ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఎన్డీయే పార్టీలు ముందుకెళ్తున్నాయి.తెలుగుదేశం-జనసేన-బీజేపీలు ఇప్పటికే సీట్ల కేటాయింపు,అభ్యర్ధుల ఎంపిక దాదాపు చివరి దశకు చేరుకుంది. తెలుగుదేశం పార్టీకి కేటాయించిన 144 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికే 139 మంది అభ్యర్ధులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఇక పార్లమెంట్ సీట్లలో కూడా మొత్తం 17 స్థానాలకు గాను 13 మంది అభ్యర్ధుల ఎంపిక కూడా పూర్తయింది..ఇక జనసేనలో మొత్తం 21 అసెంబ్లీ స్థానాలకు గాను 16 స్థానాలకు అభ్యర్ధుల ప్రకటన పూర్తయింది. రెండు పార్లమెంట్ స్థానాలపైనా స్పష్టత వచ్చింది. బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్ధుల ప్రకటన చేయలేదు…అయితే మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లో ఎలా వెళ్లాలనే దానిపై దృష్టి పెట్టాయి. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఎన్నికల నియమావళి అమలు, నామినేషన్ల సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులకు వర్క్ షాప్ నిర్వహించారు.
ఈ వర్క్ షాప్ లో ఇప్పటి వరకూ ప్రకటించిన స్థానాల అభ్యర్ధులతో పాటు మిగిలిన స్థానాల ఇంచార్జిలు,ఆయా నియోజకవర్గాల పరిశీలకులు హాజరయ్యారు..టీడీపీ నుంచి ఆ పార్టీ అధినేత చంద్రబాబు వర్క్ షాప్ లో పాల్గొని అభ్యర్ధులకు దిశానిర్ధేశం చేసారు…జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ తో పాటు కందుల దుర్గేష్ హాజరయ్యారు..బీజేపీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ శ్రీపాద సత్యనారాయణ,పాతూరి నాగభూషణం హాజరయ్యారు..క్షేత్ర స్థాయిలో మూడు పార్టీలు కలిసి సమన్వయం చేసుకోవడంతో పాటు ఎక్కడా విబేధాలు లేకుండా చూసుకోవాలని అభ్యర్ధులకు చంద్రబాబు దిశానిర్ధేశం చేసారు…వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కు కేంద్రంలో 400 సీట్లు,ఏపీలో 160 అసెంబ్లీ స్థానాలు,25 లోక్ సభ స్థానాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు తెలిపారు.
టీడీపీలో కష్టపడిన వారికి సీట్లు ఇవ్వలేకపోయాం: చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులకు వర్క్ షాప్‌లో పొత్తుల అంశంపై పార్టీ నేతలకు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు చంద్రబాబు. పొత్తులు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందనే దానిపై అభ్యర్ధులకు వివరించారు. గతంలోనూ అనేకసార్లు పొత్తులు పెట్టుకున్నామన్న చంద్రబాబు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఈసారి జనసేన, బీజేపీతో పొత్తులో భాగంగా పార్టీ కోసం కష్టపడిన వారికి సీట్లు ఇవ్వలేకపోయామని చెప్పారు.టీడీపీ వదులుకున్న 31 స్థానాల్లో అభ్యర్ధులు పార్టీ కోసం కష్టపడిన వారేనని, అలాగే జనసేనలో గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికి కూడా ఈసారి సీట్లు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని చెప్పారు.
ఆలపాటి రాజా,పీలా గోవింద్,బూరుగుపల్లి శేషారావు,దేవినేని ఉమా లాంటి నేతలకు కూడా టిక్కెట్లు ఇవ్వలేకపోయానన్నారు..అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తానని బాబు మరోసారి స్పష్టం చేసారు. భేషజాలు పక్కన పెట్టి గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని సూచించారు. ప్రజలు గెలవాలంటే దేశంలో, రాష్ట్రంలో ఎన్డీయే గెలవాలని అన్నారు. ఈసారి ప్రతి అభ్యర్ధి చాలా అప్రమత్తంగా ఉండాలని, అభ్యర్ధుల ఎంపిక కోసం నాలుగైదు సార్లు సర్వేలు చేసి ఎంపిక చేసానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈసారి కడపలో కూడా గెలుస్తామని నేతలకు తెలిపారు.
ఇక రాష్ట్రంలో ఎన్డీయే కూటమికి 160 అసెంబ్లీ స్థానాలు లక్ష్యంగా పనిచేయాలని సూచించారు వచ్చే 25 రోజుల పాటు అభ్యర్ధుల పనితీరుపై విశ్లేషణ చేస్తామన్నారు. పనితీరు బాగోలేని వారికి పార్టీ కార్యాలయం నుంచి మళ్లీ ఫోన్‌లు వస్తాయని సున్నితంగా హెచ్చరించారు. తాను కూడా 160 నియోజకవర్గాల్లో పర్యటిస్తానని బాబు తెలిపారు.ఎన్నికల ప్రచారంలో ప్రతి ఒక్కరినీ కలుపుకుని ముందుకు వెళ్లాలని. ప్రతి ఇంటిని మూడు సార్లు టచ్ చేయాలని సూచించారు…ఇక నామినేషన్ల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు,ఎన్నికల కోడ్ పై టీడీపీ ఎలక్షన్ టీం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అభ్యర్ధులకు వివరించింది.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025