ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక సంచలన కుంభకోణం కలకలం రేపుతోంది! ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి సుమారు ఏడు కోట్ల రూపాయలు వసూలు చేసిన వ్యవహారం ఇప్పుడు పెను దుమారంగా మారింది. ఇందులో జనసేన నాయకురాలు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యక్తిగత సహాయకురాలిగా వ్యవహరిస్తున్న కోట రుక్మిణి పేరు తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. అసలు ఎవరీ కోట రుక్మిణి.. ఈ 7 కోట్ల స్కామ్ వెనుక ఉన్న అసలు కథేంటి అనేది చూద్దాం ..
కృష్ణా జిల్లాకు చెందిన కోట రుక్మిణి గతంలో లండన్‌లో నివసిస్తూ ఓ ప్రముఖ బ్రాండెడ్ దుకాణాన్ని నిర్వహించేవారు. పవన్ కల్యాణ్‌తో పరిచయం ఏర్పడిన తర్వాత ఆమె జనసేన పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం ప్రారంభించారు. 2020లో జనసేన సెంట్రల్ అఫైర్స్ కమిటీ వైస్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె, హైదరాబాద్‌కు మకాం మార్చారు. 2023లో పవన్ కల్యాణ్ వ్యక్తిగత సహాయకురాలిగా చేరడంతో పార్టీలో ఆమెకు ప్రాధాన్యత పెరిగింది. అయితే, గతంలోనూ పార్టీ నాయకులతో ఆమె వ్యవహరించిన తీరుపై జనసేన మహిళా నేత పసుపులేటి పద్మావతి వంటి వారు బహిరంగంగానే విమర్శలు చేశారు. తాజాగా, కోట రుక్మిణి డైరెక్టర్‌గా ఉన్న ‘కైరెన్ టెక్నాలజీస్’ సంస్థలో పనిచేసిన బోడపాటి ధరణి కృష్ణపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. పోలీసు, దేవాదాయ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఏలూరు, తణుకు ప్రాంతాలకు చెందిన సుమారు 36 మంది నిరుద్యోగుల నుంచి 7 కోట్లు వసూలు చేసి, నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారని కేసులు నమోదయ్యాయి.అయితే, ఈ కేసులో ఇప్పుడు ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రధాన నిందితురాలిగా ఉన్న ధరణి కృష్ణ తల్లి గార్ల నాగమణి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తన కుమార్తె ఆ సంస్థలో కేవలం హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా మాత్రమే పనిచేసిందని, ఆమెకు ఎలాంటి యాజమాన్య హక్కులు లేవని అఫిడవిట్లో పేర్కొన్నారు నవంబర్ 11న కేవలం అరగంట వ్యవధిలోనే ఏపీ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాసరావు, కోట రుక్మిణి సంస్థ ఇచ్చిన రెండు ఫిర్యాదులలోనూ తన కుమార్తెను ఏ1గా చేర్చడం వెనుక కుట్ర ఉందని నాగమణి ఆరోపించారు. అసలు సూత్రధారులను తప్పించి, తన కుమార్తెను బలిపశువును చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్ 13న పోలీసులు తన కుమార్తెను ప్రైవేటు వాహనంలో తీసుకెళ్లారని, కస్టడీలోశివ శ్రీనివాసరావు తనపై దాడి చేశారని, తన ప్రాణాలకు ముప్పు ఉందని ధరణి కృష్ణ కూడా ఓ సెల్ఫీ వీడియోలో సంచలన ఆరోపణలు చేశారు. మొత్తానికి, 36 మంది బాధితులు అసలు డబ్బులు ఎవరికి ఇచ్చారు.. ఇందులో సంస్థ డైరెక్టర్ కోట రుక్మిణి పాత్ర ఏంటి.. అన్న దానిపై సమగ్ర విచారణ జరిపితేనే అసలు నిజాలు బయటకు వస్తాయి.
