సీఎం జగన్‌పై దాడి కేసులో దర్యాప్తు ఎంతవరకు వచ్చింది.? అధికారులు ఏం చెబుతున్నారు.? సీఎం జగన్‌పై దాడి కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. విజయవాడలోని వడ్డెరకాలనీకి చెందిన 10 మంది యువకులపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అందులో తానే దాడి చేసినట్టుగా ఒక యువకుడు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దాడి వెనుక ఉన్న కారణాలపై ఆరా తీస్తున్నారు. పోలీసుల అదుపులో ఆరుగురు యువకులు మైనర్లుగా తెలుస్తోంది. విజయవాడ సీసీఎస్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు అనుమానితులను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పోలీసులు 20 టీమ్‌లుగా విడిపోయి దర్యాప్తు సాగిస్తున్నారు.
ఇప్పటివరకూ సుమారుగా 70 మందిని ప్రశ్నించారు. సీసీ టీవీ ఫుటేజ్‌లను సైబర్ ల్యాబ్స్‌కు పంపారు. వివేకానంద స్కూల్, గంగానమ్మ గుడి ప్రాంతాన్ని పోలీసులు జల్లెడపట్టారు. ఘటన జరిగిన సింగ్ నగర్ స్కూల్ పరిసరాల్లో వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే డ్రోన్ కెమెరాలతో పరిసర ప్రాంతాలను వీడియో చిత్రీకరణ చేసిన అధికారులు.. సెల్ ఫోన్ డేటాను డంప్ చేసి మరీ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్ కాల్స్ వివరాలను తెప్పించి, వాటిని వడపోసే పనిలో ఉన్నారు. అనుమానాస్పదంగా ఉండే కాల్స్, ఒకే నంబరు నుంచి ఎక్కువసార్లు వెళ్లిన ఫోన్లపై దృష్టి పెట్టారు. ఇద్దరు, ముగ్గురు కలిసి కాన్ఫరెన్స్‌కాల్‌లో మాట్లాడుకునే అవకాశం సైతం ఉండవచ్చనే కోణంలో పరిశీలిస్తున్నారు. ఇక ఘటనా స్థలంలో నాలుగు రాళ్లను సేకరించిన పోలీసులు.. వాటిలో జగన్‌పై ఏ రాయి విసిరారనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.
మరోవైపు వడ్డెర కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. విచారణ పేరుతో తమ పిల్లల్ని అన్యాయంగా తీసుకెళ్లారంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా సీఎం జగన్‌పై జరిగిన దాడి కేసులో నిందితులను పట్టుకునేందుకు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు సాగిస్తున్నారు అధికారులు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలు కూడా దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామంటూనే మరి కొందరు హేళన చేస్తూ రాయి దాడిపై పలు ఆరోపణలు చేస్తున్నారు. విజయవాడలో ముఖ్యమంత్రిపై గులక రాయి దాడి ఘటనపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు శ్రీ కోన తాతారావు ఈసీకి లేఖను అందజేశారు. ఇందులో ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు శ్రీ షేక్ రియాజ్, పార్టీ చేనేత వికాస విభాగం ఛైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ నగర పోలీస్ కమిషనర్, ముఖ్యమంత్రి భద్రత అధికారినీ బాధ్యులను చేయాలని లేఖలో పేర్కొన్నారు. నిష్పాక్షిక విచారణ చేయించాలని కోరుతున్నట్లు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారికి వినతి పత్రం అందజేశారు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం