హైదరాబాద్, మే 17: ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను కడతేర్చింది ఓ ఇల్లాలు. పైగా ఏమీ ఎరగనట్లు గుండెపోటని చెప్పి అందరినీ నమ్మించి నాటకాలు ఆడింది. బంధువులు కూడా నిజమేనని నమ్మారు. దహన సంస్కరాలు కూడా పూర్తి చేశారు. అయితే ఇది జరిగిన 3 నెలల తర్వాత సుపారీ తీసుకుని హత్య చేసిన వారిలో ఒకడు పోలీసుల ఎదుట లొంగిపోవడంతో అసలు మోసం బయటపడింది. హైదారబాద్‌లోని యూసఫ్‌గూడలోని మధురానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. మధురానగర్ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..
భర్త హత్యకు పక్కా స్కెచ్..
ఎల్లారెడ్డిగూడ జయప్రకాశ్‌నగర్‌లోని శిఖర అపార్డ్‌మెంట్స్‌లో విజయ్‌కుమార్ (40), శ్రీలక్ష్మి (33) దంపతులు నివాసం ఉంటున్నారు. వారికిద్దరు పిల్లలు (9, 8 యేళ్లు). ఈ క్రమంలో శ్రీలక్ష్మికి బోరబండకు చెందిన రాజేశ్ (30) అనే వ్యక్తితో వివాహేతర ఏర్పడింది. విజయ్‌కుమార్, శ్రీలక్ష్మిల వివాహానికి ముందే వీరిద్దరు ప్రేమికులు. వీరి సంబంధాన్ని పెళ్లి అయిన తర్వాత కూడా భర్తకు తెలియకుండా కొనసాగించారు. ఎప్పటికైనా భర్తకు తెలిస్తే ఇబ్బందేనని, అడ్డుగా ఉన్న భర్తను చంపించాలని భావించిన శ్రీలక్ష్మి భర్త విజయ్‌కుమార్ (40) అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. అంతేకాకుండా భర్త పేరిట మేడ్చల్, ఎల్లారెడ్డిగూడలో సొంత ఇళ్లు కూడా ఉన్నాయి. భర్తను చంపి, ఆస్తి అమ్ముకొని ఆ డబ్బుతో ఎంజాయ్ చేద్దామని ప్లాన్ వేసింది. ఈ విషయం రాజేశ్‌తో చెప్పడంతో సరేనన్నాడు. ఇందుకు రాజేశ్ సనత్‌నగర్‌కు చెందిన పటోళ్ల రాజేశ్వర్‌రెడ్డి (40) అనే రౌడీషీటర్ సాయం కోరాడు. రాజేశ్వర్‌రెడ్డిపై ఇప్పటికే పలు స్టేషన్లలో 8 కేసులున్నాయి. ఎల్లారెడ్డిగూడలో ఉంటున్న ఇల్లు వాస్తు బాగోలేదని చెప్పి, శిఖర అపార్టమెంట్‌కు మకాం మార్పించి కుట్రకు తెరలేపింది భార్య. భర్త హత్యకు రాజేశ్వర్‌రెడ్డి, మహ్మద్ మైతాబ్ అలియాస్ బబ్బన్‌కు భారీగా సుపారీ అందజేసింది.
చంపొద్దని వేడుకుంటున్నా కనికరించని కర్కశులు
పథకం ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి 1న విజయ్‌కుమార్ తన పిల్లల్ని స్కూలులో దింపేందుకు వెళ్లాడు. అనంతరం రాజేశ్, రాజేశ్వర్‌రెడ్డి, మైతాబ్‌ను శ్రీలక్ష్మి ఇంటికి పిలిపించి బాత్రూంలో దాచింది. పిల్లల్ని దింపి విజయ్ ఇంటికి రాగానే శ్రీలక్ష్మి లోపలి నుంచి గడియపెట్టింది. అనంతం బాత్రూం గడియ తీయడంతో వారంతా బయటకు వచ్చి డంబెళ్లు, ఇనుపరాడ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. తనను చంపొద్దని వేడుకుంటున్నా కనికరించని ఆ ముగ్గురూ అతన్ని చంపి, బాత్రూంలో పడేసి వెళ్లిపోయారు. ఇంట్లో రక్తపు మరకలను శుభ్రంగా తుడిచేసి, భర్త శవానికి దుస్తులు మార్చి, గుండెపోటు వచ్చి, తల గోడకు తగిలి భర్త మరణించాడని ఏడుపులంకించుకుంది. నిజమేనని నమ్మిన కుటుంబ సభ్యులు, బంధువులు అదేరోజు శ్రీనగర్ కాలనీ శ్వశానవాటికలో విజయ్ దహన సంస్కారాలు పూర్తి చేశారు. నిజానికి మృతుడి కుటుంబ ఆచారాల ప్రకారం పూడ్చిపెట్టి అంత్యక్రియలు చేయాల్సి ఉండగా.. ఆధారాలు లభించకుండా భార్య దహనం చేయించింది.
మూడు నెలల తర్వాత బయటపడిన నేరం
ఇంతలో ఏం జరిగిందో తెలియదుగానీ విజయ్ హత్య అనంతరం వికారాబాద్ పారిపోయిన రాజేశ్వర్‌రెడ్డిలో పశ్చాతాపం మొదలైంది. విజయ్‌ను కొడుతుండగా సందర్భంలో తనను చంపొద్దని అతను చేసిన ఆర్తనాధాలు గుర్తుకొచ్చి పశ్చాత్తాపంతో కుంగిపోయాడు. మనఃశాంతి కరువైన రాజేశ్వర్‌రెడ్డి గురువారం మధురానగర్ ఠాణాకు వచ్చి నేరం అంగీకరించాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడు ఇచ్చిన సమాచారం మేరకు రాజేశ్వర్‌రెడ్డితోపాటు శ్రీలక్ష్మి, రాజేశ్, మైతాబ్‌లను కూడా అరెస్ట్ చేశారు. హత్యతోపాటు ఆధారాలు మాయం చేసినందుకు 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో అటు తండ్రి మరణం, ఇటు తల్లి అరెస్ట్‌తో పిల్లలిద్దరూ అనాథలయ్యారు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం