ప్రేమ వివాహం చేసుకున్న భార్యను దారుణంగా కడతేర్చిన భర్త మహబూబ్నగర్ జిల్లాలో ఘటన
మూసాపేట, : జీవితాంతం తోడుగా ఉంటానని ప్రేమించి మనువాడిన ఎనిమిది నెలలకే భార్యను కిరాతకంగా హత్య చేసిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మూసాపేట మండలం పోల్కంపల్లికి చెందిన శ్రీదేవి(21) నర్సింగ్ పూర్తి చేశారు. అదే గ్రామానికి చెందిన డ్రైవర్ చందును 8 నెలల కిందట కుటుంబసభ్యులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయిన నెల రోజుల నుంచే భర్త రోజూ తాగొచ్చి ఆమెను వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు. పెద్దలను ఎదిరించి ఇంట్లో నుంచి రావడంతో ఎవరికీ చెప్పుకోలేక, మౌనంగా భరిస్తూ వచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి శ్రీదేవితో గొడవపడిన చందు ఆమె గొంతునులిమి హత్య చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని గోనె సంచిలో వేసుకుని పొలం వద్దకు తీసుకెళ్లాడు.
అనంతరం శ్రీదేవి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని తన సోదరుడికి ఫోన్ చేసి చెప్పాడు. సమాచారం అందుకున్న గ్రామస్థులు పొలం వద్దకు చేరుకోగా చందు అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు చేరుకొని మృతదేహాన్ని మహబూబ్నగర్ ఆసుపత్రికి తరలించారు. శవపరీక్షలో ఆమెది హత్యగా తేలిన అనంతరం శనివారం ఉదయం మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో నిందితుడు వచ్చేవరకు అంత్యక్రియలు జరపమని ఆమె కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకొని వారికి నచ్చజెప్పి అంత్యక్రియలు జరిగేలా చూశారు. కాగా నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయి నేరం అంగీకరించాడని ఎస్సై వేణు తెలిపారు. పూర్తి వివరాలు విచారణలో తేలుస్తామని పేర్కొన్నారు.
Also read
- ఆడపిల్ల పుట్టడం ఎందుకు శుభం అంటారు? గరుడ పురాణం చెప్పే రహస్యం
- Astrology: వజ్ర యోగంతో ధన యోగం.. అదృష్ట దేవత తలుపు తట్టబోతున్న ఆ రాశుల వారు వీరే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- స్వర్ణ యుగం లో గ్రామ పంచాయతీ లు, గ్రామీణ ప్రజలు… రాజేంద్రప్రసాద్*
- ఏంట్రా ఇదీ.. లవర్తో లొల్లి.. గురుడు టవర్ ఎక్కి ఏం చేశాడంటే..? వీడియో వైరల్..





