కారుకు సైడ్ ఇవ్వలేదన్న కోపంతో సైకిల్‌పై వెళుతున్న ఓ విద్యార్దిని కత్తులతో దారుణంగా పొడిచి చంపేశారు.. బాపట్లజిల్లా చీరాలలో జరిగిన ఈ దారుణ ఘటన కలకలం రేపింది. ఈ దారుణానికి పాల్పడింది చీరాల ప్రాంతంలో సెటిల్‌మెంట్లు, దౌర్జన్యాలు చేస్తూ కారులో తిరుగుతూ అఘాయిత్యాలకు పాల్పడుతున్న యువకులుగా అనుమానిస్తున్నారు. ఒకవైపు హత్య చేసి, మరోవైపు ఈ చిన్న విషయాన్ని పెద్దది చేయకండి లేకుంటే మీ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తామంటూ విద్యార్ధి తండ్రికి వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన మృతుడి బంధువులు, ప్రజా సంఘాల నేతలు మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ రోడ్డుపై ఆందోళనకు దిగారు. పరిస్తితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పి నిందితులను వెంటనే అరెస్ట్ చేస్తామంటూ హామీ ఇచ్చారు. బాపట్లజిల్లా చీరాల మండలం అదినారాయణపురం దగ్గర డిగ్రీ ఫస్టియర్ చదువుతున్న 18 ఏళ్ళ విద్యార్ది ఆరిఫ్‌ను కొంతమంది పోకిరిలు కత్తులతో పొడిచి దారుణంగా చంపేశారు. ఆరిఫ్ తన స్నేహితుడు మనోజ్‌తో కలిసి సైకిల్‌పై వెళుతుండగా వెనుక నుంచి హారన్ కొడుతున్న కారుకు సైడ్ ఇవ్వలేదన్న కారణంగా కారులో నుంచి దిగిన నలుగురు యువకులు వీరిపై దాడి చేశారు. మనోజ్‌ను చితక్కొట్టారు.. ఎందుకు కొడుతున్నారని అడ్డం తిరిగిన ఆరిఫ్‌ఫై కత్తులతో విచక్షణారహింగా విరుచుకుపడ్డారు. ఒంటిపై పలుచోట్ల గాయాలు కావడంతో ఆరిఫ్‌కు తీవ్ర రక్తశ్రావమైంది. వెంటనే అక్కడినుంచి నిందితులు కారులో పారిపోయారు. తీవ్రంగా గాయపడ్డ ఆరిఫ్‌ను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స అందించేలోపే చనిపోయాడు.. మృతుడు ఆరిఫ్ చీరాలలోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఎవరితో గొడవలు పెట్టుకోని ఆరిఫ్‌ను కేవలం కారుకు సైడ్ ఇవ్వలేదన్న కారణంగా నలుగురు యువకులు కత్తులతో పొడిచి చంపిన విషయాన్ని తెలుసుకుని చీరాల వాసులు భయాందోళన చెందుతున్నారు. నిందితులు గతంలో కూడా ఇలాగే దౌర్జన్యాలు చేసేవారని, సెటిల్‌మెంట్లు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంటారని స్తానికులు చెబుతున్నారు. వీరి గురించి ఎవరైనా పోలీసులకు సమాచారం ఇస్తే చంపేస్తారన్న భయంతో ఎవరికి చెప్పలేకపోతున్నామంటున్నారు.
ఎందుకు కొడుతున్నారని ప్రశ్నిస్తే కత్తులతో పొడిచారు…
దుండగుల చేతిలో చనిపోయిన ఆరిఫ్ స్నేహితుడు మనోజ్‌కు కూడా గాయాలయ్యాయి. అయితే మనోజ్‌ను కేవలం కొట్టి వదిలేసిన దుండగులు ఆరిఫ్‌ను మాత్రం ఇష్టం వచ్చినట్టు పొడిచి చంపేశారు.. కారుకు సైడ్ ఇవ్వకుండా ఇద్దరూ లవర్స్‌లా మాట్లాడుకుంటూ వెళుతున్నారు. ఏందిరా మీ సంగతంటూ కారులో నుంచి దిగిన దుండగులు వీరిద్దరిని తొలుత బెదిరించారు. అయితే, ఆరిఫ్ అడ్డం తిరగడంతో మాకే ఎదురుతిరుగుతావా… అంటూ కత్తులతో పొడిచేశారని ఆరిఫ్ స్నేహితుడు మనోజ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
కేసు పెడితే ఫ్యామిలీని లేపేస్తాం… నిందితుల బెదిరింపు..
ఒకవైపు బిడ్డను పోగొట్టుకుని పుట్టెడు దుఖంలో ఉన్న మృతుడి కుటుంబ సభ్యులను నిందితులలో ఒకరి అన్న బెదిరింపులకు దిగాడు. ఏదో చిన్న విషయం జరిగితే దాన్ని పెద్దది చేయకండి లేకుంటే మీ కుటుంబాన్ని కూడా లేపేస్తామంటూ ఇంటికి వచ్చి మరీ బెదిరించారు. ఆ సమయంలో అతడి ఫోటోను తీసి పోలీసులకు ఇచ్చారు మృతుడి బంధువులు.. అయితే ఇంటికి వచ్చి బెదిరించిన వ్యక్తితో పాటు హత్య చేసిన నిందితులను కూడా పోలీసులు పట్టుకోకపోవడంతో మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి అండగా పలువురు ప్రజా సంఘాల నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. పరిస్తితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఒకవైపు హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేయకపోగా, మరోవైపు బెదిరింపులకు పాల్పడుతున్న వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోకపోవడాన్ని మృతుడి బంధువులు ప్రశ్నిస్తున్నారు.
Also read
- AP News: స్వామి మాలలో ఖైదీకి టిఫిన్ తీసుకొచ్చిన వ్యక్తి.. అనుమానంతో బాక్స్ తెరిచి చూడగా
- ఈ ఏడాది కాల భైరవుడి జయంతి ఎప్పుడు.. శివ పురాణం ప్రకారం ఎలా అవతరించాడో తెలుసా..
- అత్తా.. నీ కూతురింక లేదు.. చంపేసిన!
- పెళ్లికి ఓకే చెప్పలేదని టీచర్‌పై రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. క్లాస్ రూంలోనే..
- Andhra Pradesh: 10 నిమిషాల్లో ఇంటికి చేరేవారే.. కానీ అంతలోనే కబలించిన మృత్యువు!