SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra Pradesh: నవ్వితే నరకడం ఏంట్రా నీచుడా.. పాపం బాలుడు.. రేణిగుంటలో దారుణం..



భార్య వదిలి వెళ్లిందనే అవమానం.. చుట్టూ ఉన్న ప్రపంచమంతా తనను చూసి నవ్వుతోందనే అనుమానం. సరిగ్గా అప్పుడే.. 17 ఏళ్ల శ్రీహరి నవ్వాడు. ఆ నవ్వే అతడి పాలిట శాపమైంది. క్షణికావేశంలో రగిలిపోయిన ఆ వ్యక్తి.. దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అసలు ఏం జరిగింది..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఈ మధ్యకాలంలో చిన్న చిన్న కారణాలకే చంపుకోవడాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తున్నాయి. కొంతమంది క్షణికావేశంలో చేస్తే మరికొందరు పక్కా ప్రణాళికతో ప్రాణాలు తీస్తున్నారు. మనిషిలోని అనుమానం, ఆగ్రహం ఎంతటి దారుణానికి ఒడిగడతాయే చెప్పడానికే ఈ ఘటనే నిదర్శనంగా చెప్పొచ్చు. అసలేం జరిగిందంటే.. భార్య విడిచి వెళ్లిన అవమానంతో తీవ్ర ఆగ్రహంలో ఉన్న వ్యక్తి తనను చూసి నవ్వాడని  17 ఏళ్ల బాలుడిని పదునైన కత్తితో నరికి దారుణంగా హత్య చేసిన ఘటన తిరుపతి జిల్లా రేణిగుంటలో కలకలం సృష్టించింది. తీవ్రంగా గాయపడిన బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. తిరుపతి జిల్లా రేణిగుంట సంత సమీపంలోని గువ్వల కాలనీకి చెందిన పూసలు అమ్మే మేస్త్రీని అతడి భార్య ఇటీవలే విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఈ సంఘటనతో ఆ వ్యక్తి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అంతేకాక చుట్టూ ఉన్నవారంతా తనను చూసి నవ్వుతున్నారని, హేళన చేస్తున్నారని అనుమానించేవాడు.

హత్యకు దారితీసిన గొడవ

అదే ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల శ్రీహరి తనను హేళనగా చూస్తూ నవ్వాడని అనుమానించిన మేస్త్రీ అతడిని కొట్టాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీహరి తండ్రి నిందితుడి వద్దకు వెళ్లి తన కొడుకు ఎందుకు కొట్టావని నిలదీశాడు. మరోసారి జరిగితే చూస్తూ ఊరుకోనని హెచ్చరించాడు. అయితే తండ్రి వెళ్లిపోయిన కొద్దిసేపటికే శ్రీహరి – ఆ మేస్త్రీ మధ్య మళ్లీ ఘర్షణ జరిగింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన మేస్త్రీ, పూసల ధారాలు కోసేందుకు ఉపయోగించే పదునైన కత్తి తీసుకుని బాలుడి మెడపై నరికాడు. దీంతో శ్రీహరి తీవ్రంగా గాయపడ్డాడు.

ఆస్పత్రిలో మృతి..

స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే శ్రీహరిని చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే గాయాలు తీవ్రంగా ఉండటంతో, చికిత్స పొందుతూ ఆ బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రేణిగుంట పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. భార్య విడిచి వెళ్లిన మానసిక ఒత్తిడితోనే ఈ దారుణానికి పాల్పడ్డాడా..? లేదా ఇతర కారణాలు ఉన్నాయా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ ఘటన గువ్వల కాలనీలో తీవ్ర విషాదాన్ని, భయాందోళనలను నింపింది.

Also read

Related posts