SGSTV NEWS online
CrimeTelangana

వైద్యం వికటించి.. విద్యార్థిని మృత్యువాత



మఠంపల్లి: అర్హత లేని వ్యక్తి చేసిన చికిత్స వికటించి విద్యార్థిని మృతిచెందిన ఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడుతండాలో బుధవారం చోటుచేసుకుంది, స్థానికులు తెలిపిన ప్రకారం… గ్రామానికి చెందిన శంకర్, కుమారి దంపతుల కుమార్తె రమావత్ ప్రమీల(13) నకిరేకల్ మండలం అయిటిపాముల గురుకుల విద్యాలయంలో 8వ తరగతి చదువుతోంది. నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతుండటంతో అక్కడి ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. దాంతో తల్లిదండ్రులు బాలికను మంగళవారం ఇంటికి తీసుకెళ్లారు. బుధవారం పెదవీడు అంబేడ్కర్ కూడలిలో ఉన్న పీఎంపీ వద్దకు తీసుకెళ్లారు. ఆయన పరీక్షించి… సూదిమందు వేసిన కొద్ది నిమిషాలకే బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే పీఎంపీ తన కారులో బాలికను హుజూర్నగర్కు తరలించి చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో కోదాడకు తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో బాలిక ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

Also read

Related posts