అర్ధరాత్రి నిశ్శబ్దం.. హాస్టల్‌లో గాఢ నిద్రలో ఉన్న చిన్నారులు. ఉన్నట్లుండి ఒక్కసారిగా కేకలు, అరుపులు భయంతో ఏడుపులు.. ఏమైందో అర్థం కాక ఉపాధ్యాయులు పరిగెత్తుకుంటూ వెళ్లేలోపే దారుణం జరిగింది. ఎలుకల దాడితో బాలికలు గాయపడి ఏడుపు లంకించుకున్నారు. ఈ సంఘటన ఎన్టీఆర్ జిల్లా కలకలం రేపుతోంది..
కొండూరు, ఫిబ్రవరి 13: ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం కొండూరు పరిధిలో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల హాస్టల్‌లో రాత్రి నిద్రపోతున్న సమయంలో బాలికలపై ఒక్కసారిగా ఎలుకలు దాడి చేశాయి. చేతులు, కాళ్లు, ముఖంపై కొరికేయడంతో బాలికలు భయంతో కేకలు వేశారు. దీంతో హాస్టల్ అంతా అలజడి నెలకొంది. బాలికల అరుపులు విన్న ఉపాధ్యాయులు, సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని ఎలుకలను తరిమికొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ దాడిలో మొత్తం 11 మంది బాలికలకు గాయాలయ్యాయి. కొందరికి రక్తం కూడా రావడంతో హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ విషయం జిల్లా అధికారుల దృష్టికి రావడంతో జిల్లా కలెక్టర్ లక్ష్మీశా వెంటనే స్పందించారు. హాస్టల్లో అపరిశుభ్రత, భద్రత చర్యలపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎలుకల సమస్య ఎలా వచ్చింది? నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉన్నాయన్న అంశాలపై నివేదిక ఇవ్వాలని అధికారులను సూచించారు. ప్రభుత్వ నివాస పాఠశాలలో విద్యార్థులు సురక్షితంగా ఉండాల్సిన చోట ఇలాంటి ఘటన జరగటం తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది చిన్నారుల భద్రతపై కఠిన చర్యలు తీసుకోవాలని హాస్టల్ పరిసరాల్లో శానిటేషన్ మెరుగుపరచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Also read
- Hyderabad: పట్టపగలే ఇలా తయారయ్యారు ఏంట్రా బాబు…
- వర్తకులు, వ్యాపారులే వారి టార్గెట్… సేవ ట్రస్టులు, అనాథఆశ్రమాల పేరుతో బలవంతపు వసూళ్లు.
- నువ్వేం కొడుకువురా.. కళ్లల్లో పెట్టుకొని పెంచితే గుండెలపై తన్నాడు..
- మౌనిక, రవీంద్ర కలిసింది అక్కడే.. ఆ ఒక్క విషయంతో ఫ్రిడ్జ్‌లో ముక్కలు ముక్కలుగా.. సంచలన నిజాలు..
- రీల్స్ తెచ్చిన తంటా.. అన్యాయంగా 13 ఏళ్ళ బాలిక బలి.. అసలేమైందంటే?





