July 3, 2024
SGSTV NEWS
Andhra Pradesh

AP: చనిపోతూ నలుగురి ప్రాణాలు కాపాడిన సచివాలయ ఉద్యోగిని..




సచివాలయంలో పని చేస్తున్న ఉద్యోగిని చనిపోతూ నలుగురికి ప్రాణం పోసింది. బ్రెయిన్ డెడ్ తో చనిపోయిన ఆమె అవయవాలను కుటుంబ సభ్యులు మరొకరికి దానం చేసేందుకు ముందుకు వచ్చారు.

అవయవదానం పట్ల అవగాహన లేక పోయిన చాలా ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. తాము పోయినా తమ కళ్ళతో ఈ లోకాన్ని చూడవచ్చని నేత్రదానం చేసేందుకు ముందుకొచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కళ్ళు మాత్రమే కాదు.. గుండె, కాలేయం, మూత్రపిండాలు ఇలా శరీరంలో ఉన్న అవయవాలను దానం చేస్తూ తాము పోయినా వేరొకరికి పునర్జన్మను ప్రసాదిస్తున్నారు. తాజాగా ఏపీకి చెందిన సచివాలయ ఉద్యోగిని కూడా చనిపోతూ నలుగురికి పునర్జన్మను ప్రసాదించింది.

వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లాలోని గార మండలం కె. మత్స్యలేశం గ్రామానికి చెందిన పప్పు సుశీల అనే మహిళ.. కళింగపట్నం గ్రామ సచివాలయంలో పోలీసుగా పని చేస్తున్నారు. అయితే ఈ నెల 16న రోడ్డు ప్రమాదం జరుగగా.. ఈ ఘటనలో సుశీలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను స్థానికులు హుటాహుటిన జిల్లా రూరల్ మండలం రాగోలు దగ్గర జెమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సుశీల.. 18న బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు గుర్తించారు. ఈ క్రమంలో సుశీల కుటుంబ సభ్యులు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. బ్రెయిన్ డెడ్ అయిన తమ బిడ్డ అవయవాలను వేరొకరికి దానం చేయాలని నిర్ణయించుకున్నారు.

అవయవదానం పట్ల వైద్యులు సుశీల కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడంతో ఆమె కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించారు. దీంతో హాస్పిటల్ డాక్టర్లు జీవన్ దాన్ కి దరఖాస్తు చేసి.. అవయవదానానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. సుశీల కాలేయం, ఒక కిడ్నీని వైజాగ్ కు తరలించగా. మరొక కిడ్నీని శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత జెమ్స్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, వైద్యులు.. సుశీల తల్లిదండ్రులు గోవిందరావు, జ్యోతిలకు అవయవదానానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అందజేశారు. కాగా సుశీల తల్లిదండ్రులు చేసిన పనికి డాక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also read

Related posts

Share via