మురమళ్లలో ఉన్న భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి
దేవాలయానికి సంబంధించిన కథనం.
మురమళ్ల పురాణ ప్రాధాన్యత కలిగిన పుణ్యక్షేత్రం. ఇక్కడ వీరభద్రుడికి, భద్రకాళికి గాంధర్వ పద్దతిన వివాహం జరిగింది. ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అందువల్లే ఇక్కడ స్వామివారికి వివాహం జరిపిస్తే తమ సంతానానికి త్వరగా వివాహమవుతుందని భక్తులు విశ్వసిస్తారు. అందువల్లే దాదాపు నెల ముందుగానే తమ పేర్లను భక్తుుల వివాహ మహోత్సవం జరిపించడానికి నమోదు చేసుకొంటారు. దాదాపు మూడు గంటల పాటు జరిగే ఈ వివాహ మహోత్సవం చూడటానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు మురమళ్ల వీరేశ్వరస్వామి దేవాలయానికి చేరుకొంటారు. శివరాత్రి మహోత్సవం సమయంలో మురమళ్ల వీరేశ్వరస్వామి దేవాలయం భూ కైలాసంగా విరాజిల్లుతోంది. ఈ నేపథ్యంలో ఈ క్షేత్రానికి సంబంధించిన కథనం.
మురమళ్ల
వృద్ధగౌతమి నదీ తీరంలో వెలిసిన సుప్రసిద్ధ శైవక్షేత్రం మురమళ్ల. ఇక్కడ ప్రధాన దైవం భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి. పురాణ కథనం ప్రకారం పూర్వం దక్షుడు ఒక గొప్ప యాగం చేయాలని భావిస్తాడు.

అయితే ఈ యాగానికి తన సొంత కూతురైన దాక్షాయణిని ఆహ్వానించడు. అయినా పుట్టింటిపై మమకారం చంపుకోలేని దాక్షాయణి యాగం జరిగే చోటుకు వెళ్లి తీవ్రంగా అవమానించబడుతుంది.

ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మాహుతికి పాల్పడుతుంది. విషయం తెలుసుకున్న దాక్షాయణి భర్త, త్రిమూర్తుల్లో ఒకరైన పరమశివుడు వీరభద్రుడిని సృష్టించి దక్షయాగం నాశనం చేయమని పంపిస్తాడు

ఆయనే మురమళ్లలో వీరేశ్వరుడయ్యాడు. ఆయన మహా భయంకర రూపందాల్చి దక్షయాగం నాశనం చేస్తాడు. దాక్షాయణి దహనం వల్ల వీరేశ్వరుడు ఎంతకీ శాతించడు.

ఆ భయంకర రూపాన్ని చూసి భయకంపితులైన మునులు, దేవతలు, విష్ణుమూర్తిని వీరేశ్వరుడి శాంతింపచేయమని ప్రార్థిస్తారు. విష్ణుమూర్తి నరసింహావతారంలో వీరేశ్వరుడిని శాంతింపజేయడానిప్రయత్నించి విఫలమవుతాడు

దీంతో దేవతలంతా కలిసి ఆదిపరాశక్తిని ప్రార్థిస్తారు. ఆవిడ ప్రత్యక్షమై విషయం తెలుసుకొని తన షోడశ కళలలోని ఒక కళ భద్రకాళిని వీరభద్రుని శాంతింపచెయ్యటానికి భూలోకానికి పంపింది.

భద్రకాళి అమ్మవారు మురమళ్ల దగ్గర ఉన్న తటాకంలో మునిగి కన్యరూపం దాల్చి తటాకమం నుంచి బయటకు వచ్చింది. కన్య రూపంలో ఉన్న భద్రకాళిని చూసి వీరేశ్వరుడు శాంతించాడు.

వెంటనే అక్కడ ఉన్న మునులు వారిద్దరికి గాంధర్వ పద్దతిలో వివాహం జరిపించారు. మునులు సంచరించే ప్రాంతం కాబట్టి అప్పట్లో దీనిని మునిమండలి అనేవారు. ఆ మునిమండలి ప్రాంతమే కాలక్రమంలో మురమళ్లగా మారింది.
ఆ రోజు నుంచి అక్కడ వెలిసిన స్వామికి మునులంతా కలిసి గాంధర్వ పద్దతిలో కళ్యాణం జరిపిస్తున్నారు. తమ సంతానానికి వివాహం ఆలస్యమవుతున్నవారు ఇక్కడ స్వామివారికి కళ్యాణం చేయిస్తే త్వరలో ఫలితం కనబడుతుందని చెబుతారు.

అలా భక్తులు జరిపించే వివాహం నిత్యం జరుగుతూ ఉంటాయి. అనాదిగా వస్తోన్న ఈ వివాహ మహోత్సవం జరిగే తీరు భక్తులను ఆనంద పారవశ్యంలో ముంచెత్తుతుంటుంది. బాజా భజంత్రీలూ మేళతాళాలతో ఉత్సవ ప్రారంభమవుతుంది.
ఓ పక్క కొందరు ఆర్చకులు యక్షగానం ఆలపిస్తుంటారు. మరోపక్క పురోహితులు స్వామివారి వివాహ వేడుకను నిర్వహిస్తుంటారు. వివాహం తర్వాత స్వామివారిని అమ్మవారినీ అద్దాల మండపానికి తీసుకువెళుతారు
అటు పై పవళింపు సేవచేయడంతో కళ్యాణమహోత్సవం ముగుస్తుంది. దాదాపు మూడు గంటల పాటు ఈ వివాహ మహోత్సవం జరుగుతంది. కళ్యాణం జరిపించే భక్తుల గోత్రనామాలతో స్వామివారికి ఉదయం పూట అభిషేకం జరుపుతారు.
రోజుకిన్ని కళ్యాణాలు అన్న లెక్క ఉండటంతో భక్తులు సుమారు నెల రోజులు ముందుగానే తమ పేర్లను నమోదు చేసుకొంటారు. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం నిత్యాన్నదానం, వసతి సౌకర్యం ఉంది. కాకినాడకు 36 కిలోమీటర్లు, రాజమండ్రికి 90 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది.
