ఈ రోజు చే బదులుగా ఇచ్చిన డబ్బులే తిరిగి ఇవ్వడం లేదు. ఇవ్వమంటే బెదిరింపులకు దిగుతున్నారు. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అలాంటిది ఓ సాధారణ మెకానిక్.. తన ఖాతాలో పడ్డ లక్ష సొత్తును తిరిగి ఇచ్చేశాడు.
అతని పేరు రమణ… ఉండేది గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి… వృత్తి సైకిల్ మెకానిక్… చిన్న షాపు పెట్టుకొని ఎప్పటి నుండో సైకిల్స్ రిపేరు చేస్తూ దానితో వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని నడుపుతున్నాడు. అయితే రమణకి ఎస్బిఐలో అకౌంట్ ఉంది. అప్పుడప్పుడు బ్యాంక్‌కు వెళ్లి తన డబ్బులను తెచ్చుకుంటుండేవాడు.. అయితే రెండు రోజుల క్రితం ఎప్పటిలానే రమణ బ్యాంక్ కు వెళ్లాడు. తన డబ్బులు తీసుకుంటున్న క్రమంలో తన ఖాతాలో అధిక మొత్తంలో డబ్బులుండటాన్ని గమనించాడు. ఎంత అంటే లక్ష రూపాయలు తన ఖాతాలో ఉన్నాయి. అవి తన డబ్బులు కాదన్న విషయం రమణకి అర్దమైంది. అయితే తన చిన్న జీవితానికి లక్ష రూపాయలు పెద్ద మొత్తమే… తాను నడుపుకుంటున్న సైకిల్ షాపు ఆ లక్ష రూపాయలతో మరింత మెరుగ్గా తీర్చి దిద్దుకోవచ్చు. లేదంటే కుటుంబ అవసరాలకు వాటిని వాడుకోవచ్చు… అయితే రమణ ఇవేమీ చేయలేదు.
తనవి కాని డబ్బులు తన ఖాతాలో పడినట్లు గుర్తించిన వెంటనే బ్యాంక్ అధికారులకు వద్దకు వెళ్లాడు. తన ఖాతాలో జమ అయిన డబ్బులు ఎక్కడ నుండి వచ్చాయో చూడాలని కోరాడు. వెంటనే బ్యాంక్ సిబ్బంది ఆ డబ్బులు ఎక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయ్యాయో చూశారు. ఒడిస్సాకు చెందిన పంకజ్ మాఝీ ఖాతా నుండి రమణ ఖాతాకు వచ్చినట్లు బ్యాంక్ సిబ్బంది చెప్పారు. వెంటనే అతని డిటెయిల్స్ తీసుకొని అతని ఖాతాకు తిరిగి పంపించమని రమణ బ్యాంక్ సిబ్బందితో చెప్పాడు. వెంటనే బ్యాంక్ సిబ్బంది పంకజ్ మాఝీ అడ్రస్ సేకరించి అతని ఫోన్ చేశారు. అతను వచ్చి రాని ఇంగ్లీష్‌లో మాట్లాడి తన పిల్లల ఫీజు కట్టే క్రమంలో ఒక ఖాతాకు బదులు మరొక ఖాతాకు ఆ మొత్తాన్ని పంపించినట్లు చెప్పాడు. వెంటనే రమణ ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాడని బ్యాంక్ సిబ్బంది పంకజ్‌కు చెప్పారు. వెంటనే రమణ లక్ష రూపాయల్లో ఒక్క రూపాయి కూడా ఉంచుకోకుండా మొత్తం తిరిగి పంకజ్ ఖాతాకు జమ చేశాడు.
డబ్బులు వెంటనే తన ఖాతాకు జమ కావడంతో పంకజ్ మాఝీ సంతోషం వ్యక్తం చేశాడు. రమణ నిజాయితీని మెచ్చుకున్నాడు. బ్యాంక్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపాడు. సకాలంలో తిరిగి డబ్బులు ఇచ్చేయడంతో తమ పిల్లల చదువు ఆగకుండా చేశారని చెప్పుకున్నాడు. అంతేకాదు తన లక్ష రూపాయలు తనకిచ్చిన సైకిల్ మెకానిక్ రమణకు తనకు చేతనైనంతా సాయం చేశాడు. ఆ సాయం ఎంతంటే మూడు వేల రూపాయలను బహుమతిగా పంకజ్ మాఝీ రమణ ఖాతాకు పంపించాడు. దీంతో రమణ కూడా సంతోషంగా ఆ మొత్తాన్ని తీసుకున్నాడు. రమణ నిజాయితీని అందరూ మెచ్చుకున్నారు.
Also read
- నేటి జాతకములు 4 ఫిబ్రవరి, 2025
- Andhra News: జర భద్రం.. ఒక్క ఫోన్ కాల్‌తో రిటైర్డ్ టీచర్ నుంచి రూ.36 లక్షలు కొట్టేశారు.. చివరకు
- వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడనే కోపంతో..
- పుట్టిన గంటకే భిడ్డకు దూరమైన తల్లి
- Vishnuja: జాబ్ లేదు.. అందం అసలే లేదు!