గంజాయి స్మగ్లర్లు రూటు మార్చారు.. కొత్త ఎత్తులు వేస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పేందుకు ఎస్కార్ట్ వాహనం.. గంజాయిని రహస్యంగా తరలించేందుకు మరో కారు. ఇలా పక్కా స్కెచ్‌తో బయలుదేరిన ఆ ముఠాకు అనుకోని బ్రేక్ పడింది. మార్గ మధ్యంలో కారు బ్రేక్‌డౌన్ కావడంతో అసలు బాగోతం బట్టబయలైంది. ఈజీ మనీ కోసం మొదలుపెట్టిన అక్రమ వ్యాపారం.. చివరకు కటకటాల పాలయ్యే పరిస్థితి తెచ్చింది.
మహారాష్ట్ర బీడ్ జిల్లాకు చెందిన ఆకాష్ విజయ్ దాబెకర్, బుల్ఢానా జిల్లాకు చెందిన ఆకాష్ దిలీప్ మోరేతో పాటు మరో ముగ్గురు ముఠాగా ఏర్పడ్డారు. ఈజీ మనీ కోసం పథకం వేశారు. ఒక్కొక్కరు రూ.50 వేల చొప్పున పెట్టుబడి పెట్టి ఒడిశాలోని జగన్నాథపురి ప్రాంతానికి వెళ్లారు. అక్కడ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి కిలో రూ.2 వేల చొప్పున 112 కిలోల గంజాయిని రూ.2.24 లక్షలకు కొనుగోలు చేశారు. అక్కడి నుంచి గంజాయిని 41 ప్యాకెట్లుగా తయారు చేసి ఇన్నోవా కారులో లోడ్ చేశారు. పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు మరో కారును ఎస్కార్ట్‌గా ఏర్పాటు చేసుకున్నారు. కారు ముందు వెళ్తుంటే.. వెనుక గంజాయి లోడ్‌తో ఇన్నోవా ప్రయాణించేలా ప్లాన్ చేశారు. మార్గమధ్యంలో పోలీసుల కదలికలను గమనిస్తూ వెనుక వస్తున్న కారుకు సమాచారం అందించేలా వ్యూహం రచించారు.
స్మగ్లర్ల ప్లాన్‌ను.. తలకిందులు చేసిన కారు బ్రేక్‌డౌన్..
ముందు కారు ఎస్కార్ట్ చేస్తూ ఒడిస్సా నుంచి పోలీసులకు చిక్కకుండా వచ్చారు. గంజాయి స్మగ్లర్లు.. ఈనెల 7వ తేదీన రాత్రి సూర్యాపేటకు చేరుకున్నారు. హైవే అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలోకి రాగానే గంజాయి లోడ్‌తో వెళ్తున్న ఇన్నోవా కారు అకస్మాత్తుగా బ్రేక్‌డౌన్ అయింది. ఆ వాహనానికి రిపేర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ రాత్రివేళ మెకానిక్ లు లేకపోవడంతో నిందితులు వాహనాన్ని రోడ్డు పక్కన వదిలేసి ఎస్కార్ట్ కారులో వెళ్లి పోయారు. అనుమానాస్పదంగా కారు నిలిపి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన సూర్యాపేట టూ టౌన్ పోలీసులు కారును తనిఖీ చేయగా.. గంజాయి గుట్టు బయటపడింది. కారులోని 41 ప్యాకెట్లలో 112 కిలోల గంజాయిని గుర్తించారు. వెంటనే గంజాయితో పాటు ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు.
వాహనం కోసం తిరిగొచ్చి.. పోలీసులకు చిక్కారు..
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, వాహనాన్ని వదిలేసి పరారైన నిందితులు.. దాన్ని తిరిగి తీసుకెళ్లేందుకు మళ్లీ సూర్యాపేటకు రావడం వారి కొంపముంచింది. నవంబర్ 12న వాహనం కోసం వచ్చిన ఆకాష్ విజయ్ దాబెకర్, ఆకాష్ దిలీప్ మోరేలు అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. పోలీసులు గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉండటంతో వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని, నిందితుల నుంచి మూడు సెల్ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ కె. నరసింహ తెలిపారు.
మొత్తానికి.. పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు ఎన్ని ఎత్తులు వేసినా చివరకు ఓ చిన్న సాంకేతిక లోపం స్మగ్లర్ల కొంపముంచింది.
Also read
- తెలంగాణ : ప్రశ్నించడమే ఆమె చేసిన పాపమా.. భర్త కోపానికి బలైన భార్య.. అసలేం జరిగిదంటే?
- సినిమాను మించిన ట్విస్ట్.. 15 కిలోల బంగారం దోచేసిన సోషల్ మీడియా స్టార్స్.. ఎలా చిక్కారంటే..?
- Suryapet: బ్రేక్ డౌన్ అయిన కారు పెద్ద గుట్టే విప్పింది.. అసలు ఏమైందంటే..?
- Hyderabad: ఇద్దరు తండ్రులు.. రెండు కన్నీటి కథలు!
- కళ్లలో కారం చల్లి వాటర్ ట్యాంకర్ డ్రైవర్ దారుణ హత్య.. 8 ఏళ్ల తర్వాత నాంపల్లి కోర్టు సంచలన తీర్పు!





