November 21, 2024
SGSTV NEWS
CrimeNational

బెంగళూరు: రేవ్ పార్టీ ముసుగులో వ్యభిచార దందా? అనుమానాలు బలపడ్డాయి ఇలా..

బెంగళూరు, : తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన రేవ్ పార్టీ  కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ పార్టీ మాటున సెక్స్ రాకెట్ కూడా నిర్వహించి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డ్రగ్స్ దొరకడం, పైగా డబ్బును విపరీతంగా ఖర్చు చేసి ఈ రేవ్ పార్టీ నిర్వహించడంతో ఈ కోణంలోనూ దర్యాప్తు చేయాలని బెంగళూరు పోలీసులు నిర్ణయించారు.

బెంగళూర్ ఎలక్ట్రానిక్స్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో రేవ్ పార్టీ జరిగింది. సన్సెట్ టు సన్రైజ్ విక్టరీ పేరుతో బర్త్ డే పార్టీ ముసుగులో ఈ పార్టీ నిర్వహించారు. ఇందుకోసం నిర్వాహకులు రూ.2 లక్షల ఎంట్రీ ఫీజు తీసుకుని 200 మందిని ఆహ్వానించారు. ఈ పార్టీలోతెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకకు చెందిన క్రికెట్ బుకీలు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు(తెలుగు సినీ, సీరియల్ ప్రముఖులు సైతం) పాల్గొన్నారు. ఆదివారం ఉదయమే కొందరు రిసార్ట్ నుంచి వెళ్లిపోయారు. మిగిలిన వాళ్లు అర్ధరాత్రి జరిగిన పార్టీలో పాల్గొన్నారు.

మరోవైపు దొరికిన వంద మందిలో 30 మంది యువతులే ఉన్నారు. నిర్వాహకులే వాళ్ల కోసం టికెట్లు వేసి విమానాల్లో రప్పించినట్లు తెలుస్తోంది. దీంతో రేవ్ పార్టీలో వ్యభిచార దందా నిర్వహించి ఉంటారని, నిర్వాహకులు కూడా సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నిర్వహకుల నేర చరిత్ర పై కూపి లాగుతున్నారు.

మరోవైపు.. ఈ కేసులో ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. పార్టీలో ఎండీఎంఏ, కొకైన్, హైడ్రో గంజా, ఇతర మాదకద్రవ్యాలను వినియోగించారు. దీంతో ఈ కేసును ఎలక్ట్రానిక్స్ పోలీస్ స్టేషన్ నుండి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నార్కోటిక్ విభాగానికి బదిలీ చేశారు.

శాంపిల్స్ ఫలితాలు ఇవాళే

డ్రగ్స్ తీసుకున్నారనే అనుమానాల మధ్య పార్టీకి హాజరైన వాళ్ల నుంచి శాంపిల్స్ను సేకరించారు పోలీసులు. వీటి ఫలితాలు ఇవాళ సాయంత్రం కల్లా వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ పార్టీలో తాను లేనని తెలుగు సినీ నటి హేమ చెబుతున్నప్పటికీ.. పోలీసులు మాత్రం ఆమె వాదనను ఖండిస్తున్నారు. ఆమె కూడా పార్టీలో పాల్గొన్నారంటూ ఓ ఫొటోను విడుదల చేశారు. అంతేకాదు ఆమె కూడా శాంపిల్స్ ఇచ్చారని ప్రకటించారు.

Also read

Related posts

Share via