April 8, 2025
SGSTV NEWS
Andhra PradeshTrending

శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో బయటపడ్డ నాగశాసనం.. విజయనగర రాజుల ఘనతకు సాక్ష్యం


ఈ ఆలయం ఎంతో మహిమ కలిగిందని, ఇక్కడ మొక్కులు తీర్చుకున్న భక్తులకు వారి కోరికలు నెరవేరుతాయని అర్చకులు చెబుతున్నారు. 15వ శతాబ్దం నాటి శిలాశాసనం వెలుగులోకి రావడంతో ఈ ఆలయాన్ని సందర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.

రాజుల సొమ్ము రాళ్ళపాలు అంటారు… అయితే అది దేవాలయాల నిర్మాణాల విషయంలో కాదు… అందుకు ఇప్పటికీ ఆనాటి రాజుల ఘనతను  తెలియచేసే విలువైన శాసనాలే ఇందుకు నిదర్శనం… రాజుల కీర్తిప్రతిష్టలు చాటేందుకు ఆనాటి పాలకులు దేవాలయాలపై శాసనాలు వేయించేవారు… ఇలా దేవాలయాల్లో శాసనాలను ఏర్పాటు చేయడం ద్వారా ఆనాటి రాజుల కాలంలో పాలన, కైంకర్యాల వివరాలు నేటికీ సజీవంగానే ఉన్నాయి… దేవాలయాలను నిర్మించడం ద్వారా చరిత్రపుటల్లో విజయనగర రాజులు కలకలం నిలిచిపోయారు…


విజయనగర రాజుల కాలంలో సామ్రాజ్య విస్తరణలో భాగంగా తాము జయించిన రాజ్యాలలో దేవాలయాలను నిర్మించి శిలాశాసనాలను ఏర్పాటు చేసేవారు… అప్పట్లో ఈ శిలాశాసనాల ద్వారానే రాజుల విజయగాధలు, వారు జయించిన రాజ్యాలు, రాజుల వివరాలు శాసనాలపై లిఖించేవారు… కాలగమనంలో అక్కడక్కడ ఇలా మరుగున పడిపోయిన శాసనాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి… తాజాగా ప్రకాశంజిల్లా బేస్తవారిపేటలో ఓ ఆలయంలో విజయనగరరాజుల కాలంలో ఏర్పాటు చేసిన ఓ శాసనం వెలుగులోకి వచ్చింది.

15వ శతాబ్దపు విజయనగర రాజుల శాసనం…


ప్రకాశం జిల్లాలో విజయనగర పాలకుల మరో శాసనం వెలుగులోకి వచ్చింది. బేస్తవారిపేట మండలం బసినేపల్లి – చెరుకుపల్లి గ్రామాల మధ్య ఏకరాతితో నిర్మించిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో 15వ శతాబ్దం కాలంలో నిర్మించిన శాసనం వెలుగు చూసింది. విజయ నగర సామ్రాజ్యాన్ని నరసింహారాయులు పాలించిన కాలంలో ఈ శాసనాన్ని వేయించారు… ఆ సమయంలో నరసింహరాయులు దగ్గర మంత్రిగా ఆదినాయుడు ఉన్నారు… ఆదినాయుడి కుమారుడు మాలనాయుడు తన తల్లిదండ్రుల గ్రామపకార్థం చెరుకుపల్లిలోని అహోబిలేశ్వర స్వామి ఆలయ నిర్వహణకు కొన్ని భూములను ఇచ్చారు… 1502 కాలంలో ఈ భూములను కేటాయించినట్టు శాసనంలో లిఖించి ఉంది… ఈ విషయాన్ని తెలుపుతూ నాగ శాసనం ఏర్పాటు చేసినట్లుగా చరిత్ర పరిశోధకులు తురిమెళ్ళ శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. మైసూరులోని ఆర్కియాలజీ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు చెబుతున్నారు.

ఈ ఆలయం ఎంతో మహిమ కలిగిందని, ఇక్కడ మొక్కులు తీర్చుకున్న భక్తులకు వారి కోరికలు నెరవేరుతాయని అర్చకులు చెబుతున్నారు. 15వ శతాబ్దం నాటి శిలాశాసనం వెలుగులోకి రావడంతో ఈ ఆలయాన్ని సందర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారని చెప్పారు. గతంలో శిథిలా వ్యవస్థలో ఉన్న ఈ ఆలయాన్ని స్థానిక గ్రామస్తులు పునర్ వైభవం తీసుకువచ్చారని అర్చకులు చెప్పారు. ఆలయంలో ఉన్న వీరాంజనేయ స్వామితో పాటు ఆలయం మొత్తం రాతితో ఉండడం ఈ ఆలయం అందర్నీ ఆకర్షిస్తుంది

Also read

Related posts

Share via