శని.. ఈ మాట వినగానే ఉలిక్కి పడతారు చాలామంది. ఏదో కీడు జరుగుతుందని శంకిస్తారు. శని ప్రభావం నుంచి తప్పించుకోవాలని, నానారకాల మార్గాలు అన్వేషిస్తారు. కానీ, చీకటి వెలుగుల సంయోగ గ్రహం శనైశ్చరుడు. భయంకరుడు కాదు నిత్య శుభంకరుడు. ఆయన తీక్షణ దృష్టికి రావణుడంతటి వాడు కూలిపోయాడు. అదే చల్లని చూపు చూశాడో.. బికారి కూడా అందలం అందుకుంటాడు. కష్టపడేవాళ్లంటే శనిదేవుడికి ఇష్టం. వారిని ఓ కంట కనిపెడుతూ ఉంటాడు. అష్టకష్టాలు పెడతాడన్న పేరున్న ఆయనే అష్ట ఐశ్వర్యాలనూ అనుగ్రహిస్తాడు. ఆధ్యాత్మికంగానూ అద్భుతమైన స్థాయికి తీసుకెళ్తాడు.
గోచార రీత్యా ఏల్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని బాధితులు శనైశ్చరుడి అనుగ్రహం కోసం యథాశక్తి దానధర్మాలు చేయడం మంచిది. ముఖ్యంగా దివ్యాంగులకు సాయం చేస్తే శనైశ్చరుడు సంతృప్తి చెంది శుభాలు కలిగిస్తాడు. బీదసాదలకు అన్నం పెడితే ఆనందంతో చేయూతనిస్తాడు. కార్మికులను ఆదరిస్తే శనీశ్వరుడు సంతృప్తి చెందుతాడు. ఉన్నదాంట్లో ఎంతోకొంత దానం ఇవ్వడం వల్ల శని ప్రసన్నుడు అవుతాడు. ఆంజనేయుడికి ప్రదక్షిణలు, శివాలయంలో అభిషేకం చేయడం ద్వారా కూడా శనైశ్చరుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు.
లౌకిక బంధాల నుంచి విముక్తి పొంది, పరమపదాన్ని చేరుకోవటానికి మనం చేసే సాధనలు సత్ఫలితాలు ఇవ్వాలంటే భవబంధాల మీద మనకు విరక్తి కలగాలి. లౌకిక దృష్టి నుంచి మనసును మరల్చగలిగితేనే సాధనలో ముందడుగు వేయగలుగుతాం. ఇదంతా శని వల్లనే సాధ్యమవుతుంది. భౌతిక ఒత్తిడులకు తలవంచకుండా తల ఎత్తుకు తిరిగే సామర్థ్యాన్ని శని కలిగిస్తాడు.
భౌతిక ఆసక్తుల మీద శని మరింత వ్యామోహాన్ని కలిగిస్తాడు. అన్ని సుఖాలూ అనుభవించాలనే పట్టుదల పెంచుతాడు. శని ప్రభావం వల్ల కష్టాలు పడతామనే భావన అందరిలో ఉంటుంది. అది కొంతవరకు నిజమైనప్పటికీ, అదే సమయంలో శని మనల్ని యోగపరంగా ముందుకు తీసుకువెళ్లి, ఒంటరితనానికి చేరువచేస్తాడు. ఫలితంగా, మనం కర్మయోగులుగా మారే అవకాశం కలుగుతుంది. జాతక చక్రంలో శని సరైన స్థానంలో ఉంటే భౌతిక బంధాల నుంచి సులభంగా మరలగలుగుతారు. దృఢ స్వభావం కలిగి ఉంటారు.
పట్టుదలతో అనుకున్నది సాధించగలుగుతారు. బంధాలు బాధించవు కాబట్టి లక్ష్యాలను చేరుకోగలుగుతారు. యోగ సాధనకు సంసారాన్ని వదలిపెట్టాల్సిన అవసరం లేదనే సత్యాన్ని శని అనుభవపూర్వకంగా తెలియజేస్తాడు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం