November 22, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

తీరని బాలుడి కోరిక.. తల్లిదండ్రులకు మిగిలిన కడుపు కోత..



చిన్న చిన్న విషయాలకే చిన్నారులు ప్రాణాలు తీసుకుంటున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. మారిన కాలనుగుణంగా తల్లితండ్రులు తమ పిల్లల కోసం ఏదో చేద్దామని, ఎంతో సంపాదించాలని నిరంతరం కష్టపడుతూ పిల్లల కోసమే జీవిస్తున్నారు. వారికి కోరింది అందించేందుకు తల్లితండ్రులు పడని కష్టమే లేదు. కానీ కొంతమంది చిన్నారులు తల్లిదండ్రులు తాము కోరింది ఇవ్వకపోతే ప్రాణాలు తీసుకునేందుకు వెనుకాడడం లేదు. ఫలితంగా తల్లితండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు.

ప్రకాశం జిల్లా రాచర్ల మండలం చోళవీడు గ్రామంలో పదమూడేళ్ళ బాలుడు తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు. తాను కోరిన సైకిల్ ఇప్పించలేదని ఉసురు తీసుకున్నాడు. తిరిగిరాని లోకానికి వెళ్లిపోయిన తమ కుమారుడుని చూసి తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 8వ తరగతి చదువుతున్న 13 సంవత్సరాల బాలుడు రోజూ ఉదయం నిద్ర లేచి తల్లితండ్రులతో సరదాగా మాట్లాడుతూ… తనకు కొత్త సైకిల్ కావాలంటూ కొంతకాలంగా తల్లిదండ్రులను కోరుతున్నాడు. అప్పటికే కొత్త సైకిల్ కొనిచ్చిన తల్లిదండ్రులు ఆ సైకిల్‎ని ఉపయోగించుకోవాలంటూ బాలుడికి నచ్చజెప్పారు. తనకు ఆ సైకిల్ నచ్చలేదని కొత్త సైకిల్ కావాలంటూ తల్లిదండ్రులతో బాలుడు మారం చేశాడు. తల్లితండ్రులు అందుకు ససేమీరా అనడంతో బాలుడు మనస్థాపం చెందాడు. తల్లిదండ్రుల ముందే విసురుగా ఇంటి లోపలికి వెళ్లి తలుపులు బిగించాడు. తమని బెదిరిస్తున్నాడనుకుని తల్లితండ్రులు కూడా పట్టించుకోలేదు. కొద్దిసేపటికి లోపల నుంచి ఎటువంటి శబ్దం రాకపోవడంతో కిటికీలోంచి చూసిన తల్లిదండ్రులు తమ కుమారుడు చేసిన పనికి షాక్ తిన్నారు.

తలుపులు బద్దల కొట్టి ఉరి వేసుకున్న తమ కుమారుడిని కిందకు దించి బోరున విలపించారు. అడిగిన సైకిల్‌ ఇప్పిస్తే తమ కుమారుడు తమకు దక్కేవాడేమో అని తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇలా ఎంతోమంది చిన్నారులు తల్లితండ్రులు తమ కోరికలు తీర్చడం లేదంటూ చిన్న చిన్న విషయాలకే తమ ప్రాణాలు తీసుకుంటున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. చిన్నప్పటి నుంచే తమ పిల్లల్ని, వారి మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటూ పిల్లల్ని పెంచడం వల్ల పిల్లల ఆలోచనలో మార్పు తీసుకురావచ్చని మానసిక వైద్యులు సూచిస్తున్నారు.

Also read

Related posts

Share via