SGSTV NEWS online
Spiritual

కార్తీక మాసంలో వనభోజనం ఎలా చేయాలి? ఉసిరి చెట్టు కింద చేయాల్సిన పూజలు, పాటించాల్సిన నియమాలు



హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి విశిష్ట ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో శివకేశవులకు ప్రత్యేక పూజలు చేయడంతో పాటుగా వనభోజనాలు నిర్వహిస్తారు. బంధువులు, స్నేహితులతో కలిసి వనభోజనాలకు వెళ్లడం అనేది అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆచారం. వనభోజనాలు అంటే కేవలం అందరూ కలిసి భోజనం చేయడమే కాదు. ఉసిరి చెట్టు కింద విష్ణు పూజ, దీపారాధన, దానధర్మాలు వంటి కార్యక్రమాలు నిర్వహించాలి. కార్తీక మాసంలో నిర్వహించే వనభోజనాల్లో పాటించాల్సిన పద్దతులు, చేయకూడని పనులు

కార్తీక మాసం వచ్చిందంటే శివకేశవుల ఆరాధనతో పాటు వనభోజనాల సందడి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరూ కలిసి వనభోజనాలకు తోటలకు, ఉద్యానవనాలకు వెళ్తుంటారు. అయితే వనభోజనం అంటే కేవలం సరదాగా భోజనం చేయడమే కాదు. వనభోజనంలో దీపారాధన, పూజలు దానధర్మాలు ఉంటాయి. అసలు వనభోజనం అంటే ఏమిటి, వనభోజనంలో ఏం చేయాలి

వనభోజనం అంటే ఏమిటి? ఉసిరి చెట్టు ప్రాధాన్యత
వనభోజనంలో ఉసిరి చెట్టుకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఉసిరి చెట్టును ధాత్రీ వృక్షంగా పిలుస్తారు. వనభోజనం ముఖ్య ఉద్దేశం ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం, ఉసిరి చెట్టు కింద శ్రీమహావిష్ణువును ఆరాధించడం, ఉసిరి చెట్టు కింద దానం చేయడం, ఉసిరి చెట్టు దగ్గర దీపాలు వెలిగించడం, ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేయడమని పండితులు వివరించారు. ఉసిరి చెట్టు చేసిన పూజలు, దీపారాధన, దానాలకు విశేష ఫలితం ఉంటుంది

వనభోజనానికి సరైన ప్రదేశం ఏది?
పురాణాల ప్రకారం వనభోజనం అంటే ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేయడం. కాబట్టి వనభోజనానికి వెళ్లే ముందు సరైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. ఉసిరి చెట్లు ఉన్న తోటలు లేదా ఉద్యానవనాలకు మాత్రమే వనభోజనానికి సరైనవి. ఉసిరితో పాటుగా రావి, వేప, కదంబ, మామిడి వృక్షాలు ఉంటే మంచిది. స్థానిక ఆచారాల ప్రకారం వీటికి కూడా పూజలు చేసుకోవచ్చు.


వనభోజనం ఎలా చేయాలి?
వనభోజనానికి వెళ్లే భక్తులు ఉదయాన్నే ఆయా వనాలకు లేదా తోటలకు చేరుకోవాలి. అక్కడ మరొకసారి స్నానం చేసి నిత్యకర్మలు, పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలి. ఉసిరి చెట్టు కింద శ్రీమహావిష్ణువు లేదా సాలగ్రామాన్ని ఉంచి భక్తిశ్రద్ధలతో పూజలు చేయాలి. భక్తులు తమ శక్తిని బట్టి ఉసిరి చెట్టు చుట్టూ 108 లేదా 3, 5, 7, 9 ప్రదక్షిణలు చేయాలి. తర్వాత ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించాలి. బెల్లంతో తయారు చేసిన పాయసాన్ని శ్రీమహావిష్ణువుకు నైవేద్యంగా సమర్పించాలి. కార్తీక మాసంలో వనభోజనం కథ చదువుకోవాలి. అనంతరం పురోహితులకు భోజనం సమర్పించి తర్వాత బంధుమిత్రులతో కలిసి ఆనందంగా భోజనం చేయాలి. ఉసిరి చెట్టు కింద పూజలు చేయడం, భోజనం చేయడం వల్ల పాపాలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు.

వనభోజనంలో చేయకూడని పనులు
వనభోజనాన్ని కేవలం పిక్నిక్‌లా భావించకూడదు. కేవలం ఆటలు, పాటలు, వినోదానికే వనభోజనాన్ని పరిమితం చేయకూడదు. వనభోజనంలో పూజలు, దీపారాధనలు చేయాలి. భోజనం చేసేటప్పుడు వంటకాలను తక్కువ చేసి మాట్లాడకూడదు. ఆహారాన్ని దూషించకూడదని పండితులు చెప్పారు. భోజనం చేసే సమమంలో ఇతరులకు ఆటంకం కలిగించరాదు.

వనభోజనాలు ఏ రోజుల్లో నిర్వహించాలి?
కార్తీక శుద్ధ ద్వాదశి, దశమి, చతుర్దశి, పౌర్ణమి వంటి రోజుల్లో వనభోజనాలు నిర్వహించడం ఉత్తమమని పండితులు తెలిపారు. కార్తీక మాసంలో వనభోజనం నిర్వహించేటప్పుడు ప్రకృతిని గౌరవించాలి. పూజలు చేసేటప్పుడు తోటల్లో, ఉద్యానవనాల్లో చెట్లకు హాని కలిగించకూడదు. ఆహారాన్ని వృథా చేయకుండా ఉండాలి. భక్తిశ్రద్ధలతో ఆనందంగా వనభోజనాలు చేసుకోవాలి.


Related posts