SGSTV NEWS
Andhra PradeshCrime

సగం ధరకే బంగారం అంటూ ప్రచారం.. ఎగబడి పెట్టుబడి పెట్టిన ప్రజలు.. కట్‌చేస్తే..



మార్కెట్‌ ధరకంటే సగం ధరకే బంగారం అంటూ ప్రచారం చేసి.. అమాయక ప్రజల నుంచి ఓ ప్రజాప్రతినిధి రూ. నలభై లక్షలు తీసుకొని తిరిగి ఇవ్వని ఘటన గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితులు డిమాండ్‌ చేయగా వాళ్లను బ్లేడ్‌ బ్యాచ్‌తో అడ్డుతొలగిస్తానని బెదిరించినట్టు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు అందడంతో ఘటనపై కేసు నమెదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.


గుంటూరు కొత్తపేటకు చెందిన నాగదుర్గకు మూడు నెలల క్రితం పెదకాకాని ఎంపిటిసి గుల్జార్ పరిచయం అయింది. నాగదుర్గ సోదరుడు మోహన నరసింహతో పాటు మరికొంత మందితో కూడా ఆమె పరిచయం పెంచుకుంది. కొద్దీ పాటి పరిచయంలో ఎన్నో విషయాలు చెప్పింది. వీటిల్లో అతి ముఖ్యమైనది మార్కెట్ ధరలో సగం ధరకే బంగారం ఇప్పిస్తానని చెప్పింది. అయితే మొదట గుల్జార్ మాటలను వీరంతా పెద్దగా పట్టించుకోలేదు. అయితే స్తానిక ప్రజా ప్రతినిధి కావడం అనేక మందితో పరిచయాలుండటంతో ఆమె వద్దకు వచ్చే పోయే వారి సంఖ్య అధికంగా ఉండేది. ఇదే క్రమంలో నాగదుర్గ ఆమె సోదరుడు మోహన్ నరసింహతో మరింత పరిచయం పెరిగింది. ఈ క్రమంలోనే గుల్జార్ తన ఫోన్‌లో సగం ధరకే బంగారుం తీసుకున్న వారి ఫోటోలు, తేదీలు వారికి చూపించడం మొదలు పెట్టింది. తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం వస్తుందని ఆశ పెట్టింది.


అయితే అందుకు ఒక కండీషన్ పెట్టింది. కనీసం ఐదు లక్షల రూపాయలు పెట్టుబడి పెడితేనే తక్కువ ధరకు బంగారం వస్తుందని చెప్పింది. అయితే అంత డబ్బులు లేకపోవడంతో నాగదుర్గ, ఆమె సోదరుడు మొదట పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపలేదు. అయితే గుల్జార్ హాడావుడి చూసి ఆశ కలిగిన నాగదుర్గ అక్కడా ఇక్కడా అప్పులు చేసి పది లక్షల రూపాయలు తెచ్చింది. అదే విధంగా మోమన్ కూడా మరోక ఐదు లక్షల రూపాయలు తెచ్చాడు. వీరితో పాటు మరికొంత మంది కలిసి మొత్తం నలభై లక్షల రూపాయల వరకూ ఎంపిటిసికి ముట్టజెప్పినట్లు బాధితులు తెలిపారు.

అయితే మూడు నెలలు గడిచినా గల్జార్ బంగారం ఇవ్వలేదు. దీంతో అప్పులకు వడ్డీ పెరిగిపోవడంతో నాగదుర్గ, మోహన్లో ఆందోళన పెరిగిపోయింది. తమలాగే డబ్బులు కట్టిన వారందరితో మాట్లాడి గుల్జార్ వద్దకు వెళ్లి గట్టిగా నిలదీశారు. దీంతో ఆమె వీరిపై ఎదురు దాడికి దిగింది. మీ డబ్బులు మీకిస్తా కాని సమయం కావాలని చెప్పింది. లేదని మీరు గొడవ చేస్తే బ్లేడ్ బ్యాచ్‌తో అడ్డుతొలగిస్తానంటూ బాధితులను హెచ్చరించింది. దీంతో భయబ్రాంతులకు గురైన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసేందుకు ముందుకు రాకపోవడంతో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీని ఆశ్రయించారు.

తమను మోసం చేసిన ఎంపిటిసిపై కేసు నమోదు చేసి తమ డబ్బులు తమకు ఇప్పించాలంటూ వేడుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఎస్పీ పోలీసులను ఆదేశించారు. ఈ తరహా మోసాలతో వస్తున్న వారి సంఖ్య అధికంగా ఉందని తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామంటే ఎవరూ నమ్మవద్దని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు

Also read

Related posts

Share this