SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra News: కలిసి బతకడం కష్టమనుకున్నారు.. కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చారు.. అసలు ఏం జరిగిందంటే?



గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ట్రైన్‌ కింద పడి ఒక ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. తమ ప్రేమకు పెద్దవాళ్లు అంగీకరించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ప్రేమ పెళ్లి పెద్దలు అంగీకరించలేదనే మనస్థాపంలో ఒక ప్రేమ జంట ట్రైన్‌ కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. రైల్వే ట్రాక్‌పై యువతీ, యువకుల మృతదేహాలను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటీనా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. మృతులు గుంటూరు ముప్పాళ్ళ మండలం దమ్మాలపాడుకు చెందిన గోపి తెనాలి మండలం అత్తోటకు చెందిన లక్ష్మీ ప్రియాంకలుగా గుర్తించారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపీ, ప్రియాంక ఇద్దరూ నరసరావుపేటలోని ఎన్ఆర్ఐ కాలేజీలో ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. వీరిద్దరికీ గత కొంత కాలంగా కాలేజ్‌లో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో గత కొన్నేళ్లు ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఇరువురు ఇళ్లలో తల్లిదండ్రులకు చెప్పారు. కానీ వాళ్లు ప్రేమ వివాహానికి ఒప్పుకోలేదు. ఇక వీళ్లు ఎప్పటికీ తమ పెళ్లి ఒప్పుకోరని నిర్ణయించుకున్న ఇద్దరూ ఈ నెల 5వ తేదీన రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. తర్వాత నేరు పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. దీంతో పోలీసులు రెండు కుంటుంబాలను స్టేషన్‌కు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు.

కానీ, రెండు కుటుంబాలు వాళ్ల పెళ్లిని నిరాకరించాయి. దీంతో మనస్తాపానికి గురైన గోపి, ప్రియాంక వీళ్లు మనని కలిసి బతకనివ్వరని.. చనిపోవడమే ఉత్తమమని సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే గోపి ప్రియాంకకు తెలియకుండా ఇంట్లో నుంచి వెళ్లి రైల్వే ట్రాక్‌పై పడి ఆత్మహత్య చేసుకున్నాడు. గోపీ మరణవార్త విన్న ప్రియాంక కూడా మరుసటి రోజూ అదే ట్రాక్‌పై పడి ఆత్మహత్యకు పాల్పడింది.


విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. రెండు ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts