SGSTV NEWS
Andhra PradeshCrime

ఉదయగిరిలో దారుణ హత్య.. పట్టపగలు అందరూ చూస్తుండగానే నరికి చంపారు!

 

వాటాల విషయంలో ముగ్గురు భాగస్వాముల మధ్య తలెత్తిన వివాదం దారుణ హత్యకు దారి తీసింది. అందరూ చూస్తుండగానే ఇద్దరు కలిసి మూడో వ్యక్తిని కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరిలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది..


నెల్లూరు, జులై 12: నెల్లూరు జిల్లా ఉదయగిరిలో శుక్రవారం సాయంత్రం దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని అల్ ఖైర్ ఫంక్షన్ హాల్ వద్ద మహమ్మద్ హమీద్ అనే యువకుడిని అందరి ముందు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. కొండాపురం మండలం గరిమినపెంటకు చెందిన హమీద్‌పై ఆల్ ఖైర్ ఫంక్షన్ హాల్ వాటాదారులు ఇనుపరాడ్లు, కత్తులతో దాడి చేసి అక్కడికక్కడే హతమార్చారు. గ్రామస్తుల సమాచారం ప్రకారం..

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో హమీద్, హనీఫ్, ఉమర్ అనే ముగ్గురు కలిసి ఫంక్షన్ హాల్‌ను ఉమ్మడి భాగస్వామ్యంగా నిర్వహించేవారు. అయితే ఇటీవల ఈ ఫంక్షన్ హాల్ నిర్వహణ, ఆర్థిక వ్యవహారాల్లో పార్ట్‌నర్స్‌ మధ్య విభేదాలు తలెత్తాయి. హమీద్ తన వాటా లావాదేవీలు పూర్తిచేయకముందే ఇతరులు హాల్‌ను కొనసాగిస్తున్నారన్న అభిప్రాయంతో తాళాలు వేసి హాల్‌ను మూసివేశాడు. ఈ విషయంపై చర్చించేందుకు హనీఫ్, ఉమర్ ఘటనా స్థలానికి వచ్చారు.

అయితే అక్కడ ముగ్గురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తులైన హనీఫ్, ఉమర్.. అందరి సమక్షంలో రాడ్లు, కత్తులతో హమీద్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హమీద్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఇంత జరుగుతున్న చుట్టూ ఉన్నవారు చూస్తున్నారే తప్ప ఎవ్వరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. సంఘటనను ప్రత్యక్షంగా చూసిన వారంతా షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హత్యాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణ సంఘటనతో ఉదయగిరిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజల్లో భయానక వాతావరణం ఏర్పడింది

Also read

Related posts

Share this