November 21, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

కర్నూలులో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ..సిఐకి గాయాలు

కర్నూల్‌: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బిల్లెకల్‌ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కూరగాయల వేలం పాట నేపథ్యంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో పరస్పరం దాడులు చేసుకున్నారు. రాళ్లు రువ్వకున్నారు. అయితే ఆందోళనకారులను చెదరగొట్టేందుకు వెళ్లిన ఆస్పరి సీఐ హనుమంతప్పపై కూడా దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన చేతికి, తలకి తీవ్ర గాయం అయింది. దీంతో సీఐ హనుమంతప్పను ఆస్పత్రికి తరలించారు.
కాగా గతంలో నిర్వహించిన వేలంపాటలో బిల్లేకల్‌ కూరగాయల మార్కెట్‌ను రూ. 76 లక్షలకు వైసీపీ కాంట్రాక్టర్‌ నల్లన్న దక్కించుకున్నారు. దీంతో హనుమంతు రెడ్డి అనే వ్యక్తి మార్కెట్‌ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. అయితే రైతు వీరేశ్‌ తన మిర్చి పంటను విక్రయించేందుకు మార్కెట్‌కు తీసుకెళ్లారు. దీంతో వేలం పాట నిర్వహించి డబ్బులు చెల్లించారు. అయితే డబ్బుల చెల్లింపులో కాంట్రాక్టర్‌ నల్లన్న, హనుమంతురెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించారని రైతు వీరేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలం పాటను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో మార్కెట్‌ నిర్వాహకుడికి, రైతు వీరేశ్‌కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న వైసీపీ మండల కన్వీనర్‌, టీడీపీ మండల మాజీ కన్వీనర్‌ మార్కెట్‌ వద్దకు వెళ్లారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో మార్కెట్‌ వద్ద టెన్షన్‌ వాతావరణ నెలకొంది.

Also read :

Related posts

Share via