October 17, 2024
SGSTV NEWS
CrimeTelangana

Crime News: ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి.. 150 మీటర్లు ఈడ్చుకెళ్లిన బస్సు



పాఠశాలకు సోమవారం సెలవు ఉండడంతో మనవడు, మనవరాలి (కుమార్తె పిల్లలు)ని ఓ తాత తన ఇంటికి తీసుకెళుతుండగా.. బస్సు రూపంలో మృత్యువు వచ్చి మీద పడింది.

జగిత్యాల గ్రామీణం, : పాఠశాలకు సోమవారం సెలవు ఉండడంతో మనవడు, మనవరాలి (కుమార్తె పిల్లలు)ని ఓ తాత తన ఇంటికి తీసుకెళుతుండగా.. బస్సు రూపంలో మృత్యువు వచ్చి మీద పడింది. ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తగా నడుపుతూ వచ్చి వీరిని ఢీకొట్టడంతో తాత, మనవరాలు అక్కడికక్కడే మృతి చెందారు. మనవడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో మరో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరికి సైతం తీవ్ర గాయాలయ్యాయి. జగిత్యాల జిల్లా జగిత్యాల గ్రామీణ మండలం పొలాస వద్ద ఆదివారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. జగిత్యాల గ్రామీణ పోలీసులు తెలిపిన వివరాలివీ… రాయికల్ మండలం అల్లీపూర్కు చెందిన రైతు బైండ్ల లచ్చన్న(55).. ధర్మపురి  నుంచి తన మనవరాలు నారవేణి శ్రీనిధి (9), మనవడు మల్లికార్జున్ను తీసుకొని ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై గ్రామానికి బయలుదేరారు. వీరు జగిత్యాల గ్రామీణ మండలం పొలాసకు చేరుకోగానే.. కొండగట్టు నుంచి ధర్మపురికి వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆర్టీసీ బస్సును దాటే క్రమంలో ఎదురుగా వస్తున్న వీరిని, ముందు వెళ్తున్న మరో ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బైండ్ల లచ్చన్న, శ్రీనిధి అక్కడికక్కడే దుర్మరణం చెందగా మృతదేహాలను 150 మీటర్ల దూరం ఈడ్చుకు వెళ్లి బస్సు ఆగింది. తీవ్రంగా గాయపడిన మల్లికార్జున్ను జగిత్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రికి, అక్కడి నుంచి కరీంనగర్లోని ఆసుపత్రికి తరలించారు. మరో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న జగిత్యాల గ్రామీణ మండలం పొలాసకు చెందిన బదినిపెల్లి నర్సయ్య, బూర్ల రాజన్నకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద స్థలంలో రహదారిపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండడం చూపరులను కలచివేసింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపారు. జగిత్యాల రూరల్ సీఐ కృష్ణారెడ్డి, ఎస్సై సదాకర్ ప్రమాద స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బైండ్ల లచ్చన్న అల్లుడు గల్స్లో కార్మికునిగా పనిచేస్తుండగా.. పిల్లల్ని చదివించుకుంటూ కుమార్తె ధర్మపురిలో ఉంటున్నారు. ఈ ప్రమాదంతో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది.

Also read

Related posts

Share via