజి పల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం అంగన్వాడి కేంద్రానికి వెళ్లి అదృశ్యమైన మూడేళ్ళ బాలుడు లక్షిత్ గ్రామ శివారులో శవమైతేలాడు. గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలాలలో బాలుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రెండు రోజుల క్రితం అదృశ్యమైన బాలుడి కోసం 10 పోలీసు బృందాలు గాలించగా చివరకు బాలుడి మృతదేహం లభించింది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు బాలుడిని హత్య చేసి అక్కడ పడవేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రెండురోజుల క్రితం అదృశ్యం…
రెండున్నరేళ్ళ బాలుడు లక్షిత్ ఈ నెల 8వ తేదిన అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళి తిరిగిరాలేదు. బాలుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులు, గ్రామస్థులు ఊరంతా గాలించారు.. తల్లిదండ్రులు శ్రీను, సురేఖలు కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే చుట్టుపక్కల గ్రామాల్లో వెతికారు. అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు రెండు రోజులు తీవ్రంగా గాలించినా ఆచూకీ లభించలేదు. బాలుడి అదృశ్యంపై గ్రామంలో మార్కాపురం డీఎస్‌పీ నాగరాజు విచారించారు. అనంతరం బృందాలుగా పోలీసులు విడిపోయి లింగోజీపల్లితో పాటు సూరేపల్లి, ఎల్.కోట, మార్కాపురం, తర్లుపాడు, గిద్దలూరు, పొదిలి, బేస్తవారపేట ప్రాంతాల్లో గాలించారు. బాలుడి ఫొటోలు, వివరాలను ముద్రించిన కరపత్రాలను రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో అంటించారు. రెండో రోజు 9వ తేదిన గ్రామ సమీపంలోని నల్లవాగు దగ్గర బాలుడు లక్షిత్ చెప్పులు కనిపించడంతో ఎవరైనా అపహరించారా అన్న కోణంలోనూ ఆరా తీశారు. డ్రోన్ సాయంతో అన్వేషించినా బాలుడి వివరాలు తెలియకపోవడంతో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. అంగన్‌వాడీ కేంద్రానికి 8వ తేది వచ్చిన బాలుడు ఎప్పటిలాగే ఆడుకున్నాడని, ఆ తరువాత ఇంటికి బయలుదేరి చేరకపోవడంతో తల్లిదండ్రులు విచారించారని అంగన్‌వాడీ కేంద్రం సిబ్బంది చెబుతున్నారు.
విషాదంగా మారిన అదృశ్యం..
కంభం మండలం లింగోజిపల్లి గ్రామంలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన రెండున్నరేళ్ళ బాలుడు లక్షిత్ ఉదంతం విషాదాంతంగా ముగిసింది. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంలను రంగంలోకి దించి పోలీసులు విచారణ చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. గ్రామానికి అతి సమీపంలో బాలుడి చెప్పులు లభించగా బాలుడిని ఎవరో కిడ్నాప్ చేసి ఉండవచ్చని పోలీసులు తొలుత అనుమాన వ్యక్తం చేశారు. 10వ తేది తెల్లవారుజామున సూరే పల్లి సమీపంలోని పొలాలలో బాలుడి మృతదేహం కనిపించింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం ఆధారంగా వివరాలు సేకరించేందుకు ప్రయత్నించారు. డాగ్ స్క్వాడ్ తో గాలించారు. బాలుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు. ఎవరైనా ఎత్తుకెళ్ళి చంపేశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.. మరోవైపు ఎవరైనా గ్రామంలో బాలుడి కుటుంబంపై కక్షకట్టి చంపి ఊరికి దూరంగా పారేశారా అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు కంభం సిఐ మల్లికార్జున తెలిపారు. ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లభించలేదని అన్నారు. బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం లభించిన ఆధారాలను బట్టి కేసు వివరాలు అందిస్తామని సిఐ తెలిపారు.
Also read
- నేటి జాతకములు…11 జూలై, 2025
- Hindu Epic Story: స్వర్గాధికధిపతి ఇంద్రుడు ఒళ్ళంతా కళ్ళే.. ఈ శాపం వెనుక పున్న పురాణ కథ ఏమిటంటే..
- Vipareeta Raja Yoga: నెల రోజులు చక్రం తిప్పేది ఈ రాశులవారే..! ఇందులో మీ రాశి ఉందా?
- నా లాగా ఎవరూ మోసపోవద్దు.. కుమారుడు జాగ్రత్త.. అయ్యో అనూష
- Andhra: వదినపై కన్నేసి సెట్ చేశాడు.. కానీ, మరిది అడ్డుగా ఉన్నాడని.. మాస్టర్ స్కెచ్.. చివరకు