February 4, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra Pradesh: తల్లిపై కొడుకు చెడు ప్రచారం.. కువైట్ నుంచి వచ్చిన తండ్రి ఏం చేశాడంటే..?

 

కంటికిరెప్పలా కాపాడాల్సిన కనుపాపనే కాటేసింది. కన్న కొడుకు పట్ల తల్లిదండ్రులే కసాయిలుగా మారారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి కన్న తల్లిపైనే నిందలు మోపడంతో తట్టుకోలేకపోయింది. చివరికి కన్నకొడుకుకు టవల్‌తో ఉరేసి హతమార్చారు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం పోలిలో చోటు చేసుకుంది.


అన్నమయ్య జిల్లా రాజంపేటలో దారుణం వెలుగు చూసింది. కన్న కొడుకునే హత్య చేసి చంపేశారు తల్లిదండ్రులు. మత్తు పదార్థాలకు బానిసై చెడు తిరుగుడ్లు తిరుగుతున్నాడంటూ ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. కువైట్‌లో ఉన్న తండ్రిని పిలిపించిన తల్లి, ఇద్దరు కలిసి కన్నకొడుకుకు ఉరేసి అంతమొందించారు. ఈ సంఘటన రాజంపేట మండలం పోలిలో మంగళవారం(జనవరి 14)న జరిగింది.


తల్లిదండ్రులే కసాయిలుగా మారారు. పోలి గ్రామానికి చెందిన గౌనిపురి లక్ష్మీనరసరాజు, లలితమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. లక్ష్మీనరసరాజు జీవనోపాధి కోసం కువైట్‌ వెళ్లాడు. పెద్ద కొడుకు చరణ్‌కుమార్‌రాజు (19) రాజంపేటలోని ఓ బైక్ షోరూమ్‌లో పని చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా మద్యానికి, మత్తుకు బానిసయ్యాడు. తల్లితో తరచూ గొడవ పడుతున్నాడు. ఇటీవల తల్లికి వివాహేతర సంబంధం అంటగట్టి, గ్రామస్తుల ముందు అసభ్యంగా దూషించాడు. దీన్ని అవమానంగా భావించిన తల్లి తన భర్తకు ఫోన్‌ చేసి విషయం చెప్పింది.

జనవరి 11వ తేదీన కువైట్ నుంచి ఇంటికి వచ్చిన చరణ్ తండ్రి లక్ష్మీనరసరాజు, కొడుకును అంతమొందించేందుకు పక్కా ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే ముందుగా తల్లిదండ్రులిద్దరూ కొడుకు చరణ్‌కు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అతను వినిపించుకోలేదు. కాగా సోమవారం అర్ధరాత్రి ఫుల్‌గా మద్యం సేవించి ఇంటికొచ్చిన చరణ్ మరోసారి తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగాడు. దీంతో కుమారుడి కాళ్లను టవల్‌‌తో కట్టేసి, మరో టవల్‌తో గొంతుకు బిగించి ఉరి వేసి హతమార్చారు. కొడుకు మరణాన్ని అనారోగ్యంతో మృతి చెందాడని స్థానికులను నమ్మించేందుకు ప్రయత్నించారు.


అయితే ఈ ఘటనకు సంబంధించి మంగళవారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా తామే హత్య చేసినట్లు ఒప్పుకొన్నారని మన్నూరు సీఐ తెలిపారు. నిందితులిద్దరిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలించారు. రాజంపేట మండలం హెచ్‌చెర్లోపల్లికి చెందిన చరణ్‌కుమార్‌ తాత వెంకటనరసరాజు ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేశామన్నారు

Also Read

Related posts

Share via