November 21, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

పెళ్ళిలో సందడిగా గడిపిన నవ వధువు.. నిద్ర నుంచి మృత్యువు ఒడిలోకి..

పార్వతీపురం మన్యం జిల్లాలో నవవధువు వివాహం జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే అనుమానాస్పద మృతి చెందింది. మక్కువ మండలం దబ్బగెడ్డలో జరిగిన ఈ ఘటన జిల్లాలో కలకలం రేపుతుంది. పార్వతీపురంకు చెందిన వెత్స అఖిలకు, మక్కువ మండలం దెబ్బగడ్డ గ్రామానికి చెందిన భాస్కర్ రావుతో శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో శుభముహూర్తాన అంగరంగ వైభవంగా పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వివాహానికి వచ్చిన కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులతో పెళ్లి వేడుక అంతాసందడిగా మారింది. అర్ధరాత్రి వరకు సాగిన వివాహతంతు అంతా ముగిసిన తరువాత వధువు అఖిల బెడ్ రూమ్‎లోకి వెళ్లి నిద్రలోకి జారుకుంది. ఆ మరుసటి రోజు ఉదయం ఎంతసేపు అయినా అఖిల బెడ్ రూమ్ నుండి బయటకు రాకపోవడంతో కుటుంబసభ్యులు వచ్చి నిద్ర లేపారు. అయితే ఎంత పిలిచినా అఖిల నిద్ర లేవకపోగా అపస్మారక స్థితిలో ఉంది. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వెంటనే అఖిలను మక్కువ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అప్పటికే పరిస్థితి విషమంగా ఉందని గమనించిన వైద్యులు ప్రధమ చికిత్స చేసి అఖిలను సాలూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వెంటనే స్పందించిన వైద్యులు అన్నిరకాల వైద్య పరీక్షలు చేసి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అఖిల మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అఖిల మృతి విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి జరిగిన ఘటనపై కుటుంబ సభ్యులను ఆరా తీశారు. రాత్రి బెడ్ రూమ్‎లోకి వెళ్లి నిద్రపోయిన అఖిల తెల్లవారేసరికి అపస్మారకస్థితిలోకి వెళ్లడం, అనంతరం మృతి చెందడంపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత అఖిల మృతికి సంబంధించిన పూర్తి విషయాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు పోలీసులు. అయితే అఖిల మృతి ఘటన మాత్రం మిస్టరీగా మారింది. అప్పటివరకు వివాహంలో సరదా సరదాగా గడిపిన అఖిల సడెన్‎గా అనారోగ్యానికి గురికావడం, అనంతరం మృతి చెందటం అందరినీ కలచివేస్తుంది. అఖిల ఎలా మృతి చెందిందో తెలియక తలలు పట్టుకుంటున్నారు కుటుంబసభ్యులు. వివాహం జరిగి నిండు నూరేళ్లు కుటుంబంతో సంతోషంగా గడుపుతుందని అనుకున్న తమ కుమార్తె వివాహం జరిగిన కొన్ని క్షణాల్లోనే మృత్యువు ఒడిలోకి వెళ్లడం జీర్ణించుకోలేక గుండెలవిసేలా రోధిస్తున్నారు అఖిల తల్లిదండ్రులు. ఇంట్లో శుభకార్యం జరిగిందన్న మధురక్షణాలు క్షణాల్లో ఆవిరై విషాదంలో మునిగిపోయారు వరుడు భాస్కరరావు కుటుంబసభ్యులు.

Also read

Related posts

Share via