SGSTV NEWS online
CrimeTechnology

మేనబావతో పెళ్లి ఇష్టం లేక రైల్లోనుంచి దూకి యువతి



జనగామ జిల్లా: ఇష్టంలేని పెళ్లి సంబంధంతో మనస్తాపానికి
గురైన ఓ యువతి రైలులోనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండల పరిధిలో శనివారం తెల్ల వారుజామున చోటుచేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా నర్మెట మండలం అమ్మాపురానికి చెందిన కుంటి బాబురావు కుటుంబం సుమారు 20 ఏళ్ల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం శేషగిరినగర్ కాలనీకి వెళ్లి స్థిరపడ్డారు. బాబురావు ఎలక్ట్రిషియన్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన కుమార్తె శ్రావణి (24) ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తోంది. చిన్నప్పటినుంచి తల్లిదండ్రుల గారాలపట్టిగా పెరిగిన ఆమెకు కొంతకాలం క్రితం మేనబావతో వివాహం నిశ్చయమైంది.

రైలు ప్రయాణంలో విషాదం..

గత నెల30వ తేదీ (శుక్రవారం) రాత్రి పెళ్లిదుస్తులు కొనుగోలు చేసేందుకు శ్రావణి మణుగూరు ఎక్స్ప్రెస్ రైలులో సికింద్రాబాద్కు బయలుదేరింది. ప్రయాణ సమయంలో ఒకట్రెండుసార్లు కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడింది. శనివారం తెల్ల వారుజామున సుమారు 2.30 గంటల సమయంలో రఘునాథపల్లి మండల శివారు ప్రాంతంలో రైలులోనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు గుర్తించారు.

టికెట్ ఆధారంగా గాలింపు..

ఖమ్మం సమీపంలోకి రైలు వచ్చాక శ్రావణి ఫోన్కాల్స్ స్వీకరించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమె రిజర్వేషన్ టికెట్ను హైదరాబాద్లో ఉంటున్న మేనబావకు పంపించారు. అతను హుటాహుటిన జనగామ రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. రైలు జనగామ స్టేషన్లో లో ఆగగానే టికెట్ ఆధారంగా రిజర్వేషన్ బోగీలో తనిఖీ చేయగా ఆమె బ్యాగు మాత్రమే కనిపించింది. శ్రావణి కనిపించకపోవడంతో వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు గాలింపు చేపట్టగా తెల్లవారుజామున రఘునాథపల్లి సమీపంలో రైల్వే పట్టాల పక్కన ఆమె మృతదేహాన్ని గుర్తించారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని శ్రావణిది గుర్తించారు.

తల్లిదండ్రులకు తీరని శోకం..

మేనబావతో వివాహం ఇష్టం లేకపోవడం, అనారోగ్య సమస్యలతో మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే పోలీసులు చెప్పారు. ఈ నెల 29న ఆమె వివాహం జరగాల్సి ఉండగా, ఉద్యోగం చేస్తూ జీవితంలో స్థిరపడుతున్న కుమార్తె ఇక లేదన్న వార్తతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పెళ్లి సందడి ఉండాల్సిన ఇంట్లో విషాదం అలుముకుంది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఉపేందర్ కేసు నమోదు చేశారు. మృతదేహానికి జనగామ జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఉపేందర్ తెలిపారు.

Also read

Related posts