పార్వతీపురం మన్యం జిల్లాలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామాల్లో వైరల్ ఫీవర్స్ తాండవిస్తున్నాయి. రోగులు సంఖ్య పెరగడంతో ప్రభుత్వ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. సిబ్బందికి వైద్య సేవలు అందించడం కూడా కష్టతరంగా మారుతుంది. పలు గ్రామాల్లో ఇంటికి ఒకరిద్దరు చొప్పున జ్వరాల బారిన పడ్డారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినా ప్రయోజనం ఉండటం లేదు. చేసేదేమీలేక గ్రామాల నుండి ఆసుపత్రుల బాట పడుతున్నారు రోగులు. అక్కడ కూడా రోగుల సంఖ్య పెరగడంతో బెడ్స్ కొరత, మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇప్పటికీ గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య నరకం చూపిస్తుంది. అపరిశుభ్ర వాతావరణంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. మురుగు కాలువలు, రోడ్లు చిత్తడిగా మారడంతో స్థానికులకు దుర్వాసనలతో కాలం గడపాల్సి వస్తుంది. ప్రధానంగా ఈ సమస్య పార్వతీపురం, కొమరాడ, గరుగుబిల్లి, సాలూరు మండలాల్లో తీవ్రంగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల తాకిడి పెరగడంతో వైద్య సదుపాయాలు కూడా ఇబ్బందిగా మారుతుంది. పలువురు రోగులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్ లేకపోవడంతో ప్రవేట్ హాస్పిటల్స్‌కి వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేయక తప్పని పరిస్థితి నెలకొంది.
అధికారులు త్వరితగతిన గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య పరిష్కరించకపోతే తాము మరింత ఇబ్బంది పడక తప్పదు అని వాపోతున్నారు జిల్లావాసులు. కొమరాడ మండలం అంటివలసలో ఈ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇంటికి ఒకరు, లేదా ఇద్దరు మంచంబారిన పడ్డారు. మలేరియా కేసులు రోజురోజుకు పెరుగుతుండగా, డెంగ్యూ సోకే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు అటు వైద్య సిబ్బంది, ఇటు జిల్లావాసులు. పారిశుద్ధ్య సమస్య కారణంగా ఏజెన్సీవాసులు అనారోగ్యబారిన పడుతున్నా.. అధికారులు మాత్రం అటు వైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు మన్యం ఏజెన్సీవాసులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు గిరిజన సంఘాల నాయకులు
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం