February 3, 2025
SGSTV NEWS
Andhra Pradesh

Nara Devaansh: వేగంగా పావులు కదపడంలో నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డు



ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ చెస్ లో ప్రపంచ రికార్డు సాధించాడు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్)… వేగవంతమైన చెస్ కదలికలను అమలు చేయడంలో దేవాంశ్ సాధించిన విజయాన్ని గుర్తించింది. ఈ విజయానికి గుర్తుగా దేవాంశ్‌కు సంస్థ సర్టిఫికెట్‌ను అందజేసింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం, దేవాన్ష్ 175 పజిల్స్ పూర్తి చేస్తూ “వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్”గా రాణించాడు.


మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాన్ష్ చెస్ లో వేగవంతంగా పావులు కదపడంలో ప్రపంచ రికార్డు సాధించాడు. 9 ఏళ్ల నారా దేవాన్ష్ “వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ – 175 పజిల్స్” ప్రపంచ రికార్డును సాధించాడు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ నుండి అధికారిక ధృవీకరణను అందుకున్నందుకు నారా కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. వ్యూహాత్మకమైన ఆటతీరు, థ్రిల్లింగ్ ప్రదర్శనతో యువ చెస్ ప్రాడిజీ నారా దేవాన్ష్ “చెక్‌మేట్ మారథాన్” పేరుతో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఈ రికార్డ్‌లో దేవాన్ష్ క్రమక్రమంగా సవాలు చేసే చెక్‌మేట్ పజిల్‌ల క్రమాన్ని పరిష్కరించాడు. ప్రసిద్ధ చెస్ సంకలనం నుండి ఎంపిక చేసిన 5334 సమస్యలు, కలయికల ద్వారా ఈ పోటీని రూపొందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ మార్గదర్శకత్వంతో దేవాంశ్ ఈ రికార్డును సాధించగలిగాడు.

మరో 2 రికార్డులు కూడా దేవాన్ష్ సొంతం

ఇదిలావుండగా ఇటీవల దేవాన్ష్ మరో రెండు ప్రపంచ రికార్డులను కూడా సాధించాడు. అతను 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని కేవలం 1నిమి 43సెకన్లలో పూర్తి చేసాడు. 9 చెస్ బోర్డ్‌లను కేవలం 5నిమిషాల్లో అమర్చాడు, మొత్తం 32 ముక్కలను వేగవంతంగా సరైన స్థానాల్లో ఉంచాడు. దేవాన్ష్ ప్రపంచ రికార్డు ప్రయత్నాలను న్యాయనిర్ణేతలు, లండన్‌లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పట్టుదల, కృషి ద్వారా తమ కలలను సాధించవచ్చని దేవాన్ష్ నిరూపించాడు. ఇది భారతీయ పిల్లల అపారమైన ప్రతిభకు, వారిలో దాగివున్న అత్యుత్తమ నైపుణ్యాలకు మచ్చుతునక. సరైన ఎక్స్‌పోజర్, మార్గదర్శకత్వంతో మన పిల్లలు ఉన్నతస్థానానికి చేరుతారనడానికి దేవాన్ష్ నిదర్శనం.




దేవాన్ష్ మెరుగువేగాన్ని కళ్లారా చూశాను: లోకేష్

పిన్నవయసులో తనయుడు దేవాన్ష్ సాధించిన ఈ విజయంపై తండ్రి లోకేష్ స్పందిస్తూ… “దేవాన్ష్ లేజర్ షార్ప్ ఫోకస్‌తో శిక్షణ పొందడం నేను ప్రత్యక్షంగా చూశాను. క్రీడను ఉత్సాహంగా స్వీకరించాడు. అతను గ్లోబల్ అరేనాలో భారతీయ చెస్ క్రీడాకారుల అద్భుతమైన, చారిత్రాత్మక ప్రదర్శనల నుండి ప్రేరణ పొందాడు. దేవాన్ష్ కు చెస్‌ పాఠాలు నేర్పిన రాయ్ చెస్ అకాడమీకి నేను ధన్యవాదాలు చెబుతున్నాను” అన్నారు. ఈ ఈవెంట్ కోసం దేవాన్ష్ గత కొన్ని వారాలుగా రోజుకు 5-6 గంటల పాటు శిక్షణ పొందుతున్నాడు. దేవాన్ష్ కోచ్ కె. రాజశేఖర్ రెడ్డి ఈ విజయంపై స్పందిస్తూ “దేవాన్ష్ సృజనాత్మకంగా చెస్ నేర్చుకునే ఒక డైనమిక్ విద్యార్థి. 175 సంక్లిష్టమైన పజిల్స్‌ని ఆసక్తిగా పరిష్కరించగలిగిన ఆయన మానసిక చురుకుదనం అపారం. అతని చదరంగం ప్రయాణంలో ఇదొక మైలురాయి అని నేను విశ్వసిస్తున్నాను” అన్నారు

Also read

Related posts

Share via