SGSTV NEWS online
Andhra PradeshCrime

Vijayawada Maoists: మావోల అరెస్ట్‌పై కృష్ణా ఎస్పీ కీలక వ్యాఖ్యలు

డీజీపీ పర్యవేక్షణలోనే సెర్చ్ ఆపరేషన్ నడించదని.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను డీజీపీ వెల్లడించనున్నట్లు కృష్ణా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు



విజయవాడ, నవంబర్ 18: నగరంలో భారీగా మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కొత్త ఆటోనగర్‌లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో అక్టోపస్, గ్రే హౌండ్స్ బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి 27 మంది మావోలను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కృష్ణా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మా ఎన్ కౌంటర్ అనంతరం కొత్త ఆటోనగర్‌లో 27 మందిని అదుపులోకి తీసుకున్నామని.. నేడు ఇది చాలా మేజర్ ఆపరేషన్ అని చెప్పుకొచ్చారు.

దేవ్ జీ సెంట్రల్ కమిటీ అధ్యక్షులు, అతనితో పాటు ఉన్న తొమ్మిది మంది ప్రొటెక్షన్ టీంను పట్టుకున్నామన్నారు. మిగతా వారు కూడా నక్సల్ ఆపరేషన్‌లో కీలకంగా ఉన్నట్లు చెప్పారు. డీజీపీ పర్యవేక్షణలో ఈ మొత్తం నడిచిందని తెలిపారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను రేపు (బుధవారం) డీజీపీ వెల్లడిస్తారని అన్నారు. వెపన్స్ కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచే వారంతా వివిధ మార్గాల్లో విజయవాడకు వచ్చినట్లు తెలిపారు. పట్టుబడిన వారిలో 21 మంది మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారన్నారు. రాష్ట్ర పోలీసుకు వచ్చిన సమాచారంతో ఈ ఆపరేషన్ మొత్తం సాగిందని తెలిపారు.

హిడ్మా ఇక్కడ నుంచే వెళ్లారనేది ఇంకా స్పష్టత లేదని ఎస్పీ అన్నారు. వారందరినీ పూర్తిగా విచారణ చేశాక వివరాలు తెలుపుతామని.. పోలీసులకు ఉండే ఫైర్ ఫోర్స్‌తో వారు ఎదురు తిరిగలేరన్నారు. ఐదు జిల్లాల్లో నేడు ఈ ఆపరేషన్ జరిగిందని.. కృష్ణా జిల్లా పరంగా తమ ఆపరేషన్ వివరాలు తెలియజేసినట్లు చెప్పారు. డేటా మొత్తం తీసుకుని, విచారణ ముగిశాక అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. ఇది ఇండస్ట్రియల్ ఏరియా అని.. లేబర్ చాలా మంది ఉంటారని తెలిపారు. బయటి రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ల లాగానే మావోయిస్టులు కూడా వచ్చారని.. తమకు సమాచారం వచ్చాక నిఘా పెట్టి నేడు పట్టుకున్నామని వెల్లడించారు. గన్నవరం, పెనమలూరు, కంకిపాడు పోలీసు టీంలు పాల్గొన్నాయన్నారు. మావోయిస్టులు ఏదో‌ ప్రణాళికతోనే ఇక్కడ మకాం వేశారని.. అన్ని విషయాలు విచారణ అయ్యాక చెబుతామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు.

Also Read

Related posts