అనంతగిరి/యాలాల: క్రికెట్‌లో రాణిస్తున్న ఓ యువ క్రీడాకారిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మధుకాలనీలో చోటుచేసుకుంది. సీఐ రఘుకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. యాలాల మండలం సంగాయిపల్లితండాకు చెందిన నందిని (17) వికారాబాద్‌లోని మేనమామ రమేశ్ ఇంట్లో ఉంటోంది. ఓపెన్ ఇంటర్ చేస్తూ క్రికెట్‌లో శిక్షణ పొందుతోంది.
మొదటగా అండర్–15 విభాగంలో అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఆల్‌రౌండర్‌గా అద్బుత ప్రదర్శన కనబరుస్తూ ఇటీవల అండర్–19 విభాగంలోనూ అదే రాష్ట్ర జట్టుకు ఎంపికై జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది. లీగ్ మ్యాచ్‌లో సత్తా చాటి సెలెక్టర్ల దృష్టిలో పడింది. ఏం జరిగిందో తెలియదు గాని గురువారం సాయంత్రం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. గమనించిన నందిని మేనమామ రమేశ్ వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే నందిని మృతి చెందినట్టుగా వైద్యులు ధ్రువీకరించారు.
తమ కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు యువకులు ప్రేమించాలంటూ వెంటపడి వేధించారని, ఈ కారణంగానే నందిని ఆత్మహత్య చేసుకొని ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి మొబైల్ ఫోన్, చాటింగ్, కాల్ రికార్డింగ్ ఇతర ఆధారాలను విశ్లేషంచే పనిలో నిమగ్నమయ్యారు.
వేధింపులకు గురిచేసిన ఇద్దరూ స్థానికులు కాదని సమాచారం. నందిని మృతికి కారణమైన ఇద్దరిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబీకులు వికారాబాద్ ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను సముదాయించి శాంతింపజేశారు.
సంగాయిపల్లితండాలో విషాదం
యాలాల మండల పరిధిలోని సంగాయిపల్లితండాకు చెందిన నందిని ఆత్మహత్యకు పాల్పడటంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తండాకు చెందిన ప్రేమ్‌సింగ్–శాంతిబాయి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. రెండో కూతురు నందిని చిన్నప్పటి నుంచి వికారాబాద్‌లోని మేనమామ రమేశ్ వద్ద ఉంటూ చదువుకుంటోంది. చదువుతోపాటు క్రికెట్‌పై ఆసక్తి ఉండటంతో మేనమామ కూడా కోచ్ కావడంతో నందిని క్రికెట్‌లో శిక్షణ పొందింది. శుక్రవారం మధ్యాహ్నం తండాలో నందిని అంత్యక్రియలు పూర్తయ్యాయి.
Also read
- 5.6 అడుగుల అమ్మాయిలే కావాలి.. శరీరంపై మచ్చలు ఉండకూడదు!
- అండర్-19 క్రికెటర్ మృతి.. తల్లిదండ్రుల సంచలన ఆరోపణలు!
- ఓఆర్ఎస్’ అనుకుని… ఎలుకల మందు తాగడంతో విషాదం!
- Andhra News: పాకల తీరానికి కొట్టుకువచ్చిన మరోబోటు.. మత్స్యకారుల్లో మళ్లీ కలకలం!
- సూర్యదేవుడి రథానికి ఏడు గుర్రాలే ఎందుకు? సప్త వర్ణాలు, సప్త దినాల వెనుక ఉన్న రహస్యం ఇదే!





