November 21, 2024
SGSTV NEWS
Andhra PradeshViral

కన్నకొడుకు శవాన్ని భజాన వేసుకున్న తండ్రి.. 8 కిలోమీటర్ల ప్రయాణం.. Watch Video

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీ కొండ శిఖర గ్రామమైన చిన్న కోనల గ్రామంలో హృదయ విదారకమైన ఘటన చోటు చేసుకుంది. రెండు నెలల క్రితం గుంటూరు జిల్లా కొల్లూరు ఏరియా ఇటుక బట్టి పనులకు వెళ్లారు ఆదివాసీ గిరిజన దంపతులు సారా కొత్తయ్య, భార్య సార సీత. ఈ క్రమంలోనే అంతులేని విషాదాన్ని మిగిల్చింది ఈ ఘటన. ఈ ఆదివాసి గిరిజన దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో రెండో వాడు సార ఈశ్వరరావు. ఈ రెండున్నర సంవత్సరాల వయసు కల ఈశ్వర్ రావు ఈనెల 8 న అనారోగ్యం పాలయ్యాడు. ప్రైవేట్ హాస్పిటల్‎కు తీసుకెళ్తే అక్కడ మరణించారు. దీంతో ఇటుక బట్టి యాజమాన్యం అంబులెన్స్‎లో కొంతదూరం పంపారు. నిన్న తెల్లవారుజాము రెండు గంటలకి విజయనగరం జిల్లా మెంటాడ మండలం వనిజ గ్రామం వద్ద బాలుడు శవాన్ని, తల్లిదండ్రులను వదిలిపెట్టి అంబులెన్స్ వెళ్ళిపోయింది. అక్కడి నుంచి రోడ్డు మార్గం లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఈశ్వర్ రావు మృత దేహాన్ని భుజాన వేసుకుని ఎత్తైన కొండల్లో మోసుకొని వెళ్లాడు. సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరం తండ్రి, తాతలు మోసుకుంటూ తమ స్వగ్రామైన చిన్నకోనెలకు తెల్లవారి ఉదయం 8 గంటలకు చేరుకున్నారు. అనంతరం ఈశ్వర రావు శవాన్ని దహనం చేశారు. ఈ ఘటన అందరిలో ఆవేదనను నింపింది.

అమృతకాలంలోనూ రహదారి సౌకర్యాల లేమి..
స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిండి. అమృత మహోత్సవాలు జరుపుకుంటున్నప్పటికీ ఇంకా కొన్ని గిరిజన గ్రామాలకు కనీస మౌలిక సదుపాయాల కల్పనలో పాలకుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వాటి దుష్పరిణామాలు హృదయ విదారకంగా మారి నిరంతరం మన కళ్లముందు ప్రత్యక్షమౌతూనే ఉన్నాయి.

ఉపాధి కరువై వలస వెళుతున్న ఆదివాసీలు..
ఉన్న ఊర్లో ఉపాధిలేని కారణంగా పొట్ట చేత పట్టుకొని ఇతర ప్రాంతాలకు వలసవెళుతున్న వందలాది మంది ఆదివాసి కుటుంబాలు. అక్కడ అష్టకష్టాలు పడుతూ ఉన్నారు. ఐటీడీఏ లాంటి ఏజెన్సీలు ఉన్నా ఎటువంటి ఉపాధి పనులు కల్పించలేక పోవడం, వారి జీవనం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పనులకు తీసుకెళ్లిన యాజమాన్యాలు కూడా వారి కుటుంబాల పట్ల కనికరం చూపకపోవడం, కనీసం అక్కడ ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను ఇళ్లకు చేర్చే ప్రయత్నాలు కూడా చేయకపోవడం లాంటి ఘటనలు అవేదన కల్గిస్తుండగా, గిరిపుత్రుల వ్యధలు కన్నీటిని తలపిస్తున్నాయి.

Also read

Related posts

Share via