ములకలచెరువు : తన కూతురికి వివాహమైంది. అయినా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఉంది. ఈ విషయాన్ని పసిగట్టిన తండ్రి కూతురిని పలుమార్లు మందలించాడు. దీంతో ఆ కూతురు తండ్రిపై కక్ష పెంచుకుంది. తమ వివాహేతర సంబంధం ఇలాగే కొనసాగాలంటే అడ్డుగా ఉన్న తండ్రిని ఎలాగైనా హత మార్చాలని పథకం పన్నింది. ఎట్టకేలకు ముందుగా రచించిన పథకం ప్రకారం కోళ్లఫారం షెడ్డులో ఒంటరిగా నిద్రిస్తున్న తండ్రిని కన్న కూతురే ప్రియుడి చేత చంపించింది. ఈ విషయం పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ట్రైనీ డీఎస్పీ జీఎస్ ప్రశాంత్, ఎస్‌ఐ తిప్పేస్వామిలు సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని సెంట్రల్ స్కూల్ పంచాయతీ పెద్ద మొరవపల్లికి చెందిన దయ్యాల రాజారెడ్డి (55) ఈ నెల 12న కోళ్లఫారం షెడ్డులో దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడి అల్లుడు వడిగల బాలాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పలు కోణాల్లో విచారణ చేపట్టారు.
మృతుడి పెద్ద కుమార్తె బ్రాహ్మణి తంబళ్లపల్లి మండలం గుండ్లపల్లి పంచాయతీ అనగలవారిపల్లికి చెందిన రామిశెట్టి మల్లికార్జున కుమారుడు అరుణ్‌కుమార్ (29)తో 2019 నుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఉండేది. అంతేగాక ఇంట్లో ఉన్న బంగారు నగలను సైతం ఇంట్లో వారికి తెలియకుండా విక్రయించి గుట్టుగా రూ.10 లక్షల నగదును ప్రియుడికి ఇచ్చింది. అంతేగాక మదనపల్లిలో ఉన్న ఇంటి స్థలాన్ని కూడా కుదువ పెట్టి అదనంగా రూ.40 లక్షల నగదు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని పసిగట్టిన తండ్రి రాజారెడ్డి కూతురిని నిలదీసి బంగారు నగలు ఏం చేశావ్, ఎక్కడున్నాయో వాటిని తెచ్చి పెట్టు అని ప్రశ్నించడంతో పాటు కూతురిపై చేయి చేసుకున్నాడు. మళ్లీ ఇలాంటి నీచమైన పనులు చేస్తే కన్న కూతురు అని కూడా చూడను, నిన్ను అరుణ్‌ను వదలను అని గట్టిగా హెచ్చరించాడు. దీంతో తండ్రిపై విపరీతమైన కక్ష పెంచుకుంది.
తన వివాహేతర సంబంధం ఇలాగే కొనసాగాలంటే అడ్డుగా ఉన్న తండ్రిని ఎలాగైనా వదిలించుకోవాలని ప్రియుడితో కలసి పథకం రచించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 12న అర్థరాత్రి వరకు కూతురు, అల్లుడు, తండ్రి కలసి కోళ్లను వాహనంలో తరలించేశారు. అనంతరం కోళ్లఫారం షెడ్డు వద్ద తండ్రి అక్కడే నిద్రకు ఉపక్రమించాడు. అక్కడే ఉన్న తన భర్త బాలాజీని వెంట బెట్టుకుని బ్రాహ్మణి పెద్దమొరవపల్లికి వచ్చేసింది. అనంతరం కోళ్ల షెడ్డులో తన తండ్రి ఒంటరిగా ఉన్నాడని పక్కనే ఉన్న గడ్డపారతో హత మార్చాలని ఫోన్‌లో ప్రియుడికి సూచించింది.
దీంతో అప్పటికే చెట్ల చాటున కాపు కాసిన ప్రియుడు అరుణ్‌కుమార్ గడ్డపారతో నిద్రిస్తున్న రాజారెడ్డిని హతమార్చి ఈ విషయాన్ని బ్రాహ్మణికి ఫోన్‌లో చెప్పి పరారయ్యాడు. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో సమగ్రంగా విచారణ చేపట్టి హత్యకు కారకుడైన అరుణ్‌కుమార్ (29)ను వేపూరికోట పంచాయతీ బత్తలాపురం రైల్వే స్టేషన్ వద్ద అరెస్టు చేశారు. అలాగే హత్యకు పథకం రచించిన బ్రాహ్మణిని వారి ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన గడ్డపార, ద్విచక్రవాహనం, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ రిమాండ్‌కు పంపామని ట్రైనీ డీఎస్పీ పేర్కొన్నారు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం