వైఎస్ వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్ పై నమోదైన కేసులు తప్పుడు కేసులని పులివెందుల పోలీసులు తేల్చారు. ఈమేరకు డీఎస్పీ మురళీనాయక్ పులివెందుల కోర్టుకు తుది నివేదికను సమర్పించారు
Y. S. Vivekananda Reddy : వైఎస్ వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్ పై నమోదైన కేసులు తప్పుడు కేసులని పులివెందుల పోలీసులు తేల్చారు. ఈమేరకు డీఎస్పీ మురళీనాయక్ పులివెందుల కోర్టుకు తుది నివేదికను సమర్పించారు. దర్యాప్తులో తప్పుగా నిర్ధారణ అయిందని కృష్ణారెడ్డికి కూడా నోటీసులు అందజేశారు. అయితే సునీత దంపతులు, రాంసింగ్ వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండగా కోర్టుకు నివేదిక సమర్పించడం సబబు కాదని మెజిస్ట్రేట్ రిటర్న్ చేశారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న ఆయన పీఏ కృష్ణారెడ్డి పులివెందుల వైఎస్సార్సీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి 2023లో వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్ పై పులివెందుల కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు వేశారు. విచారించిన న్యాయస్థానం ముగ్గురిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించగా, వివిధ సెక్షన్ల కింద 2023 డిసెంబర్ 15న కేసులు నమోదు చేశారు. వివేకా కేసు దర్యాప్తులో భాగంగా 2023 సెప్టెంబరులో విచారణకు పిలిచిన సీబీఐ ఎస్పీ రాంసింగ్ తనను తీవ్రంగా కొట్టాడని అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి పేర్లు చెప్పాలనే విధంగా హింసించారని కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. సునీత దంపతులు కూడా సీబీఐ ఎస్పీ రాంసింగ్ చెప్పినట్లు సాక్ష్యం చెప్పాలని లేదంటే ఇబ్బందులు తప్పవని బెదిరించినట్లు పేర్కొన్నారు
ఈ కేసులను క్వాష్ చేయాలని ముగ్గురూ హైకోర్టును ఆశ్రయించగా వారికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సునీత, రాజశేఖర్ రెడ్డి, రాంసింగ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముగ్గురి పిటిషన్లపై ఈనెల 22న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించడంతో నాలుగు నెలల నుంచి పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ కృష్ణారెడ్డి ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నారు. నాలుగు నెలల నుంచి 23 మంది సాక్ష్యులను డీఎస్పీ మురళీనాయక్ విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. వారందరి వాంగ్మూలాలు నమోదు చేసుకున్న తర్వాత గురువారం ఉదయం పులివెందుల కోర్టుకు తుది నివేదిక అందజేశారు.
కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సునీత, రాజశేఖర్ రెడ్డి, రాంసింగ్పై పెట్టిన కేసులు పూర్తిగా అవాస్తవమని దర్యాప్తులో నిర్ధారణకు వచ్చామని డీఎస్పీ మురళీ నాయక్ కోర్టుకు నివేదించారు. గతంలో వేసిన ఛార్జిషీట్తోపాటు తుది నివేదికను అందజేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఫిర్యాదు దారుడైన కృష్ణారెడ్డికి కూడా డీఎస్పీ నోటీసు అందజేశారు. కేసు తప్పుగా నిర్ధారణ అయినట్లు దర్యాప్తులో తేలిందని నోటీసు ఇచ్చారు. కాగా డీఎస్పీ సమర్పించిన నివేదికను పరిశీలించిన కోర్టు సాయంత్రం నివేదికను రిటర్న్ చేసింది. సునీత, రాజశేఖర్ రెడ్డి, రాంసింగ్ వేసిన పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండగా తుది నివేదికను కోర్టుకు సమర్పించడం సబబు కాదని చెబుతూ నివేదికను వెనక్కి ఇచ్చింది. అంతే కాకుండా తప్పుడు కేసు పెట్టినందుకు గాను కృష్ణారెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Also read
- Maha Shivaratri Fasting: మహాశివరాత్రి ఉపవాసం ఎలా చేయాలి..? పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..!
- Maha Shivaratri: మహాశివరాత్రి రోజున ఈ పూజ చేసేవాళ్లకు శివుడి ప్రత్యేక ఆశీర్వాదం..! ఆ శివుడు మీ జీవితాన్నే మార్చేస్తాడు..!
- Gang rape : నిజామాబాద్ లో దారుణం..అక్కచెల్లెళ్లపై గ్యాంగ్ రేప్
- Atrocious : జగిత్యాలలో దారుణం … ఆస్తికోసం అన్నను చంపిన చెల్లెళ్లు
- POCSO case : సిద్ధిపేటలో ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు