మరో నాలుగు రోజుల్లో ఆ ఇంట్లో శుభకార్యం జరగాల్సి ఉంది. చిన్న కుమారుడి నిశ్చితార్థ వేడుక కోసం కుటుంబ సభ్యులంతా ఎంతో ఆనందంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బంధువులను ఆహ్వానిస్తూ.. పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. కానీ ఇంతలోనే విధి ఆ కుటుంబంపై పగబట్టినట్లయింది. శుభకార్యం జరగాల్సిన ఇంట్లో అంతులేని విషాదం నిండింది. నిశ్చితార్థ పనుల కోసం బయటకు వెళ్లిన దంపతులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లచ్యతండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన గుగులోతు సామ (50), పద్మ (45) దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
ఈ నెల 16న వారి చిన్న కుమారుడి నిశ్చితార్థ వేడుక జరగాల్సి ఉంది. దీంతో కుటుంబ సభ్యులంతా శుభకార్య ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో పెళ్లి పనుల నిమిత్తం సామ, పద్మ దంపతులు ద్విచక్ర వాహనంపై మహబూబాబాద్‌కు బయలుదేరారు. వారు తండా ధర్మారం స్టేజి సమీపానికి చేరుకోగానే.. ఎదురుగా వచ్చిన కారు వారి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు ఢీకొట్టిన వేగానికి వారి మృతదేహాలు రోడ్డుకు దూరంగా చెల్లాచెదురుగా పడిపోయాయి. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొని నిలిచిపోయింది.
చిన్న కుమారుడి నిశ్చితార్థానికి నాలుగు రోజుల ముందు తల్లిదండ్రులిద్దరూ ఒకేసారి మృత్యువాత పడటంతో కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. నిన్నటి వరకు పెళ్లి సందడితో కళకళలాడిన ఆ ఇంట్లో ఒక్కసారిగా కన్నీటి రోదనలు మిన్నంటాయి. దంపతుల మృతితో లచ్యతండాలో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రమాద స్థలాన్ని మాజీ ఎంపీ కవిత పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also read
- ఆంధ్రప్రదేశ్ : ఇన్స్టాగ్రామ్ చాటింగ్ వివాదంలో 16 ఏళ్ల యువకుడు కార్తీక్ మృతి
- మరో నాలుగు రోజుల్లో ఇంట్లో శుభకార్యం.. అంతలోనే రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం!
- వివాహేతర సంబంధాల మోజులో కానిస్టేబుల్!
- హైదరాబాద్‌లో వేధింపుల కేసు నమోదు
- బంజారా హిల్స్‌లో స్నేహితుడి హత్య.. కత్తి కొనుగోలు ప్రణాళికతో





