కన్న ప్రేమే కఠినంగా మారింది.. ప్రాణం కంటే మిన్నగా పెంచిన బిడ్డ, తమ మాట కాదని ప్రేమించిన వాడితో వెళ్లిపోయిందని ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. లోకం దృష్టిలో ఆ అమ్మాయి బతికే ఉన్నా, తమ పాలిట మాత్రం చనిపోయిందంటూ బతికుండగానే ఆమెకు కర్మకాండలు నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది.
కన్నకూతురు ప్రేమించిన వాడితో వెళ్లిపోయిందని ఆ తల్లిదండ్రులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. లోకం దృష్టిలో తన బిడ్డ బతికున్నా, తమకు మాత్రం చనిపోయిందంటూ బతికుండగానే ఆమెకు అంత్యక్రియలు, కర్మకాండలు నిర్వహించారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలంలో చోటుచేసుకుంది. పిల్లారి కుప్పం గ్రామానికి చెందిన ఉషా, సుబ్రహ్మణ్యం రెడ్డి దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుండగా.. చిన్న బిడ్డ హేమప్రియ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. హేమప్రియ అదే గ్రామానికి చెందిన కిషోర్ అనే యువకుడితో గత కొంతకాలంగా ప్రేమలో ఉంది. వారిద్దరిది ఒకే సామాజిక వర్గం అయినప్పటికీ చదువు పూర్తికాకుండానే పెళ్లికి సిద్ధపడడం, అక్క పెళ్లి కాకుండానే చెల్లి ప్రేమ వ్యవహారం నడపడం తల్లిదండ్రులకు అస్సలు ఇష్టం లేకపోయింది.
కాణిపాకంలో మూడు ముళ్లు
తల్లిదండ్రులు ససేమిరా అనడంతో హేమప్రియ ఈనెల 4న ఇంటి నుంచి వెళ్ళిపోయింది. తన ప్రియుడు కిషోర్‌తో కలిసి కాణిపాకం ఆలయంలో వివాహం చేసుకుంది. పెళ్లి అనంతరం హేమప్రియ ఇంటికి రాలేదు. తమ మాట కాదని, ఇష్టారాజ్యంగా పెళ్లి చేసుకున్న కూతురి ప్రవర్తనతో ఆ తల్లిదండ్రులు తీవ్రంగా కలత చెందారు. తాము ఎంతగానో ప్రేమగా పెంచుకున్న బిడ్డ తమను కాదని వెళ్లిపోవడంతో ఆమె తమ దృష్టిలో చనిపోయిందని ఆ దంపతులు ప్రకటించారు. గ్రామస్తుల సమక్షంలో హేమప్రియ ఫోటో పెట్టి, శాస్త్రోక్తంగా కర్మకాండలు నిర్వహించారు. బంధుమిత్రులను పిలిచి కర్మ భోజనాలు కూడా పెట్టారు. మా బిడ్డ మా మాట వినలేదు.. ఇక నుంచి ఆమె చనిపోయినట్టే అంటూ వారు కన్నీటి పర్యంతమవడం అక్కడున్న వారిని సైతం కలచివేసింది. కాగా బతికున్న బిడ్డకు కర్మ క్రియలు చేయడం సరైనది కాదని గ్రామస్తులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆ తల్లిదండ్రులు మాత్రం తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు.
Also read
- పోలీసులపై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దాడి
- కళ్లలో కారం కొట్టి.. కత్తితో గొంతు కోసి!
- కేపీహెచ్బీలో దారుణం.. మూడంతస్తుల భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్య
- లడ్డులో కల్తీ లేదని ఎక్కడుంది?
- మొగుడొద్దు.. ప్రియుడే ముద్దు..! హనీమూన్ మర్డర్‌ను మించి.. భర్తను ఎలా లేపేసిందో తెలిస్తే..





