గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుతో ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వంశీని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద అరెస్టు చేశారు. ఈ కేసుతో పాటు మరికొన్ని కేసుల్లోనూ ఆయన నిందితుడుగా ఉన్నారు. వంశీ అరెస్టుపై వైసీపీ, టీడీపీ పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి.
వల్లభనేని వంశీ.. తెలుగురాష్ట్రాలకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. వంశీపేరు చెబితే..గన్నవరం ఏరియాలో ఓ స్టార్ హీరోకున్నంత ఎలివేషన్ ఉంటుంది. కృష్ణాజిల్లా రాజీకీయాల్లో పాన్ ఇండియా స్టార్ కున్నంత నేషనల్ రేంజ్ బిల్డప్ ఉంటుంది. అంతలా పాతుకుపోయింది వంశీ రాజకీయం. పోస్ట్ కార్డు మీద జస్ట్ వంశీ అని రాస్తే చాలు.. డైరెక్ట్‌గా గన్నవరం ఆయన ఇంటి గడపకు చేరేంత చరిష్మా, ఖలేజా ఉన్న సాలిడ్ పర్శనాలిటీ వల్లభనేని వంశీది. మాటకు సెన్సార్ ఉండదు. ప్రత్యర్ధి ఎంతటోడైనా సరే.. ఎగొట్టిదిగ్గొట్టడమే వంశీకి తెలిసిన రాజకీయ విద్య. అందుకే తెగింపు ఆయన ఇంటి పేరు అయ్యింది. తెగేదాకా లాగడం ఆయన ఒంటి తీరుగా మారింది. లేటెస్ట్‌గా వల్లభనేనిని ఎందుకు అరెస్ట్ చేయబడ్డారో తెలుగురాష్ట్రాలకు తెలుసు..! వైసీపీ నేతలు రెడ్‌బుక్ రాజ్యాంగం అనొచ్చు. టీడీపీనేతలు.. చట్టం తనపని తాను చేసుకుపోతోదనచ్చు.. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో…గన్నవరంలో రాజకీయ లెక్కలు తారుమారయ్యాయి. వెంటనే ఆయన ఇంటి అడ్రస్ మారింది. పోస్ట్ కార్డ్ మీద వంశీపేరే కాదు.. టోటల్ ఫ్యామిలీ ఫ్యామిలీ అడ్రస్ రాసినా దొరకలేదు. గూగుల్ మ్యాపునకూ అంతుపట్టలేదు. అంతగా జనజీవన స్రవంతికి దూరమైపోయారు డాక్టర్ వంశీ. మొత్తానికి గురువారం(ఫిబ్రవరి 13) నాడు హైదరాబాద్‌కు వచ్చి మరీ వంశీని అరెస్ట్ చేసి కారులో హైవే మార్గాన సర్రున తీసుకెళ్లి.. జర్రున విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు పోలీసులు. అక్కడి నుంచి వైద్యపరీక్షలు గావించి.. ఎస్సీ, ఎస్టీ కోర్టులో హాజరుపరిచారు. చివరాఖర్న శ్రీకృష్ణజన్మస్థానమనే నాలుగు గోడల మధ్య వంశీని బంధీని చేశారు పోలీసులు.
మొత్తానికి గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ లీడర్ వల్లభనేని వంశీని టచ్ చేసి చూశారు. టచ్ చేయడమే కాదు.. జైల్లో కూడా పెట్టారు. 2023, ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై వల్లభనేని వంశీ అనుచరులు దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించారంటూ.. అప్పట్లో టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఆ కేసును పట్టించుకోలేదని ఆరోపిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే కేసును సీఐడీకి అప్పగించారు.
మొత్తంగా ఆ ఘటనకు సంబంధించి 94మందిపై కేసు నమోదైంది. ఆ కేసులో వంశీ నంబర్ ఏ71. విచారణలో ఇప్పటివరకు సీఐడీ 40మందిని అరెస్టు చేసింది. అయితే, ఫిర్యాదుదారు సత్యవర్ధన్‌ను కేసు వెనక్కి తీసుకుంటున్నట్టు కోర్టులో అఫిడవిట్ వేశారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులపై విజయవాడ పటమట పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దీంతో గురువారం ఉదయం హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం భుజాలోని అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. వంశీపై కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లతో పాటు బీఎన్ఎస్ సెక్షన్లు 140(1), 308, 351(3), రెడ్ విత్ 3(5) కింద కేసు నమోదు చేశారు. వంశీని అరెస్ట్ చేస్తున్నట్లు ఆయన భార్యకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
ఈ కేసుపైనే కాదు.. వల్లభనేని వంశీ మరికొన్ని కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నారు. బాపులపాడు మండలం ఆరుగొలనులో టీడీపీ నేత వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను అక్రమంగా కూల్చివేసిన కేసులో ఏ2గా వంశీ పేరుంది. ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై హత్యాయత్నం కేసు, గన్నవరం మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు కాసరనేని రంగబాబుపై దాడి కేసు, హనుమాన్ జంక్షన్‌లో నకిలీ ఇళ్ల పట్టాల కేసుల్లో వంశీ నిందితుడిగా ఉన్నారు.
కృష్ణలంక పీఎస్‌లోనే వంశీని పలు ఆధారాలతో పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అలాగే కేసులో కీలకంగా ఉన్న సాక్షి సత్యవర్ధన్‌ను పటమట పీఎస్‌కు తీసుకెళ్లారు. వంశీ స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారు. వంశీ ఇచ్చిన వాంగ్మూలం, ఆధారాలతో రిమాండ్ రిపోర్ట్ ఫైల్ చేశారు పోలీసులు. మరోవైపు తన భర్తను ఏకేసుమీద అరెస్ట్ చేశారో చెప్పాలంటూ వంశీ సతీమణి కృష్ణలంక పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఇదిలావుంటే, సుమారు నాలుగు గంటల వరకు కృష్ణలంక పీఎస్‌లోనే వంశీని ఉంచారు పోలీసులు. సాయంత్రం4.30గంటల సమయంలో వంశీ సతీమణిని పోలీస్‌స్టేషన్‌లోకి అనుమతించారు.
మరోవైపు వంశీ అరెస్టు అక్రమమని వైసీపీ మండిపడింది. వంశీపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వంశీకి ముందస్తు బెయిల్ ఉందని గుర్తు చేసింది. ఇటీవల సాక్షి సత్యవర్థన్ కూడా ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారని తెలిపింది. చంద్రబాబు.. ఇంకెన్నాళ్లు ఈ కక్షపూరిత రాజకీయాలు అంటూ ఆగ్రహించింది. అయితే వంశీ అరెస్ట్‌పై వైసీపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఏ ఆధారమూ లేని కేసులో వంశీని ఎలా అరెస్ట్ చేస్తారని మాజీ మంత్రి బొత్స ప్రశ్నించారు.
వైసీపీ నేతల మాటలపై టీడీపీ కూడా తీవ్రంగా స్పందించింది. అటవికంగా అరాచకం చేసే ఇలాంటి పిల్ల సైకోలను చట్టపరంగా శిక్షించడం తప్పా..? అంటూ గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి వీడియోను పోస్ట్ చేసింది టీడీపీ. గన్నవరం నియోజకవర్గం అంటే పుచ్చలపల్లి సుందరయ్యగారు మూడు సార్లు ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గమని, ఉక్కు కాకానిగా పిలువబడే కాకాని వెంకటరత్నం, కవి సమ్రాట్, తెలుగు నేలకు జ్ఞానపీఠం తెచ్చిపెట్టిన విశ్వనాథ సత్యనారాయణగారి జన్మభూమి అని.. అంతటి ఘన చరిత్ర కలిగిన గన్నవరం మీద అరాచకం చేసి, అవినీతిలో మునిగితేలి, రౌడీలు, గూండాలతో ప్రతి రోజు అల్లర్లు జరిగేలా చేసిన పిల్ల సైకో పాపం పండిందంటూ ట్విట్టర్ వేదికగా కౌంటర్ పోస్ట్ చేసింది టీడీపీ. వంశీ అరెస్టును బూతద్దంలో చూడాల్సిన పనిలేదని.. కక్షపూరితంగా అరెస్ట్ చేయాలనుకుంటే అధికారంలోకి రాగానే చేసేవాళ్లమని.. చట్ట ప్రకారం తప్పు చేసిన ప్రతి ఒక్కరినీ శిక్షిస్తామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. మొత్తానికి వంశీ అరెస్ట్ ఏపీలో రాజకీయ కాకను రేపుతోంది. ఇప్పడిది శాంపిల్ మాత్రమే..మున్ముందు భూమి బద్దలయ్యే సంచలనాలు జరగబోతున్నాయంటూ రాజకీయంగా చర్చ జరుగుతోంది.
వంశీ ప్లాష్‌బ్యాక్‌కు వెళ్తే..ఆయన తొలి అడుగులు ఫ్యాక్షన్ ప్రాంతంలోనే పడ్డాయి. వెటర్నరీ డాక్టర్‌గా మాస్టర్ కోర్స్ తీసుకున్న వంశీ అమెరికా వెళ్లేందుకు గట్టిగా ప్రయత్నించారు. కానీ.. వీసా ప్రాబ్లమ్స్ వల్ల వీలు కాలేదు. ఇక ఇక్కడే బిజినెస్ స్టార్ట్ చేశారు. ముందుగా రియల్ ఎస్టేట్‌లో అడుగుపెట్టారు. తర్వాత పెద్ద పెద్ద పరిచయాలు. అలా మొదలైన వంశీ ప్రస్థానం.. తన స్నేహితుడి ద్వారా పరిటాల రవితో పరిచయం ఏర్పడింది. ఇక్కడ నుంచి ఆయన జర్నీ మరో టర్న్ తీసుకుంది. అతికొద్ది రోజుల్లోనే పరిటాలకు మరింత దగ్గర అయ్యాడు వంశీ.
ఓ రకంగా పరిటాలకు రైట్ హ్యాండ్ వంశీనే. ఎలాంటి భయం లేకుండా ప్రత్యర్ధులపై విరుచుకపడటం వంశీ స్టైల్. బహుశా ఆధైర్యం.. పరిటాల స్నేహంతోనే అబ్బిందంటారు వంశీ సన్నిహితులు. అంతేకాదు పరిటాల రవిపై దాడులు జరుగుతున్న సమయంలో ఆయనతో జర్నీ చేసేందుకు అనుచరులు భయపడేవారు. కానీ వంశీ.. మాత్రం ఎలాంటి భయం లేకుండా పరిటాలతో ఉండేవారట. అందుకే ఆయనకు ముఖ్య అనుచరుడిగా వంశీ పేరు సంపాదించుకున్నారు.
మరోవైపు.. వంగవీటి రాధా, కొడాలి నానితోనూ మంచి స్నేహబంధం ఉంది వంశీకి. ఈ సమయంలో కొడాలి నాని ద్వారా నందమూరి కుటుంబంతో పరిచయం మరో మలుపు తిప్పింది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్‌తో మంచి బంధం ఏర్పడింది. తారక్, హరికృష్ణతో వంశీ చాలా క్లోజ్ గా ఉండేవారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వంశీకి కలిసి రావడంతో కొన్ని సేవా కార్యక్రమాలు కూడా అప్పట్లో ప్రారంభించారు. ఇక రాజకీయాల్లోకి రావాలన్న కోరికతో 2006లో టీడీపీలో చేరారు. 2009 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేయాలనుకున్న వంశీకి.. ఎన్టీఆరే దగ్గరుండీ ఎంపీ టికెట్ ఇప్పించారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన లగడపాటి రాజగోపాల్ ఎంపీగా గెలుపొందారు. ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత తన వ్యాపారాలు చూసుకుంటూ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. ఈ సమయంలోనే వంశీ ఫోకస్ సినిమాలపై పడింది. సినిమా నిర్మాతగా మారి 2009లో పున్నమినాగు, 2010లో జూ. ఎన్టీఆర్ తో అదుర్స్ సినిమా నిర్మించారు. ఆ తర్వాత కొడాలి నానితో కలిసి 2018లో రవితేజ హీరోగా టచ్ చేసి చూడు మూవీని తెరకెక్కించారు.
ఇక 2014లో 2019లలో వంశీ గన్నవరం సీటు నుంచి పోటీ చేసి గెలిచారు. జగన్ వేవ్‌ను సైతం తట్టుకుని మరి గెలిచి చూపించారు. ఇందాకా సజావుగా సాగుతున్న వంశీ సినీ రాజకీయ జీవితం..2016 నుంచి తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అటు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దూరం కావడం.. ప్రియ మిత్రులంతా ప్రత్యర్ధి పార్టీలో ఉండడంతో.. పార్టీలో ఇమడలేకపోయారు. అలాగే గన్నవరం టీడీపీ నేతలతోనూ వంశీకి విభేదాలు తారాస్థాయిలో ఉండేవి. దీంతో 2019 ఎన్నికలకు ముందు వంశీ దాదాపుగా వైసీపీలో చేరతారని వార్తలొచ్చాయి. కారణం..టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ప్రత్యర్ధి పార్టీ అధినేత జగన్‌ను పబ్లిక్‌గా వంశీ ఆలింగనం చేసుకున్న దృశ్యాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి.
వంశీ చర్యలపై టీడీపీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయినా సరే పార్టీ మారకుండా టీడీపీలోనే కొనసాగారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మళ్లీ పోటీ చేసి వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై 838 ఓట్లతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. అయినా టీడీపీలో మునుపటిలా చురుకుగా ఉండలేదు వంశీ. పైగా తనను పొమ్మనలేక పొగపెడుతున్నారన్న అనుమానం వంశీలో బలంగా నాటుకుపోయింది. తనకు వ్యతిరేకంగా లోకేశ్ సోషల్ మీడియాలో వార్తలు క్రియేట్ చేస్తున్నాడన్న డౌట్ వంశీలో ఏర్పడింది. అందుకే 2019 ఎన్నికల తరువాత ఆయన టీడీపీకి దాదాపు దూరంగా ఉంటూ వచ్చారు. తర్వాత పార్టీకి రాజీనామా చేయకుండానే ఎమ్మెల్యేగా కొనసాగుతూ వైసీపీకి మద్దతుగా ఉన్నారు.
అప్పట్నుంచి వంశీ టాకింగ్ స్టైలే మారిపోయింది. విద్యాధికుడైన వంశీ.. లోకల్ భాషకు టర్న్ అయ్యారు. యాస మారింది. పదాల్లో గౌరవం తగ్గింది. ముఖ్యంగా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ.. పూర్తిస్థాయి వైసీపీ నాయకుడిగా మారిపోయారు. ఓవైపు గుడివాడలో కొడాలినాని.. ఇటు గన్నవరంలో వల్లభనేని వంశీ.. చంద్రబాబుపై విరుచుకుపడ్డ తీరు ఇప్పటికీ సంచలనమే. ఓదశలో హద్దు దాటి కూడా వంశీ చంద్రబాబు కుటుంబంపై తీవ్ర పదజాలంతో తిట్లదండకం అందుకునేవారు. ఇందులో తీవ్ర వివాదాస్పదమైన మాటలు చంద్రబాబు సతీమణిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. ఆ మాటలు నారా నందమూరి ఫ్యామిలీనే కాదు.. టోటల్ టీడీపీ కుటుంబాన్ని తీవ్రంగా కలచివేశాయి. 40ఏళ్లకుపైగా రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబునే కంటతడిపెట్టించాయి. తెలుగురాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి.
ఆ తర్వాత టీవీ9వేదికగా వంశీ క్షమాణలు చెప్పినా.. ఆ మాటలు చేసిన గాయాలు.. తెలుగు దేశం పార్టీ శ్రేణులకు ఇంకా మానలేదు. ఇంతటితోనే ఆగలేదు. వేదిక ఏదైనా..సందర్భం ఎలాంటిదైనా..మైకందుకుంటే చాలు.. వంశీ నోటి నుంచి చంద్రబాబు టార్గెట్‌గా బూతులు పంచాంగం అలవోకగా వచ్చేది. చంద్రబాబునే కాదు.. చంద్రబాబు తండ్రినీ, తాతలను కూడా వదల్లేదు వంశీ. టోటల్ నారా వంశాన్నే తన తిట్లపోతతో ఉక్కపోత పోయించాడు డాక్టర్ వంశీ. గన్నవరం పేరెత్తితే చాలు.. తిట్లతోనే తలంటుపోసేవారు వంశీ. అలా సాగుతూ.. చంద్రబాబుపై అగ్రెసివ్ పాలిటిక్స్ చేస్తూ.. తన స్నేహితుడు కొడాలి నానితో వంశీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అయితే 2024తర్వాత టోటల్ రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. 2024లో వైసీపీ నుంచి గన్నవరం అభ్యర్ధిగా పోటీ చేసిన వంశీ.. టీడీపీ అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు చేతిలో 37వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఫలితాల తర్వాత కేవలం ఒకటి రెండు సార్లు మాత్రమే మీడియాకి కనిపించిన ఆయన అప్పట్నుంచి దాదాపుగా అజ్ఞాతంలోనే గడుపారు. అప్పట్నుంచి వంశీ కోసం గాలిస్తున్నారు. వంశీ ఆచూకీ పోలీసులకే కాదు.. సొంత పార్టీ నేతలకు కూడా తెలియలేదు. ప్రస్తుతం వంశీ అరెస్ట్‌పై అటు టీడీపీ-వైసీపీమద్య మాటల యుద్ధం సాగుతోంది.
వల్లభనేని వంశీ అరెస్ట్‌తో కృష్ణా జిల్లాలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. గన్నవరం ముగిసింది.. గుడివాడలో వేట మొదలైంది.. అంటూ ఇప్పటికే టీడీపీ శ్రేణులు సోషల్ మీడీయా వేదికగా ప్రచారం ముమ్మరం చేశారు. మరి నెక్స్ట్ టార్గెట్ కొడాలి నానినేనా అన్న చర్చ కృష్ణా జిల్లాలో మొదలైంది. మరి చూడాలి.. నెక్స్ట్ లిస్ట్‌లో ఉన్న అరెస్ట్ ఎవరిదో..?
Also read
- ఆడ వేషంలో పెళ్లైన ప్రియురాలి ఇంటికి బాయ్‌ఫ్రెండ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- Telangana: మటన్ కర్రీ వండలేదన్న పాపానికి.. భర్త ఏం చేశాడో చూస్తే దిమ్మతిరుగుద్ది.!
- Andhra News: పాపం పెద్దావిడ తిరుపతి వెళ్లేందుకు బస్సు ఎక్కింది.. లీలగా మాయ చేసి..
- Telangana: ఇంటర్ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థిని.. ఒక్కసారిగా శబ్దం.. ఏమైందంటే..?
- శ్రీ లక్ష్మీ జయంతి- తేదీ, సమయం, పూజ, ఆచారాలు, విశిష్టత వివరాలు ఇవే!
Sri Lakshmi Jayanti 2025
Kiran Royal Issue: జనసేన నేత కిరణ్ రాయల్ కేసులో బిగ్ ట్విస్ట్.. లక్ష్మి అరెస్ట్