అమ్మ ఒడిలో వెచ్చగా సేదతీరాల్సిన ఆ పసికందు.. లోకమంటే ఏమిటో తెలియని ఆ నవజాత శిశువును చెట్ల పొదల్లో విగతజీవిగా పడేశారు గుర్తు తెలియని దుండగులు. కవర్ల చుట్టి నాలా పక్కన పడేశారు. చివరకు అభం శుభం తెలియని ఆ పసికందును వీధి కుక్కలు పీక్కుతిన్నాయి. ఈ హృదయవిదారక ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది.
కొమురంభీం జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామంలోని గోలక్ష్మి కాలనీ సమీపంలో ఈ దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని దుండగులు చెట్ల పొదల్లో వదిలివెళ్లారు. అదే సమయంలో అటుగా వచ్చిన వీధి కుక్కలు ఆ పసికందుపై దాడి చేశాయి. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు బహిర్భూమికి వెళ్లిన సమయంలో కుక్కలు పసికందును పీక్కుతింటుండటాన్ని గమనించారు. వెంటనే కుక్కలను తరిమి కొట్టే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆ నవజాత శిశువు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. పసికందుకు కాళ్లకు తీవ్ర గాయాలైనట్లు పేర్కొన్నారు.
ఎవరు వదిలేశారు.. అప్పటికే చనిపోయిందా?
అసలు ఆ పసికందును అక్కడికి తీసుకొచ్చి వదిలేసిందెవరు.? ఏ పరిస్థితుల్లో ఆ చిన్నారిని నిర్దాక్షిణ్యంగా పొదల్లో పడేశారు..? పాపను అక్కడ వదిలేసే సమయానికే ప్రాణాలు కోల్పోయిందా..? లేక కుక్కల దాడిలోనే మృతి చెందిందా..? అన్న ప్రశ్నలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఈ ప్రశ్నలకు పోలీసుల దర్యాప్తులోనే సమాధానాలు లభించాల్సి ఉంది. ఘటన సమాచారం అందుకున్న చింతలమానేపల్లి పోలీసులు రంగంలోకి దిగారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పసికందు అప్పుడే పుట్టిన చిన్నారిగా ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. వదిలించుకోవాలనే పసికందును చెట్ల పొదల్లో వదిలేశారా.. లేక నవజాత శిశువు చనిపోవడంతో అలా కవర్లో కుక్కి పడేశారా అన్నది తేలాల్సి ఉంది. పసికందును చెట్ల పొదల్లో పడేసిన వారి కోసం సమీప ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు పోలీసులు.
అమ్మ ఒడిలో సేద తీరాల్సిన పసికందు.. అనాథగా చెట్ల పొదల్లో పడి చివరకు విగతజీవిగా మారడం స్థానికులను కలచివేస్తోంది. ఆ చిన్నారిని అక్కడ వదిలేసింది ఎవరు..? కన్నవారే ఇంత పని చేశారా… మరెవరైనా పడేశారా..? ఏ కారణంతో ఈ దారుణానికి పాల్పడ్డారు.? అన్నది తేలాల్సి ఉంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను గుర్తించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Also read
- ఫ్రెండ్‌తోనే పురుగుల మందు తాగించిన తోటి విద్యార్థులు
- రాప్తాడు నిందితుడు హేమంత్‌కు మరో ఆరోగ్య సమస్య.. ఊపిరితిత్తుల రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తం!
- స్కూల్ నుంచి ఇంటికొచ్చిన పిల్లలకు షాక్.. రక్తపు మడుగులో తల్లి! ఏం జరిగిందంటే..?
- అర్ధరాత్రి ఏటీఎం దోచేద్దామనుకున్నాడు.. అలారమే దొంగకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది!
- వీధి కుక్కల దాడిలో నవజాత శిశువు దుర్మరణం





