November 22, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024CrimePolitical

ఎన్నికల వేళ అర్థరాత్రి హై టెన్షన్ వాతావరణం.. పరస్పరం దాడులపై ఈసీ కీలక ఆదేశాలు..

ఒంగోలులో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఒకరికొకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ దాడులకు పాల్పడడం కలకలం రేపింది. ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ ఘర్షణలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉండటంతో అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా.. ఒంగోలు సమతానగర్‌లో టీడీపీ- వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. పలువురికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. వైసీపీ, టీడీపీ కార్యకర్తల ఘర్షణ నేపథ్యంలో ఒంగోలులో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకరికొకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ టీడీపీ- వైసీపీ కార్యకర్తలు, నేతలు పెద్దయెత్తున తరలిరావడంతో ఒంగోలులో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. అటు.. అప్రమత్తం అయిన పోలీసులు భారీగా మోహరించి రెండు వర్గాల కార్యకర్తలను అదుపు చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.

అయితే.. ప్రచారానికి వచ్చిన తమ కోడలు కావ్యను కొందరు దూషించడంతోనే గొడవ జరిగిందన్నారు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి. దూషించినవారిని వైసీపీ కార్యకర్తలు ప్రశ్నించగా టీడీపీ కార్యకర్తలు కొట్టారన్నారు. 2019 ఎన్నికలకు ముందు కూడా ఇలాగే కమ్మపాలెంకు వెళ్తే.. ప్రచారం చేయకుండా కొంతమంది కమ్మ సామాజికవర్గానికి చెందినవారు అడ్డుకున్నారని గుర్తు చేశారు. అయితే.. ఆ ఎన్నికల్లో ప్రజలు టీడీపీ నేత దామచర్ల జనార్ధన్‌కు బుద్ధి చెప్పారన్నారు బాలినేని. మళ్లీ.. ఇప్పుడు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారని.. రెడ్లు ఉన్న ఇళ్లకు రావద్దని.. టీడీపీ వాళ్ళను తామెప్పుడైనా అన్నామా అని ప్రశ్నించారు. అయితే.. గతంలో తమ జోలికి వస్తే ఊరుకున్నామని.. ఇప్పుడు ఆడవాళ్ళ జోలికి వస్తే ఊరుకుంటామా అని బాలినేని హెచ్చరించారు. మరోవైపు.. ప్రచారానికి వచ్చిన వైసీపీ కార్యకర్తలు.. టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారని ఆరోపించారు ఆ పార్టీ నేత దామచర్ల జనార్థన్‌. తమపై దౌర్జన్యం చేస్తున్నారని.. డిపాజిట్లు కూడా రావన్న ఉద్దేశంతో దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. ఇకపై చూస్తూ ఊరుకోమని.. తగిన బుద్ధి చెప్తామని జనార్థన్‌ వార్నింగ్‌ ఇవ్వడం కాకరేపుతోంది. ఇలా బుధవారం అర్థరాత్రి హైడ్రామా నెలకొంది. ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉందని చెబుతున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే దీనిపై ఈసీ స్పందించింది. ఘటన జరగడానికి గల కారణాలపై వెంటనే దర్యాప్తు చేయాలని జిల్లా ఎస్పీకి ఆదేశించింది. శాంతి భద్రతలకు విఘాతం కల్గించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిపై బైండోవర్ కేసులు నమోదు చేయాలని సంబంధిత జిల్లా అధికారులకు ఆదేశించింది

Also read

Related posts

Share via