కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మరియు కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ లో కార్మిక శాఖ మంత్రి ప్రకటించిన విధంగా కార్మికుల వివాహ కానుక 40 వేలు, ప్రమాద మరణ పరిహారం 10 లక్షలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యర్నగూడెం రోడ్ లో ఇఫ్టు స్థూపం వద్ద నిర్వహించిన ఆందోళన.
ఈ సందర్భంగా ఐ.యఫ్.టి.యు రాష్ట్ర కమిటీ సభ్యులు ఈమని గ్రీష్మ కుమార్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు మల్లిడి రామిరెడ్డి లు మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపే పరమావధిగా వివిధ వర్గాల ప్రజలకిచ్చినట్లుగానే భవన నిర్మాణ కార్మికుల కు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వ పెద్దలు తమ కార్మిక శాఖ మంత్రి శ్రీ వాసం శెట్టి శుభాష్ ద్వారా అసెంబ్లీ సాక్షిగా కార్మికుల ఆడ పిల్లలకు వివాహ కానుక కింద 40 వేలు ప్రకటించారు. ఆ మేరకు కోట్ల రూపాయలు వెచ్చించి పత్రికలలో ప్రకటన లు ఇచ్చారు. లేబర్ అధికారుల ద్వారా కార్మిక సంఘాల నాయకులతో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ ముద్రిత కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించారు. కానీ అధికారికంగా 18 మార్చి 2026 న విడుదల చేసిన జి.ఓ లో మాత్రం వివాహ కానుక కేవలం 20 వేలు మాత్రమే ప్రకటించారు. ప్రమాద మరణ పరిహారం, అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన కార్మికుల పిల్లలకు స్కాలర్ షిప్ ల ఊసే లేదు. కార్మికుల కు సంక్షేమ పథకాలు అన్నీ అమలు చేస్తామని ఇచ్చిన హామీ ని ఈ విధంగా నీరు కార్చి తీరని ద్రోహానికి ఒడిగట్టారు. తక్షణమే తమ ఎన్నికల హామీ మేరకు ప్రమాద మరణ పరిహారం తో సహా అన్ని పధకాలు అమలు చేయని పక్షంలో కార్మికులు తిరిగి ఆందోళనలతో రోడ్డు ఎక్కుతారని హెచ్చరించారు.
పై కార్యక్రమం లో కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ కొండపల్లి నాగ శ్రీనివాసరావు, ప్లాట్ ఫాం రిక్షా వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ కోనేటి మల్లేశ్వర రావు, పిచ్చా సూర్య కిరణ్, నాగరాజు, సుబ్బారావు, సిర్రా వీర రాఘవులు, నంగాలు తదితరులు నాయకత్వం వహించారు.
Also read
