SGSTV NEWS online
Spiritual

గరుడపురాణం ప్రకారం ఆత్మకు క్రూరత్వాన్ని చూపించేదే క్రూరపురం – ఆత్మ చేరుకునే 7వ పట్టణం ఇదే..


Garuda Purana Part 07:గరుడ పురాణం లో
ప్రేత కల్పం ప్రకారం, జీవుడు మరణించిన తర్వాత యమధర్మరాజు కొలువై ఉన్న ‘యమపురి’కి చేరుకోవడానికి పట్టే కాలం ఒక సంవత్సరం. ఈ ప్రయాణంలో మొత్తం 16 ముఖ్యమైన పట్టణాల మీదుగా ఆత్మ ప్రయాణం చేయాల్సి వస్తుందట. అలా ప్రయాణం చేస్తూ ఆత్మ చేరుకునే అతి క్రూరమైన పట్టణమే క్రూరపురమట. క్రూరపురానికి ఆత్మ ఎలా చేరుకుంటుంది. అక్కడ ఎలాంటి శిక్షలు అనుభవిస్తుందో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆత్మ క్రూరపురం చేరుకోవడానికి పట్టే సమయం: జీవుడు మరణించిన తర్వాత యమధూతలు ఆత్మను వెంటబెట్టుకుని యమపురి వైపు వెళ్తుంటారట. వాళ్ల మార్గ మధ్యలో వచ్చే 7వ పట్టణమే క్రూరపురమట. అయితే మనిషి మరణించిన 180 రోజులు తర్వాతే ఆత్మ క్రూరపురం చేరుకుంటుందట.

మార్గ మధ్యలో అనుభవించే కష్టాలు: క్రూరపురానికి వెళ్లే

దారి అత్యంత భయంకరంగా ఉంటుందట. అత్యంత యాతన శరీర వేదన అనుభవిస్తుందట. ఈ ప్రయాణంలో కూడా ఆత్మకు దాహం వేసినా నీరు దొరకదట, ఆకలి వేసినా అహారం ఉండదట. యమధూతలు ఆత్మను పాశాలతో కట్టి, ముళ్ల కర్రలతో కొడుతూ వేగంగా నడవమని వేధిస్తారట. ఈ దారిలో భయంకరమైన అడవులు ఆత్మను భీతిగొల్పుతాయట. దారి పొడవునా వేడి ఇసుక, పదునైన కత్తుల వంటి ఆకులు కలిగిన చెట్లు ఆత్మ యాతన శరీరాన్ని తూట్లు పొడుస్తుంటాయట.

క్రూరపురంలో అనుభవించే బాధలు మరియు శిక్షలు:

క్రూరపురానికి చేరుకున్నాక ఆత్మకు ఎదురయ్యే పరిస్థితులు అత్యంత భయానకంగా ఉంటాయట. పేరుకు తగ్గట్టే ఈ క్రూరపురంలో యమధూతలు చాలా ‘క్రూరంగా’ ప్రవర్తిస్తారట. ఆత్మను బండరాళ్లతో కొట్టడం, మండుతున్న నిప్పులపై నడిపించడం వంటివి చేస్తారట. అయితే ఆరవ నెలలో బంధువులు పెట్టే ‘షణ్మాసిక’ (ఆరు నెలల పిండం) కోసం ఆత్మ ఇక్కడ ఎదురుచూస్తుందట. ఆ పిండం ఆత్మకు చేరితేనే, ఆ శక్తితో తదుపరి పట్టణ ప్రయాణానికి ఆత్మ అడుగులు వేయగలదట. ఒకవేళ బంధువులు సరిగ్గా కర్మకాండలు చేయకపోతే ఆకలితో అలమటిస్తూ విలవిలలాడుతుందట.

ఇక క్రూరపురం దాటిన తర్వాత మరో 9 పట్టణాలను దాటుకుంటూ చివరకు 348 రోజుల తర్వాత ఆత్మ యమధర్మరాజు సభకు చేరుకుంటుందట. అక్కడ చిత్రగుప్తుడు జీవుడు చేసిన పాప పుణ్యాల లెక్కను చదువుతాడట. దాని ఆధారంగానే ఆత్మకు శాశ్వత నరకమో లేదా స్వర్గమో నిర్ణయించబడుతుందని గరుడపురాణంలో ప్రేతకల్పంలో ఉందట. ఇక గరుడ పురాణం ప్రకారం, మరణించిన వ్యక్తి పేరు మీద చేసే దానధర్మాలు, మాసిక పిండాలు మాత్రమే ఈ ప్రయాణంలో ఆత్మకు రక్షణగా మరియు ఆహారంగా నిలుస్తాయట.

( ఇక ఆత్మ తన యమలోక ప్రయాణంలో
ఎనిమిదవ పట్టణమైన విచిత్రభవనానికి ఎలా చేరుకుంటుంది. ఎన్ని కష్టాలు, బాధలు అనుభవిస్తుంది. అక్కడ ఆత్మకు విధించే భయంకరమైన శిక్షలు ఏంటి..? అనే విషయాలు తరువాత కథనంలో తెలుసుకుందాం.)


Related posts