April 16, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

సాయం చేసినోడ్ని చంపి చేయి నరుక్కుపోయారు.. ఎందుకంటే..?

 

అవసరాలకు ఇచ్చి పుచ్చుకోవటం, స్నేహితుల మధ్య కామన్‌గా చోటు చేసుకుంటుంది. ఇక తీసుకున్న డబ్బులు ఇవ్వమంటే బెదిరింపులకు పాల్పడటం, హత్యకు సైతం తెగించడం వంటి ఘటనలు మనం చూస్తున్నాం. ఇలాంటి ఒక దారుణమే కొవ్వూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఈ ఘటనలో నిందితులు వ్యక్తిని చంపి అతని చేతికి ఉన్న కడియం , ఉంగరాలు రాక పోవటంతో చేయిని నరుక్కుపోయారు. ఈ కేసులో ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేసారు.



వివరాల్లోకి వెళ్తే..  తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పెండ్యాల ప్రభాకరరావు కొన్ని కంపెనీల వస్తువులకు డీలర్‌గా ఉంటూ వాటిని విక్రయించి జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పోలవరం మండలం పాత పట్టిసంకు చెందిన చుక్కా రామ శ్రీనివాస్‌తో పెండ్యాల ప్రభాకర్ కు పరిచయం ఏర్పడింది. రామ శ్రీనివాస్ తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామ సచివాలయ సర్వేయర్‌గా పని చేస్తున్నాడు. క్రికెట్ బెట్టింగ్, విలాసాలకు అలవాటు పడి అప్పుల పాలయ్యాడు. రెండు లక్షల నలభై వేల రూపాయలలు 2024 లో ప్రభాకర్ వద్ద అప్పు తీసుకున్నాడు రామ శ్రీనివాస్. తన బాకీ తీర్చమని ప్రభాకర్ శ్రీనివాస్‌ను ఇటీవల ఒత్తిడి చేస్తున్నాడు. అయితే ఎన్నిసార్లు అడిగినా శ్రీనివాస్ నుంచి నో రెస్పాన్స్. ప్రభాకర్‌ను చంపితే..  బాకీ తీర్చే అవసరం ఉండదని.. అలాగే అతని ఒంటిపై బంగారం అమ్ముకొని బయట బాకీలు కొన్ని తీర్చుకోవచ్చని ప్లాన్ చేశాడు రామ శ్రీనివాస్.

పథకం ప్రకారం దొండపూడి గ్రామానికి చెందిన అంకోలు జగదీష్ దుర్గాప్రసాద్, పోలవరంకు చెందిన నోముల ప్రవీణ్ కుమార్‌తో కలిసి ప్రభాకర్‌ను చంపేందుకు ప్లాన్ చేశాడు రామ శ్రీనివాస్. మార్చి 26 రాత్రి ప్రభాకర్‌కు ఫోన్ చేసి బయటకు వెళ్తాం అని తీసుకుని వెళ్ళాడు. దొమ్మేరు పుంతలోని నీరుకొండ శేషగిరిరావు డ్రాగన్ ఫ్రూట్ తోటలోనికి యాక్టివా మోటార్ సైకిల్‌పై వెళ్ళారు. అక్కడే ప్రభాకర్‌పై రామ శ్రీనివాస్ కిరాతకంగా దాడిచేసాడు. కత్తితో వెనుక నుంచి మెడ, తలపై పలుసార్లు పొడిచాడు. కింద పడిపోయిన ప్రభాకర్ కంఠం నరికేసి దారుణంగా హత్య చేశాడు. మెడలో ఉన్న చైన్, ఎడుమ చేతికి ఉన్న ఉంగరం తీసుకున్నాడు. కుడి చేతికి ఉన్న బంగారు కడియం, మూడు ఉంగరాలు రాకపోయేసరికి చేతిని నరికేశాడు. దుర్గాప్రసాద్‌కు ఫోన్ చేసి రమ్మని నరికిన చేతిని, కత్తిని, సేల్ ఫోన్‌ను సంచిలో వేసుకుని పోలవరం వెళ్ళిపోయారు. పోలవరంలో ప్రవీణ్ కుమార్ ను కలిసారు. అక్కడ చేతి కడియం, ఉంగరాలు తీసుకున్నారు. నరికిన చేతిని, కత్తిని, సంచిని, ప్రభాకర్ సెల్ ఫోన్‌ను, రామ శ్రీనివాస్ వేసుకున్న దుస్తులను గోదావరిలో పడేసారు. బంగారాన్ని తాళ్లపూడి, కొయ్యలగూడెంలలో తాకట్టుపెట్టి వచ్చిన డబ్బుతో పారిపోయారు. మృతిడి భార్య అనంతలక్ష్మి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. దర్యాప్తు అనంతరం ముగ్గురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. బంగారు వస్తువులు, మోటార్ సైకిల్, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గోదావరిలో పడేసిన ప్రభాకర్ సెల్ ఫోన్, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.  సాయం చేసినోడినే చంపేసే స్థాయికి దిగజారిపోయింది ఈ సమాజం. తస్మాత్ జాగ్రత్త.

Also read

Related posts

Share via