April 14, 2025
SGSTV NEWS
CrimeTelangana

యువకుడి వేధింపులతో విద్యార్థిని బలవన్మరణం

యువకుడి వేధింపులతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం…

భువనగిరి : యువకుడి వేధింపులతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం… స్థానిక విద్యానగర్ కాలనీకి చెందిన ఆర్ఎంపీ ఎలగందల సతీష్కుమార్, సంధ్య దంపతులకు కుమార్తె హాసిని(19), కుమారుడు సంతానం. హాసిని సికింద్రాబాద్లోని కస్తూర్బా మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటుంది. భువనగిరిలోని రాంనగర్కు చెందిన నిఖిల్ అనే యువకుడు ఆమెను ప్రేమ పేరిట కొన్ని నెలలుగా వేధిస్తున్నాడు. అతని కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటోంది. నిఖిల్ అప్పుడప్పుడు భువనగిరికి వచ్చి వెళుతున్నాడు.కళాశాలకు సెలవు ఉండటంతో హాసిని రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చింది.

నిఖిల్ ఆదివారం ఆమె ఫోన్ కు అసభ్యకర సందేశాలు పంపడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. కుటుంబ సభ్యులు ఆదివారం సాయంత్రం బయటకు వెళ్లాక ఇంట్లోనే ఉరేసుకుంది. వారు రాత్రి తిరిగొచ్చేసరికి హాసిని మృతదేహం ఫ్యాన్కు వేలాడుతుండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహానికి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. హాసిని, నిఖిల్ భువనగిరిలోని ప్రైవేటు పాఠశాలలో పదోతరగతి కలిసి చదువుకున్నారని, అప్పటి నుంచే వేధింపులకు గురి చేస్తున్నాడని, తమ కుమార్తె చావుకు కారణమైన అతన్ని శిక్షించాలని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై కుమారస్వామి తెలిపారు.

Also read

Related posts

Share via