అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ముగ్గురు యువకులతో తిరిగిన ఒక యువతి కన్న తండ్రిని కడతేర్చి కటకటాలు పాలయ్యింది. మదనపల్లిలోని పోస్టల్ అండ్ టెలికం కాలనీలో ఉంటున్న టీచర్ దొరస్వామి హత్య కేసులో హంతకురాలు హర్షిత అరెస్ట్ అయ్యింది. జూన్ 12న హత్యకు గురైన టీచర్ దొరస్వామి కేసు మిస్టరీని చేధించిన పోలీసులు.. హర్షితను అరెస్ట్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఏడాదిన్నర క్రితం భార్య లత చనిపోవడంతో కూతురు హర్షితను కంటికి రెప్పలా చూసుకుంటున్న కన్నతండ్రి దొరస్వామిని కూతురే చంపిందని పోలీసుల విచారణ బయటపడింది. బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిగ్రీని పూర్తి చేసిన హర్షిత బాయ్ ఫ్రెండ్స్‌తో తిరుగుతూ తప్పు దారిలో నడిచింది. అలా ముగ్గురు అబ్బాయిలతో సన్నిహితంగా ఉన్న కూతురు హర్షితను తండ్రి దొరస్వామి నిలదీశాడు. దీంతో కూతురు చేతిలోనే హత్యకు గురికావాల్సి వచ్చింది. దొరస్వామి హత్య కేసు వివరాలను మీడియాకు వివరించిన మదనపల్లి డిఎస్పీ ప్రసాద్ రెడ్డి అనేక విషయాలను వెల్లడించారు.
Also read :తిట్టాడని కన్న కొడుకుని గొంతు నులిమి చంపిన తల్లి.. అమ్మతనానికే మాయని మచ్చగా
మదనపల్లి సొసైటీ కాలనీలో పాల వ్యాపారం చేసే గణేష్ అనే యువకుడితో సన్నిహితంగా ఉండేది. తల్లి బంగారు నగలను ఆతనికి ఇచ్చేసిన హర్షిత, ఆ తరువాత సాయికృష్ణ అనే మరో యువకుడితో చెలిమి చేసింది. సాయి కృష్ణకు దాదాపు రూ. 2 లక్షల డబ్బు లిచ్చిన హర్షిత ఇద్దరితోనూ సన్నిహితంగా ఉండేది. ఈ విషయం తెలుసుకున్న తండ్రి దొరస్వామి కూతురు హర్షిత నిర్వాకంతో విసిగి పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు కుప్పంలో వరుడిని చూసి పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు. ఈలోపు హరీష్ అనే మరో యువకుడితో సాన్నిహిత్యంగా ఉన్న హర్షితను తండ్రి దొరస్వామి నిలదీశాడు. ముచ్చటగా ముగ్గురితో కూతురు హర్షిత స్నేహం కొనసాగించడంతో తండ్రి.. కూతురు మధ్య జూన్ 12 రాత్రి పెద్ద గొడవే జరిగింది. దొరస్వామిపై హర్షిత దాడికి పాల్పడటంతో పెద్ద ఘోరం జరిగింది. చపాతీ కర్రతో కన్న తండ్రిపై దాడి చేసి చంపేసింది హర్షిత. రక్తపు మడుగులో పడి ఉన్న దొరస్వామి మర్డర్ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు హర్షితనే చంపిందని నిర్ధారించారు. ఈ మేరకు హర్షితను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు మదనపల్లి వన్ టౌన్ పోలీసులు