July 1, 2024
SGSTV NEWS
Andhra Pradesh

AB Venkateswara Rao: వివేకా హత్య కేసును ఛేదించే క్రమంలోనే.. నాపై తప్పుడు ఫిర్యాదు..ఆపై బదిలీ

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో హంతకులు తప్పించుకోవచ్చని భావించి, క్షేత్రస్థాయి అధికారులకు జాగ్రత్తలు చెబుతున్న సమయంలోనే తనపై ఎన్నికల సంఘానికి తప్పుడు ఫిర్యాదులు చేసి బదిలీ చేయించారని డైరెక్టర్ జనరల్ హోదాలో ఇటీవల పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వెల్లడించారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో హంతకులు తప్పించుకోవచ్చని భావించి, క్షేత్రస్థాయి అధికారులకు జాగ్రత్తలు చెబుతున్న సమయంలోనే తనపై ఎన్నికల సంఘానికి తప్పుడు ఫిర్యాదులు చేసి బదిలీ చేయించారని డైరెక్టర్ జనరల్ హోదాలో ఇటీవల పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వెల్లడించారు.

‘నాపై అప్పట్లో అందిన ఫిర్యాదులపై విచారణ జరిపించారా? జరిపిస్తే అందులో ఏం తేలిందో చెప్పాలని కోరుతూ సమాచార హక్కు చట్టం కింద ఈసీకి దరఖాస్తు చేశాను. వారు ఆ ఆరోపణలపై విచారణ చేసినట్లుగానీ, అందులో ఏం తేలిందనేది గానీ చెప్పలేద’ని పేర్కొన్నారు. ఏబీ వెంకటేశ్వరరావు శనివారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో వివిధ విషయాలపై మాట్లాడారు. 2019 ఎన్నికల వేళ ఈసీ తనను బదిలీ చేసిన తీరును గుర్తు చేసుకున్నారు. వివరాలు ఏబీవీ మాటల్లోనే..

వివేకా హత్య కేసు దర్యాప్తు తొలి మూడు రోజుల పాటు సరిగ్గా జరగలేదు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు వేరే ప్రాంతం నుంచి అధికారులను పంపించాం. దర్యాప్తు తగిన రీతిలో జరగట్లేదని వారు చెప్పారు. ఈ ఫీడ్బ్యాక్ ఎవరికి వెళ్లిందో తెలీదు కానీ, వెంటనే అప్పటి ప్రతిపక్ష పార్టీ నాపై ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈసీ 24 గంటల్లోగా నన్ను అప్పట్లో ఉన్న పోస్టు నుంచి తప్పించింది. హత్య కేసులో ప్రాథమిక దర్యాప్తు సరిగ్గా లేకపోతే అది ఎప్పటికీ పరిష్కారం కాదు. ఆధారాలు లభించవు. శిక్షలూ పడవు. హత్య కేసు పరిష్కారమయ్యే వరకూ రక్తపు మరకలను దాటి వెళ్లకూడదు. ఆధారాలన్నీ అక్కడే ఉంటాయి. వాటిని భూతద్దం వేసుకుని వెతకాలి. అదే తరహాలో వివేకా హత్య కేసులోనూ అన్ని ఆధారాలను, అందరు అనుమానితులను రౌండప్ చేసి పెట్టుకోవాలని, వారిని విడివిడిగా విచారించాలని మా అనుభవం ద్వారా జూనియర్ అధికారులకు చెప్పాం. వారు సరిగ్గా  చేయలేకపోయారు. ఇప్పటికైనా ఈ కేసు దర్యాప్తు విజయవంతంగా తార్కిక ముగింపునకు వస్తుందని ఆశిస్తున్నా.

2014-19 మధ్య 23 మంది వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాలో చేరిన వ్యవహారంలో నాకెలాంటి సంబంధమూ లేదు. అది పూర్తిగా రాజకీయ నాయకుల వ్యవహారం. పార్టీ మారిన 23 మంది ఎమ్మెల్యేల్లో భూమా నాగిరెడ్డి తప్ప మిగతా వారంతా బతికే ఉన్నారు. వారిలో ఏ ఒక్కరైనా సరే, పార్టీ మారాలంటూ ఏబీ వెంకటేశ్వరరావు తమను ప్రలోభపెట్టారనో, డబ్బు ఇవ్వజూపారనో చెబితే నేను శిక్షకైనా సిద్ధమే. పార్టీ మారాక ఓ ఎమ్మెల్యేను ‘మీరు వైకాపాలో సీనియర్ కదా, ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింద’ని అడగ్గా.. ‘నేను డిప్యూటీ ఫ్లోర్ లీడరు.నన్ను పక్కన కూర్చోబెట్టుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. పురుగును చూసినట్లుగా చూసేవారు. దూరంగా కూర్చొమ్మనే వాళ్లు. బాధతో మనసు విరిగి వచ్చేశాను’ అని చెప్పారు. మరికొందరు తమకు అక్కడ అవమానాలు ఎదురైనందునే పార్టీ మారామని చెప్పారు. వాటికి నేనెలా కారణమవుతాను? ఎమ్మెల్యేలు పార్టీని వీడితే.. తమ తప్పు వల్లే వెళ్లిపోయారని ఏ నాయకుడూ ఒప్పుకోరు. ఎవరో ఒకరిని నిందిస్తారు. ఎవరో ఒక బకరా దొరకాలి. ఆ బకరా నేనయ్యాను.

తప్పు చేసుంటే క్షమాపణ కోరేవాణ్ని

2019 తర్వాత రాష్ట్రంలో పరిపాలన విధానాల్లో స్పష్టమైన మార్పు వచ్చింది. అది ఎవరిని ఎలా ప్రభావితం చేసినా, నా విషయంలో ఊహించని పరిణామాలకు దారితీసింది. ఇలాంటివి జరుగుతాయని నా 30 ఏళ్ల సర్వీసులో ఎప్పుడూ అనుకోలేదు. నా తప్పుంటే ఎప్పుడో అంగీకరించి క్షమాపణ కోరేవాణ్ని. శిక్ష అనుభవించడానికీ సిద్ధమయ్యేవాణ్ని. కానీ, నేను ఏ తప్పూ చేయలేదు. నాపై నిందలు మోపినప్పుడు ధైర్యంగా ఎదుర్కొన్నా. నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం తప్ప నాకు వేరే మార్గం కనిపించలేదు. అందుకే లొంగిపోకుండా పోరాడాను. ఇంకా కొన్ని కేసులు కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి. అన్నింటినీ కొలిక్కి తెచ్చేందుకు పోరాటం చేయాలి.

ప్రజల స్పందనతోనే సాంత్వన
నేనొక్కడినే ఇంత పోరాటం చేయాలా అని కొన్నిసార్లు విసుగుపుట్టేది. ఎప్పటికప్పుడు కొత్త మెలికలు పెట్టేవారు. కేసులు బనాయించేవారు. అవన్నీ చూశాక పోరాటం నుంచి వెనుదిరగడం సమస్యకు పరిష్కారం కాదని నిశ్చయించుకున్నా. మంచి ఉద్యోగం, డబ్బులున్న నాలాంటి వాడు కూడా పోరాడకపోతే, అన్యాయం జరిగినప్పుడు పోరాడేందుకు ఎవరు మిగులుతారు? ఫైట్ చేసి నిలబడొచ్చు అనేందుకు ఓ ఉదాహరణగా మిగిలిపోయా. నాకు మద్దతుగా ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది ఉన్నారని తెలుసుకున్నాక ఉపశమనం కలిగింది. నా పదవీ విరమణ సందర్భంగా లభించిన స్పందన చూస్తే ఇంతమంది మద్దతుగా నిలిచారా అనిపించింది.

సీఎంఓ గ్రూప్లో నోట్ పెడితే విచారించరా?

ఏబీ వెంకటేశ్వరరావు దేశద్రోహి, దేశ రహస్యాలను
బయటకు అమ్మేశారంటూ ఊరూపేరూ లేనోడు ఎవరో  రెండో శనివారం అర్ధరాత్రి నోట్ విడుదల చేశారు. దానిపై ఎవరి సంతకమూ లేదు. ఆ నోట్ సీఎంఓ వాట్సప్ గ్రూపు నుంచి రావడంతో పత్రికల్లో ప్రచురించారు. అప్పట్లో నామీద మోపిన అభియోగాలపై రెండేళ్ల తర్వాత విచారణ జరిగింది. నాపై ఆరోపణలతో నోట్ ఎవరు విడుదల చేశారు? ఏ ప్రాతిపదికన ఇచ్చారో తేల్చాలని  విచారణ అధికారిని కోరితే.. అసలు అది సంబంధం లేని అంశమంటూ నోట్ విడుదల చేసిన వారిని విచారణకూ పిలవలేదు. ఐదేళ్లుగా ఉద్యోగ సంఘాల పరిస్థితి ఎలా ఉందో చూశాం. ఐపీఎస్ అధికారుల సంఘమూ అలాగే ప్రవర్తించింది. ఇన్నాళ్ల పాటు పోలీసు ఉద్యోగంలో
ఉంటూ ఏం చేశానో, ఇకపైనా అదే చేస్తాను. ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణకు ఏం చేయాలో ఒకట్రెండు నెలల్లో కార్యాచరణ రూపొందించి ప్రకటిస్తా.

Also read

Related posts

Share via