SGSTV NEWS online
CrimeTelangana

Tragedy: అది ఆత్మహత్య కాదు.. ఫోన్ ఎక్కువగా వాడుతోందని కుమార్తెను గొంతు నులిమి చంపిన కన్నతల్లి..




రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన 14 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి కేసులో దారుణ నిజం వెలుగులోకి వచ్చింది. కూతురు ఆత్మహత్య చేసుకుందంటూ తల్లి అల్లిన కల్పిత కథను పోస్టుమార్టం నివేదిక పటాపంచలు చేయగా, కన్నతల్లే కాలయముడిగా మారి గొంతు నులిమి చంపినట్లు పోలీసులు ఆధారాలతో సహా నిరూపించారు.

కొత్తూరు హనుమాన్ టెంపుల్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ ముయ్యాది రాజు, విజయలక్ష్మి దంపతుల కుమార్తె సువర్చల అలియాస్ లవ్లీ (14) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. సువర్చల నిరంతరం మొబైల్ ఫోన్ వాడటం, చదువుపై శ్రద్ధ పెట్టకపోవడం వల్ల తల్లి విజయలక్ష్మితో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5:30 గంటల సమయంలో ఫోన్ వాడకం విషయమై తల్లీకూతుళ్ల మధ్య మరోసారి వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో విపరీతమైన ఆగ్రహానికి లోనైన విజయలక్ష్మి, కుమార్తెను అల్మారాకు అదిమిపట్టి రెండు చేతులతో గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది.

హత్య అనంతరం నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి విజయలక్ష్మి డ్రామా ఆడింది. కుమార్తె మెడకు చీరను బిగించి ఉరివేసుకున్నట్లుగా అమర్చి, ఏమీ తెలియనట్లు బయటకు వెళ్లి కూరగాయలు కొనుగోలు చేసి వచ్చింది. అనంతరం ఇంటికి వచ్చి కూతురు ఆత్మహత్య చేసుకుందంటూ కేకలు వేసి నాటకమాడింది. మొదట ఈ ఘటనపై కొత్తూరు పోలీసులు BNSS సెక్షన్ 194 కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

అయితే, ఉస్మానియా జనరల్ ఆసుపత్రి వైద్యులు అందించిన పోస్టుమార్టం నివేదికలో బాలిక గొంతు నులిమివేయడం వల్లే చనిపోయిందని, ఉరివేసిన ఆనవాళ్లు బలవంతంగా సృష్టించినట్లు స్పష్టమైంది. దీంతో పోలీసులు కేసును BNS సెక్షన్ 103(1) కింద హత్య కేసుగా మార్చారు. విజయలక్ష్మిని తమదైన శైలిలో విచారించగా, ఆమె నేరాన్ని అంగీకరించింది. పోలీసులు ఘటనా స్థలం నుంచి చీర, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని, నిందితురాలిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. షాద్నగర్ జోన్ డీసీపీ శ్రీమతి సి. శిరీష రాఘవేంద్ర, ఏసీపీ పి. లక్ష్మీనారాయణల పర్యవేక్షణలో కొత్తూరు పోలీసులు ఈ కేసు మిస్టరీని ఛేదించారు.

Also read

Related posts