SGSTV NEWS online
Andhra PradeshCrime

పట్టభద్రుల ‘నేర’పరితనం!



కాకినాడ: బాగా చదువుకున్న పట్టభద్రులు పెడదారి పట్టారు. అంతర్రాష్ట్ర స్మగ్లర్లుగా మారారు. లిక్విడ్‌ గంజాయి(హషీష్‌ ఆయిల్‌) అక్రమ రవాణా చేస్తూ శుక్రవారం పట్టుబడ్డారు. వీరి విద్యార్హతలు చూసి పోలీసులూ విస్తుపోయారు. గండేపల్లి మండలం జెడ్‌.రాగంపేట సమీపంలోని ఎన్‌హెచ్‌–16పై శుక్రవారం ఉదయం నిర్వహించిన తనిఖీల్లో ఐదుగురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 5 కేజీల లిక్విడ్‌ గంజాయి, రెండు కార్లు, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు సాయంత్రం కాకినాడలో కేసు వివరాలను వెల్లడించారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ తెలిపిన వివరాల మేరకు.. 

నలుగురు పట్టభద్రులే
రెండు కార్లలో లిక్విడ్‌ గంజాయి తరలిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం అందడంతో శుక్రవారం ఉదయం గండేపల్లి ఎస్‌ఐ యూవీ శివనాగబాబు తన సిబ్బందితో కలిసి జెడ్‌.రాగంపేట సమీపంలోని టీ షాపు ఎదురుగా మాటు వేశారు. ఉదయం 8 గంటల సమయంలో రెండు కార్లలో వచ్చిన ఐదుగురు వ్యక్తులు గంజాయి ప్యాకెట్లు మార్చుకుంటుండగా పోలీసులు వారిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.అనంతరం విచారణ చేపట్టారు. దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 

అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం ఒంతాడపల్లికి చెందిన బీ ఫార్మసీ పట్టభద్రుడు, కోరుపల్లి రవితేజ(విశాఖలో ఫార్మా కంపెనీ కార్మికుడు), కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ఎస్‌.పైడిపాలకు చెందిన డ్రైవర్‌ నాయిన రాజశేఖర్‌లకు గతంలోనే గంజాయి రవాణా చేసిన చరిత్ర ఉంది. విశాఖపట్నం జిల్లా గోపాలపటా్ననికి చెందిన ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ పట్టభద్రుడు మలిరెడ్డి సాయి రాఘవ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటూ గోవాలో ఫుడ్‌ బిజినెస్‌ నిర్వహిస్తున్నాడు. గోవాలో సాయి రాఘవకు కేరళ రాష్ట్రం పాలక్కాడ్‌కు చెందిన వివేక్‌ వడకేకున్నిన్మెల్‌ (ఎంబీఏ పట్టభద్రుడు, బెంగళూరులో ఎడ్యుకేషనల్‌ కన్సల్టెన్సీ నిర్వాహకుడు), కేరళలోని కొల్లం జిల్లాకు చెందిన ఆకాష్‌ చెరియన్‌ (ఎంబీఏ పట్టభద్రుడు, దుబాయ్‌లో షాప్‌ నిర్వాహకుడు)లతో పరిచయం ఏర్పడింది.

రూ.5 లక్షలకు కొని.. రూ.10 లక్షలకు బేరం
వివేక్, ఆకాష్ లకు లిక్విడ్‌ గంజాయి అవసరం ఉండటంతో సాయి రాఘవను సంప్రదించారు. సాయి రాఘవ తన స్నేహితుడి ద్వారా పరిచయమైన రవితేజకు ఐదు కేజీల హషీష్‌ ఆయిల్‌ కావాలని ఆర్డర్‌ ఇచ్చాడు. దీంతో రవితేజ, రాజశేఖర్‌ ఒడిశాలోని చిత్రకొండకు వెళ్లి సింహాచలం అనే వ్యక్తి వద్ద రూ.5 లక్షలకు 5 కేజీల లిక్విడ్‌ గంజాయిని కొనుగోలు చేశారు. దానిని రూ.10 లక్షలకు విక్రయించేలా సాయి రాఘవతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

ముందుగా అనుకున్న ప్రకారం రవితేజ, రాజశేఖర్‌ ఒక అద్దె కారులో సరుకును తీసుకురాగా, రాజమండ్రి సమీపంలోని జెడ్‌.రాగంపేట వద్ద సాయి రాఘవ, వివేక్, ఆకాష్‌ మరో కారులో వచ్చి దానిని తీసుకునేందుకు యత్నించారు. ఈ సమయంలో అక్కడే మాటు వేసిన పోలీసులు నిందితులను అరెస్టుచేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల వద్ద ఐదు కేజీల హషీష్‌ ఆయిల్‌తోపాటు రెండు కార్లు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనంచేసుకుని సీజ్‌ చేశారు. పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్, జగ్గంపేట సీఐ బి.తిరుపతిరావు ఆధ్వరం్యలో లిక్విడ్‌ గంజాయి ముఠా గుట్టురట్టుచేసిన గండేపల్లి పోలీసులను కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ ప్రత్యేకంగా అభినందించారు.

Also read

Related posts