SGSTV NEWS
Andhra PradeshCrime

వామ్మో.. చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు.. ఎక్కడో తెలుసా?

 


ప్రశాంత సముద్ర తీరంలో అలజడి రేగింది. నిత్యం ఆహ్లాదకర వాతావరణంలో పచ్చని చెట్ల మధ్య సంతోషంగా గడిపే అక్కడి వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒకరు కాదు ఇద్దరు కాదు వందలాది మంది భాదితులు చిట్టీల వ్యాపారి చేతిలో మోసపోయి లబోదిబో మంటున్నారు.


విజయనగరం జిల్లా భోగాపురంలో జరిగిన చిట్టీల మోసం ఉత్తరాంధ్రలో పెద్దఎత్తున కలకలం రేపుతుంది. జిల్లాలో అనధికార చిట్టీల మోసాలు నిత్యం ఎక్కడో ఒక చోట కొనసాగుతూనే ఉన్నాయి. ఎవరికి వారే దొరికినకాడికి దోచుకొని పరారవుతున్నారు. అనధికార చిట్టీల మోసాల బారిన పడి చిరు, మధ్యతరగతి ప్రజలు మోసపోతున్నా పోలీసులు వాటిని అరికట్టడంలో విఫలమవుతూనే ఉన్నారు. చిట్టీల నిర్వాహకులు విచ్చలవిడిగా వ్యాపారాలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నా పోలీసులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. చిట్టీల నిర్వాహకులు అనధికార చిట్టీల వ్యాపారం చేస్తున్నారని పోలీసులకు తెలిసినా ముందస్తు చర్యలు చేపట్టకపోవడం మోసాలకు కారణంగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లాలో వెలుగులోకి వచ్చిన చిట్టీల మోసం కలకలం రేపుతుంది. భోగాపురంకి చెందిన తిరుమరెడ్డి మురళీ అనే ఓ వడ్డీ వ్యాపారి చిట్టీల పేరుతో మోసాలకు పాల్పడి సుమారు యాభై కోట్ల మేర కాజేసి పరారయ్యాడు. మురళీ గత ఇరవై ఏళ్లుగా వడ్డీలు, చిట్టీల వ్యాపారం చేస్తున్నాడు. మొదట్లో పది మందితో ప్రారంభమైన చిట్టీల వ్యాపారం తక్కువ సమయంలోనే భారీ ఎత్తుకు చేరుకుంది. మురళీ అందరితో కలిసిమెలిసి ఉంటూ నమ్మకంగా వ్యవహరిస్తూ తన అక్రమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించాడు. ఇతని కస్టమర్లలలో చిన్నకారు రైతుల నుండి వ్యాపారులు, ఉద్యోగులతో పాటు రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. మొదట్లో నిబంధనల ప్రకారం సమయానికి కస్టమర్లకు డబ్బులు తిరిగి చెల్లించేవాడు. దీంతో ఇతని పై నమ్మకం కూడా బాగానే పెరిగింది.


అలా కస్టమర్ల సంఖ్య కూడా వందలకు చేరింది. వ్యాపారం కూడా సుమారు యాభై కోట్లకి పైగానే చేరింది. ఈ చిట్టీల వ్యాపారంతో పాటు అధిక వడ్డీలు ఆశచూపేవాడు. మూడు నుండి ఐదు రూపాయలు వడ్డీ ఇస్తానని ఆశ చూపడంతో కస్టమర్లు కూడా ఆశపడి చిట్టీలు పాడి మురళీకే వడ్డీకి ఇచ్చేవారు. అయితే ఇటీవల కాలంలో పాడిన చిట్టీల డబ్బులు ఇవ్వడం కొంత ఆలస్యం చేస్తూ వస్తున్నాడు. వడ్డీలు సైతం చెల్లించడం ఆపేశాడు. మురళీ వ్యవహారశైలి పై అనుమానం వచ్చిన పలువురు కస్టమర్లు ఇంటికి వెళ్లి నిలదీశారు. అలా కస్టమర్ల నుండి ఒత్తిడి పెరగడంతో ఈ నెల20న అర్థరాత్రి కుటుంబంతో ఊరు వదిలి ఉడాయించాడు. తెల్లవారు ఉదయం కస్టమర్లు ఇంటికి వెళ్లి చూసేసరికి ఇల్లు అంతా ఖాళీగా కనిపించింది. దీంతో భాదితులు తాము మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts

Share this