June 29, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

రోడ్ ఆక్సిడెంట్  కర్నూల్ : ఆరిపోయినా   ఆశల దీపం 



• రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థి దుర్మరణం

• కర్నూలు నగరంలో ఘటన

• పిల్లిగుండ్లలో విషాదఛాయలు


కర్నూలు(హాస్పిటల్)/ రొళ్ల: ఆశల దీపం ఆరిపోయింది. రోడ్డు ప్రమాదం ఓ వైద్య విద్యార్థిని బలితీసుకుంది. కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న ఆర్.తేజేశ్వర్ రెడ్డి(22) ఆదివారం మృత్యువాత పడ్డాడు. ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా రొళ్ల మండలం పిల్లిగుండ్ల గ్రామానికి చెందిన రంగనాథ్ (రత్నగిరి జెడ్పీ హైస్కూల్ టీచర్), గీతాలక్ష్మి (పిల్లిగుండ్ల గొల్లహట్టి ప్రాథమిక పాఠశాల టీచర్) దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు తేజేశ్వర్రెడ్డి కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఇక చిన్న కుమారుడు వర్షిత్రెడ్డి బెంగళూరులో ఇంజినీరింగ్ కోర్సు చేస్తున్నాడు 

తేజేశ్వర్రెడ్డి ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో కాలేజీలోని రీడింగ్ రూమ్లో చదవడం ముగించుకుని.. వసతిగృహానికి బుల్లెట్ బండి (ద్విచక్రవాహనం)పై బయల్దేరాడు. కళాశాల గేటు దాటి బయటకు రాగానే పెట్రోల్ బంక్ దాటిన తర్వాత అదే రోడ్డులో నందికొట్కూరు నుంచి కర్నూలుకు వేగంగా వస్తున్న పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు వెనుకనుంచి ఢీకొట్టింది. కిందపడిన తేజేశ్వర్రెడ్డిని దాదాపు 50 మీటర్ల వరకు బస్సు ఈడ్చుకెళ్లింది.

ఈ ప్రమాదంలో తేజేశ్వర్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన వైద్యశాల మార్చురీకి తరలించారు. మధ్యాహ్నం తల్లిదండ్రులు రావడంతో పోలీసులు పంచనామా చేసి మృతదేహాన్ని అప్పగించారు. చదువు పూర్తయ్యాక పెద్ద డాక్టర్ అయి తమకు అండగా ఉంటాడని భావించిన ఆ తల్లిదండ్రులు.. కుమారుని మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోయారు. 20 రోజుల కిందటే కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుని వచ్చారు.

ఇంతలోనే ఎంత ఘోరం జరిగిపోయిందంటూ బంధువులు, స్నేహితులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనతో పిల్లిగుండ్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సాయంత్రం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. జెడ్పీటీసీ సభ్యుడు అనంతరాజు, వైఎస్సార్సీపీ నాయకులు తదితరులు విద్యార్థి మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Also read

Related posts

Share via